బ్రహ్మ స్వరూపానికి చెందిన జ్ఞానమని అర్ధం. అది వాక్యం వల్లనే కలుగుతుంది. కలిగేది జీవుడికే అయినా కలిగించేది వాక్యం. “వాక్యార్థ విచారణా ధ్యవ సాన నిర్వృత్తాహి బ్రహ్మా వగతిః" అని ఆచార్యులవారి భాష్యపంక్తి. వాక్యార్ధాన్ని మనం విచారణ చేస్తే తన్మూలంగా ఒక అధ్యవసాయ మేర్పడితే ఆ అధ్యవసాయం మూలంగా మనకు కలిగే అనుభవమేదో అదే బ్రహ్మానుభవమట. వాక్యమంటే తత్త్వమసి. అది ఈ జీవుడా ఈశ్వరుడే అంతకన్నా వేరుకాదని బోధిస్తున్నది. ఇదీ దాని అర్థం. ఇప్పుడీ అర్థాన్ని శ్రవణం చేశాము మనం. అది మన శ్రవణేంద్రియం ద్వారా మనసులో ప్రవేశించి తదనురూపమైన బొమ్మ ఒకటి మన మనః ఫలకం మీద చిత్రిస్తుంది. దాని పేరు బ్రహ్మాత్మభావం.
అయితే బ్రహ్మమే నేననే ఈ అభేదభావం నిజమా కాదా అని మనకు సందేహం. అనాత్మరూపమైన ఈప్రపంచమెదురుగా కనిపిస్తున్నంత వరకూ మన మీ సంసార సాగరంలో మునిగి తేలుతున్న జీవులమే గదా ఈశ్వర స్వరూపులమెలా అవుతామనే సందేహం పట్టి పీడిస్తూనే ఉంటుంది మనలను. అందుకోసం మరలా వాక్యార్ధాన్ని విచారణ చేయాలి మనం. అది నీకీ జీవత్వ మౌపాధికమే Accidental వాస్తవంలో నీవా ఈశ్వరుడవే సుమా అని అభేదబుద్ధిని దృఢం చేస్తుంది.
పోతే ఇక దీని తరువాత మూడవది అధ్యవసానం. అధ్యవసానమంటే నిశ్చయం. గట్టిగా ఒక భావాన్ని పట్టుకోవటమని అర్థం. జీవుడీశ్వరుడేనని గ్రహించినా సంసారమనే భూతమంత సులభంగా వదలదీ జీవుణ్ణి. మానసికంగా అభేదాన్ని భావన చేస్తున్నా బాహ్యంగా ఈ భేద ప్రపంచం దాన్ని దెబ్బ తీస్తుంటుంది. దీనికే విపర్యయ Reverse మని పేరు. ఇది నివారణ కావాలంటే గట్టిగా ఈ ప్రపంచాన్ని లేదని చూడగలగాలి. అది ఎలాగంటే నీవు జీవుడవు కావు. బ్రహ్మమేనని చెబుతున్నది వాక్యం. బ్రహ్మమంటే అద్వితీయమైన చైతన్యం. చైతన్యం వరకూ నీకూ ఉన్నదే. ఎటు వచ్చీ నీ చైతన్యం దానిలాగా అద్వితీయం కాదు. సద్వితీయమిది. ఈ కనిపించే ప్రపంచమే ఆ ద్వితీయ పదార్థం. ఇప్పుడా ఈశ్వరుడే నీవని చాటటం వల్ల నేనూ అద్వితీయ చైతన్య రూపుడనే అని నీవు భావిస్తావు. అంటే ఏమన్న మాట. నామరూపాత్మకంగా పరచుకొని నీ చుట్టూ కనిపిస్తున్న ప్రపంచాన్ని నీవిక ప్రపంచంగా చూడటానికి లేదు.
Page 119