అంచేత అది స్థూలంగా కనపడుతున్నది అలాంటి ఈ పృథివి నుంచి జలతత్వం దగ్గరికి పోయేసరికి గంధమనే ఒక గుణం తగ్గి రసాదులైన మిగతా నాలుగే మిగులుతున్నాయి. దానిలో కొంత స్థూలత్వం పోయి సూక్ష్మమయిందది. దానిని కూడా దాటి తేజస్సును సమీపించా మంటే రసమనే మరొక గుణం కూడా పోయి మూడే మిగులుతాయి. అంచేత అది ఇంకా సూక్ష్మం. ఈ రీతిగా మనమాకాశం దాకా ప్రయాణం చేశామంటే ఒక్కొక్క గుణం తగ్గుతూ చివరకొక్క శబ్దగుణమే దక్కుతుంది. అలా తగ్గే కొద్దీ అది సూక్ష్మమవుతూ పోతుంది. సూక్ష్మమయ్యే కొద్దీ రూపాన్ని కోలుపోతుంది. రూపం పోయిందంటే విశాలమై సర్వత్రా వ్యాపిస్తుంది. అప్పుడీ పృథివ్యాది సామాన్యాలన్నీ ఆకాశమనే మహాసామాన్యంలో విశేషాలయి కూచుంటాయి.
ఈ ఆకాశం కన్నా పెద్దది మనమిప్పుడు చెప్పుకొనే ఆత్మ పదార్ధం. “జ్యాయాన్ పృథివ్యాః – జ్వాయానంత రిక్షాత్” అని శాస్త్రవచనం. ఎంచేతనంటే దానికి శబ్దమనే ఒక గుణమైనా ఉన్నది. దీనికదీ లేదు. ఇది నిర్గుణం A substance without property నిర్గుణం గనుకనే ఇది నిరతిశయ సూక్ష్మమైన The subtlest పదార్ధం. అంత సూక్ష్మమెప్పుడయిందో అప్పుడతి స్వచ్ఛమూ-అతివిశాలమూ-సర్వవ్యాపకమూ కూడా కాక తప్పదు. అంచేత అదే అన్నింటికన్నా మహత్తరమైన సామాన్యం Sui generis ఇలాంటి సామాన్యాన్ని భావించామంటే ఇక ఆకాశాదులైన సర్వసామాన్య విశేషాలు అందులోనే అంతర్భవిస్తాయి. అంతర్భవించటమంటే మరలా అక్కడ స్వరూపంతో ఉంటాయని కాదు. అలా ఉండటమనేది అనాత్మ జగత్తులోనే. ఆత్మ చైతన్యంలో ప్రవేశించేసరికలా పృథగ్భూతంగా Separate ఉండటమనేది పొసగదు. చైతన్యానికి బాహ్యంగా స్వతంత్రమైన సత్తా ఏదీ లేదని గదా ప్రతిపాదించాము. ఆ మాటకు వస్తే చైతన్యమే మన అవిద్యా దోషంవల్ల ఆయా అనాత్మ రూపాలుగా భాసిస్తున్నదాయె. అంచేత చైతన్యానికి భిన్నం కావని ఎప్పుడపవదించామో అప్పుడవన్నీ మరలా మనకు ఆత్మ రూపంగానే దర్శనమిస్తాయి. ఇస్తే ఒకే ఒక ఆత్మతత్త్వమఖండం గానూ Indivisible అపరోక్షంగానూ Immediate అనుభవానికి రాక తప్పదు.
మొత్తంమీద అన్నిటికన్నా విశేష Lowest particular మీ శరీరాది సంఘాతమైతే అన్నిటికన్నా సామాన్య Highest general మయినది ఆత్మచైతన్యం సృష్టిలో. దీనిని దానిని రెంటినీ భావన చేయగలిగింది మానవుడి మనస్సు.
Page 124