#


Back

   దాన్ని నీవు సచ్చిద్రూపమైన ఆత్మతత్త్వంగానే చూడటం నేర్చుకొంటావు. అది బాగా అభ్యాసమై గట్టిపడితే అదే అధ్యవసానంగా Convic-tion పరిణమిస్తుంది. దానితో ప్రపంచమంతా బ్రహ్మాకారంగా భాసించి అసలీ ప్రపంచమే మనకు కనపడకుండా మాసిపోతుంది.

   ప్రపంచమే గదా చైతన్యాని కుపాధి. ఈ ఉపాధి ఎప్పుడు మాసిపోయిందో అప్పుడిక ఈశ్వరుడూ జీవుడని తేడా లేదు. జీవుడు కూడా అసలు చేతనుడేనని చెప్పాము. ప్రపంచోపాధి వల్లనే అది పరిచ్ఛిన్నమై ఈశ్వర చైతన్యానికి వేరుగా భాసిస్తున్నది. ఘటమనే ఉపాధి మూలాన్నే గదా ఘటాకాశం మహాకాశానికి వేరుగా భాసించటం. అలాగే ఇదీ. పోతే ఎప్పుడీ ఉపాధిని మనం చూడటం మానేశామో అప్పుడిక మన చైతన్యమా ఈశ్వర చైతన్యమే. ఇదే బ్రహ్మావగతి అనే మాటకర్థం. అవగతి అంటే అనుభవమే. బ్రహ్మావగతి అంటే బ్రహ్మమే నేననే అనుభవం. అది అధ్యవసాన నిర్వృత్తమన్నారు స్వామివారు. అంటేముందు చెప్పిన నిశ్చయ జ్ఞానంవల్లనే కలగవలసిన అభేద భావం.

   ఈ భావానికే జ్ఞానమనీ, విద్య అనీ, వివేకమనీ, వృత్తి అనీ అనేక నామధేయాలద్వైత పరిభాషలో, వాక్యం బోధించిన ఒక విషయం చెవినబడగానే ఆ విషయానికి సంబంధించిన ఆకారమొకటి మానవుడి మనోనేపథ్యం మీద ప్రతిఫలిస్తుందని చెప్పాము. ఈ ప్రతిఫలించిన ఆకారానికే వృత్తి అని పేరు. దీనికి తత్త్వమసి వాక్యమే కానక్కరలేదు. ఆ మాటకు వస్తే లౌకికమైన ఏ వాక్యమైనా కావచ్చు. ఇంతెందుకు ఫలానా చోట ఒక పెద్ద పర్వతముందని ఎవడైనా మిత్రుడొకడు మనకొక వార్త చెప్పాడనుకోండి. ఇప్పుడా వాక్యం వినగానే మన మనసులో ఆ పర్వతం తాలూకు రూపరేఖ లవశ్యంగా ఏర్పడతాయి. దీనికి పర్వతాకార వృత్తి అని పేరు. అలాగే ఒక పట్టణాన్ని గూర్చి వింటే పట్టణాకార వృత్తి. ఇలా ప్రతిక్షణమూ ఏదో ఒక వృత్తి ఏర్పడుతూనే ఉంటుంది మనసులో. అది ఒక పదార్ధాన్ని మనకండ్లతో చూచినప్పుడూ కలుగుతుంది. చెవులతో విన్నప్పుడూ కలుగుతుంది. మొత్తం మీద తత్తదాకారమైన వృత్తి ఒకటి కలుగుతూ పోవటం మానవుడి మనసుకు స్వాభావికం.

Page 120