ఇంతకుముందే చెప్పామొక విషయం. సుఖమూ, దుఃఖమూ, ఉత్సాహమూ, ధైర్యమూ, భయమూ, భక్తీ ఇలాంటి భావాలు శతసహస్రమున్నాయి. వీటన్నిటికీ వస్తువులకు లాగా ఒకనిర్దిష్టమయిన రూపం లేదు. ఏ రూపమూ లేకున్నా అవి మనసుకు రావటం లేదా మనకు సంవేదన Experience కావటం లేదా. రూప సహితమయిన వస్తువుల నెలా గ్రహిస్తున్నామో రూప రహితమయిన భావాలను కూడా అలాగే గ్రహించగలుగుతున్నాము. కాబట్టి ఆత్మకొక ఆకారమంటూ లేనందువల్ల దానిని మనం భావించలేమనేది ఒక ఆక్షేపణ కాదు. సుఖాదిభావాల మాదిరే అది సుఖంగా భావించవచ్చునంటారు భగవత్పాదులు.
అసలు మానవుడి మనస్సుకే ఒక అద్భుతమయిన శక్తి ఉంది. అది రెండంచులా పదునైన కత్తి. సవికల్పంగా Analytic భావించగలదు. నిర్వకల్పంగానూ Syn-thetic భావించగలదు. సవికల్పమయిన దృష్టికేది చూచినా విశేష రూపంగా కనిపిస్తుంది. అదే నిర్వికల్పమయిన దృష్టితో చూస్తే అంతకంతకది సూక్ష్మమయి సామాన్యరూపంగా భాసిస్తుంది. మనమొక వృక్షాన్నే చూస్తున్నామనుకోండి. అది కొమ్మలూ రెమ్మలూ - పూలు కాయాలూనని ప్రత్యవయవమూ పరకాయించి చూస్తే అది సవికల్ప దృష్టి. అలా కాక దాని నా పాదమస్తకమూ ఒక్కసారి అలవోకగా చూచామంటే అలికినట్టు ఒకే ఒక అఖండ పదార్ధంగా భాసిస్తుంది. అది నిర్వకల్ప దృష్టి. నిర్వికల్ప మెక్కువయ్యే కొద్దీ విశేషాలంతకంతకు సురిగిపోయి సామాన్యమైన General తత్త్వం బయటపడుతుంది. కేవలమొక వృక్షమని చూచినప్పుడు దాని కొమ్మలూ రెమ్మలూ అనే విశేషాలు అలాగే గదా కనపడకుండా పోతాయి. అలాగే ఆ వృక్షాన్ని కూడా ఒక పెద్ద వనంగా దర్శించినప్పుడది కూడా ఒక విశేషమయి Particular దానిలో లీనమవుతుంది.
ఈ సూత్రాన్నే Principle ఇక కొంత పొడిగిస్తే ఆ వనం కూడా ఇలాంటి వననదీ పర్వతాదులన్నింటికీ ఆశ్రయమైన పృథివీ సామాన్యంలో చేరిపోతుంది. పోతే ఈ పృథివి జరాయుజాది చతుర్విధ భూతరాసులకూ నిలయం. భూత భౌతికాలన్నీ విశేషాలైతే Particulars ఇది వాటన్నిటికీ కలిపి సామాన్యం general శబ్ద స్పర్శరూప రస గంధాలనే అయిదు గుణాలూ ఉన్నాయి దానికి.
Page 123