దీనికాయన ఒక చక్కని ఆఖ్యాయిక Anecdote కూడా సెలవిచ్చారు మనకు. ఒక జమీందారు దగ్గర ఒక నౌకరు చేరాడట. వాడొక శుద్ద పల్లెటూరి మొద్దు. ఒకనాడేదో అవకతవక చేస్తే అధికారికి కోపం వచ్చి - ఛీ వెధవా నీవు మనిషివే కాదు పొమ్మని తిట్టి పంపాడట. వాడు నిజంగానే తాను మనిషికానేమో అనుకొని అక్కడా ఇక్కడా తిరుగుతున్నాడట. దారిలో ఎవడో మనలాంటి వాడు తారసిల్లి ఎవడయ్యా నీవు - ఎక్కడికి వెళ్ళుతున్నావని అడిగాడట. అయ్యా! నన్ను మనిషివి కావని తిట్టి పంపాడండీ మా యజమాని. నేను మరలా మనిషినయ్యే మార్గముంటే చూడమని బ్రతిమలాడాడట వాడు. వీడు బ్రహ్మాండమైన మూర్ఖుడని గ్రహించి వాడు – ఒరే నీవు చెట్టువుకావు - చేనువుకావు - పశువువు కావు - పక్షివి కావు. ఇవి ఏవీ కాకపోతే మరి నీవు మనిషివి గాక మరేమవుతావని నచ్చజెప్పాడట. మనిషి వెందుకు గావని తెలియజెప్పినపుడు కూడా నేను మనిషినే ననివాడు తెలుసుకోలేకపోతే నీవు మనిషివేనని సూటిగా చెబితే మాత్రం వాడు గ్రహించగలడా.
అలాగే ప్రస్తుతమిది కాదిది కాదని దేశ కాలాదులతో సహా అన్ని భావాలనూ ప్రత్యాఖ్యానం Refuted చేసిన తరువాత పరిశిష్ట Remained మైన దేదో అదే నీ స్వరూపమని శాస్త్రం బోధిస్తుంటే - ఇది గదా నేనని వెంటనే మనం గ్రహించగలిగి ఉండాలి. ఆ మాటకు వస్తే ఆ నేననే భావన నా కిప్పుడుండనే ఉన్నది. క్రొత్తగా వెదకి పట్టుకోవలసింది కూడా కాదు. పట్టుకోక పూర్వమే పట్టుబడి ఉందది. మన శరీరాని కిప్పుడొక ఒడ్డూ పొడుగూ-ఉరువూ-బరువూ ఇవన్నీ ఉన్నాయంటే అవి నిత్యమూ మనంకొలత వేసి, తూకం వేసి చూచుకొంటున్నామా. అలా చూడకుండానే నేనింత ఉన్నానని మన మనసుకది సంవేద్యమానం Being felt కావటం లేదా. అలాంటప్పుడంతకన్నా సన్నిహితమైన మన స్వరూపమే Very self అయిన ఆత్మను మనం ఫలానా అని గుర్తించలేక పోవటమేమిటి. ఆగంతుకమైన పదార్థమైతే ఒకవేళ భావించకపోవచ్చు. స్వరూపమే అయిన దాన్ని ఎలా భావించలేము. ఏ రూపమూ లేకపోయినా దాన్ని భావించగలం.
ఆ మాటకు వస్తే పంచభూతాలలోనే రెండు భూతాల కసలు రూపమే లేదు. పృథివ్యప్తేజస్సుల వరకే రూపమనేది. వాయ్వాకాశాలు రెండింటికీ రూపమే లేదు. లేకున్నా ఇది వాయువనీ, ఇది ఆకాశమనీ, మనసుకు రావటం లేదా. అంతేకాదు.
Page 122