#


Back

   అలాగే పూర్వోత్తర మీమాంసల మీద గూడా ఆయన ఈ పరిష్కరణా యుధాన్నే ప్రయోగించవలసి వచ్చింది. మీమాంస అంటే వేద తాత్పర్య The import of veda మేమిటనే విచారణ. అది పూర్వమనీ, ఉత్తరమనీ రెండు భాగాలు. రెండూ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవే. అందులో పూర్వ మీమాంస శరీరానికి భిన్నంగా జీవుడనే వాడొకడున్నాడనీ వాడికి కర్మ ఫలానుభవ ముందనీ అందుకోసం వాడికి లోకాంతర జన్మాంతరా లేర్పడుతాయనీ, వర్ణిస్తుంది ఇంతవరకూ శంకరుల కెలాటి ఆక్షేపణా లేదు. వ్యావహారికంగా ఈ కలాపమంతా ఒప్పుకొంటాడాయన. కాన జీవుడికి విలక్షణంగా మరేమీ లేదు. తుదకు ఈశ్వరుడు కూడా లేడనే మీమాంసకుల మాట ఎంత మాత్రమూ ఒప్పకోడాయన. అలాగే జ్ఞానరహితమైన కర్మలచేతనే పరమ పురుషార్ధం ప్రాప్తిస్తుందని వారు వాదించటం కూడా ఆయనకు సబబుగా తోచలేదు. కనుక వాటి రెండింటికీ తగిన పరిష్కారం చేసి చూపాడాయన.

   పోతే ఇక ఉత్తర మీమాంసకు లొకరున్నారు. వారికి వేదాంతులని కూడా పేరున్నది. వేదాలకు చివరిదైన ఉపనిషత్తులు వీరికి ముఖ్య ప్రమాణం. కర్మ మీమాంసకుల మాదిరి గాక సాక్షిరూపమైన ఆత్మతత్త్వమొకటి ఉందని వీరు గుర్తించారు. అంతవరకూ బుద్ధిమంతులే కాని వేదాంతులనే వారంతా అద్వైతులు కారు. వారిలో ద్వైతులూ ఉన్నారు. విశిష్టాద్వైతులూ ఉన్నారు. వారిద్దరి అభిప్రాయాలూ వేరు. వారు జీవాత్మ పరమాత్మలకు భేదం చెబుతారే గాని అభేదాన్ని సుతరామూ అంగీకరించరు. అంతేగాక ఈ కనిపించే జగత్తంతా సత్యమే గాని ఆభాస గాదు వారి దృష్టిలో. సృష్టి అనేది యధార్థంగానే జరిగిందని వారి మతం. ఇదుగో ఇలాంటి భేద దృష్టి వేదాంతుల కుండటాన్ని ఏ మాత్రమూ మన్నించరు భగవత్పాదులు. కనుక మిగతా వారివలెనే వీరిని కూడా ఆయా సందర్భాలలో చక్కదిద్ది సరియైన మార్గం చూపుతూ వచ్చారు. ఈ విధంగా షడ్దర్శనాలలోనూ అంతర్లీనంగా ఉండే లోపాలను సవరించి గుణాలను సమర్ధించటంవల్ల కూడా ఆయనకు షణ్మత స్థాపకుడనే ప్రసిద్ధి ఏర్పడి ఉండవచ్చు.

   మొత్తంమీద జగద్గురువుల సమన్వయ దృష్టి మరి ఏ మతాచార్యునికీ కానరాదు. ఒక మధుకరం లాంటి దృష్టి అది. మధుకరమన్ని పుష్పాలపైనా వాలుతుంది. అన్ని రసాలనూ సేకరిస్తుంది. ఒకే మధురసంగా మారుస్తుంది. మనమా మధువును సేవిస్తుంటే ఇది పనస- ఇది ఆమ్ర-ఇది బదరి-ఇది కదళి అనే భేదం మనసుకు రాదు.

Page 12