#


Back

   అప్పుడెప్పుడో ఆయన షణ్మతాలకు చేసిన సమన్వయం ఇప్పుడున్న షణ్మతాలకు కూడా సరిపోతుందంటారు అభిజ్ఞులు. ఇప్పుడున్న షణ్మతాలు మన హైందవం మినహాయిస్తే ఆరు. బౌద్ధం- జైనం, క్రైస్తవం- మహమ్మదీయం యూదుమతం-జరదుష్ట మతం. ఇవి కూడా భగవంతుడిలోని షాడ్గుణ్యానికి ప్రతీకలే గాని వేరు గావు. ఒక్కొక్క గుణాన్ని ప్రధానంగా తీసుకొని ఒక్కొక్క మతం చలామణిలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ దృష్టితో చూస్తే బౌద్ధం శాక్తేయానికీ, జైనం శైవానికీ, క్రైస్తవం కౌమారానికీ, మహ్మదీయం వైష్ణవానికీ యూదుమతం గాణాపత్యానికి, జరదుష్ట మతం సౌరానికీ, సహోదరాలని చెప్పవచ్చు. అంచేత వాటిని సమన్వయించారంటే శంకరులు వీటిని కూడా సమన్వయించారనే అర్థం. సర్వతోముఖమైన దృష్టికి దేశకాలాలనే అవధులుండ బోవని దీనిని బట్టి మనకు తేటపడుతున్నది.

   షణ్మతాలంటే శైవ, వైష్ణవాదులనే గాక షడ్దర్శనాలని కూడా అర్ధమే. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ పూర్వోత్తర మీమాంసలకు షడ్దర్శనాలని పేరు. ఇందులో న్యాయవైశేషికాలు రెండూ హేతువాద ప్రధానాలు. ఆత్మేశ్వర తత్త్వాలను హేతువాదంతో నిరూపిస్తారు తార్కికులు. అంతవరకూ ఫరవాలేదు. కాని అవి రెండూ పరస్పర భిన్నమని వాదిస్తారు. పైగా ఆత్మను కూడా ఒకద్రవ్యమని Substance పేర్కొంటారు. అది అర్ధం లేని మాట. అంతేగాదు. వీరు సత్కార్యవాదులు గారు. అసత్కార్యవాదులు. వీరి దృష్టిలో సృష్టికి పూర్వ మీ ప్రపంచాని కస్తిత్వం లేదు. తరువాత క్రొత్తగా ఆరంభమయిందని వర్ణిస్తారు. ఇది కూడా యుక్తినహం కాదు. అంచేత శంకరులీ రెండంశాలనూ సవరించవలసి వచ్చింది.

   అలాగే సాంఖ్య యోగాలను కూడా సంస్కరించాడాయన. సాంఖ్య యోగాలలో సాంఖ్యమనేది నిరీశ్వరం Atheistic. యోగం సేశ్వరం Theis-tic అయితే వీరిద్దరూ సత్కార్యవాదులే. ప్రపంచం సృష్టికి పూర్వ మవ్యక్తంగా ఉండి తరువాత వ్యక్త Manifest మవుతుందని వీరి వాదం. ఇందులో సత్కార్యమని చెప్పటం వరకూ ఆచార్యుల వారి కొప్పుదలే. కాని అవ్యక్తం వ్యక్తంగా పరిణమిస్తుందని చెప్పటం మాత్రం సమ్మతం కాదు. అలాగే వారి జీవనానాత్వవాదమూ స్వతంత్ర ప్రకృతివాదమూ, ఆయనకెంత మాత్రమూ సరిపడలేదు. కాబట్టి ఆ రెండింటినీ ఆయన యధోచితంగా పరిష్కరించాడు.

Page 11