#


Back

   మనసుకిలాంటి స్వభావముండటం మూలాన్నే తత్త్వమసి లాంటి వాక్యం మనకు తత్పదార్ధమైన ఆ బ్రహ్మ స్వరూపాన్ని వర్ణించి చెప్పగానే తదాకారమైన వృత్తి అనీ, అఖండాకార వృత్తి అనీ, ఆత్మాకారవృత్తి అనీ, అనేక సంజ్ఞలతో వ్యవహరిస్తారు. ఇంతకూ ఒకపర్వతాన్ని వర్ణించినప్పుడు మనకు పర్వతాకార వృత్తి ఎలా ఏర్పడుతుందో అలాగే బ్రహ్మాన్ని వర్ణించినప్పుడు కూడా బ్రహ్మాకారవృత్తి ఏర్పడి తీరుతుంది.

   అయితే మనకున్న ఆక్షేపణ అల్లా ఒక్కటే. పర్వత పట్టణాదులంటే అవి మన చుట్టూ ఉన్న లోకంలోని పదార్థాలు. వాటికొక విశిష్టమైన ఆకృతి ఉన్నది. కాబట్టి వాటి నెవరైనా వర్ణించి చెబితే ఆయా రూపాలు మనసు మీద పడటంలో ప్రతిబంధం లేదు. కాని ప్రస్తుత మీ బ్రహ్మ పదార్ధాని కలాంటి ప్రాతిస్విక Particular మైన రూపమేదీ కానరాదు. అలాంటప్పుడు తదాకారమైన చిత్తవృత్తి Mental Picture or Image మనకెలా ఏర్పడగలదు. వాస్తవమే. బ్రహ్మమనే దానికొక ఆకారమంటూ లేదు. ఆకారముంటే అసలది బ్రహ్మమే కానేరదు. ఎందుకంటే శుద్ధమైన చైతన్యమే అది. ఆకాశంలాగా దానికొక ఆకారమనేది లేదు. ఆకారముండే పదార్ధాలన్నీ అనాత్మ పదార్ధాలు. అవన్నీ దానికి గోచరించవలసిందే గాని అది దేనికీ గోచరం కాదు. గోచరించే పదార్ధాల నన్నింటిని “నేతి-నేతి" అని త్రోసివేసిన తరువాత చివరికేది శేషిస్తుందో అదే అది. అది ఇక అనాత్మ కావటానికి లేదు. అనాత్మ కాదంటే ఏమిటరం. ఆత్మే. బ్రహ్మమాత్మ స్వరూపమేనని గదా నిరూపించాము. అలాంటప్పుడనాత్మకు లాగా దాని కాకారమనేది ఎలా ఉండగలదు.

   ఉండకపోతే తన్నిమిత్తమైన వృత్తి ఎలా ఏర్పడుతుందని గదా ప్రశ్న. ఆత్మ స్వరూపమే అయినప్పుడెందు కేర్పడదని ఎదురు ప్రశ్న వేశారు శంకరులు. ఆత్మ అంటే ఏమిటసలర్ధం. అది మన జ్ఞానమే- మన స్వరూపమే - మనమే. ప్రతి ఒక్కరికీ మనలో నేను అనే స్ఫురణ ఉన్నది. అది ఇప్పుడీ అనాత్మ రూపాలలో కలిసిపోయి వివిక్తంగా Distinctly మనకు కనపడటంలేదు. ఆ రూపాలన్నీ ఎప్పుడు కాదనుకొని నిరాకరించామో అప్పుడది కనపడటానికేమి టాటంకం. అడ్డంకులేవీ లేవు కాబట్టి ఇంకా ధారాళంగా భాసించవలసి ఉంటుంది. కాని అది ఒక చెట్టూ పుట్టా మాదిరి ఒకానొక రూపంలో కనపడదు గదా. ఎలా భావన చేసి పట్టుకోవాలని నీ తాపత్రయం. అది నీస్వరూపమయి కూడా నీకు స్ఫురించలేదంటే సిగ్గు చేటన్నారు భగవత్పాదులు.

Page 121