#


Back

  చరాచర రూపమైన ఈ భౌతిక జగత్తు Material world కూడా కలిసి వస్తున్నది. వాఙ్మయ జగత్తు శబ్ద ప్రమాణానికైతే మిగతా జగత్తంతా ప్రత్యక్షాదులకు గోచరమయ్యేదే. దీనిని బట్టి మనకు తేలిందేమిటి. స్థావర జంగమాత్మకమైన సృష్టి కంతటికీ కూడా అద్వైత విజ్ఞానమే ఏకైక లక్ష్యమనీ దాని కభిముఖంగా అణువు మొదలు ఆకాశం దాకా ప్రతి ఒక్కటీ ఈ లోకంలో పయనిస్తున్నదనీ ఒక గొప్ప సమన్వయ Grand synthesis మేర్పడుతున్నది.

   ఇలాంటి సర్వతోముఖమైన Comprehensive సమన్వయమిప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో ఏ మతాచార్యుడూ చేయలేదు. ఇక చేయబోడు. ప్రతిఒక్కరూ తత్త్వాన్ని ఏకముఖంగానే చూచి సిద్ధాంతాలు చేస్తూ వచ్చారే గాని సమష్టిరూపంగా దర్శించిన వారు కాదు. వారి దృష్టి చూస్తే గ్రుడ్డివాండ్లు ఏనుగును చూచిన వ్యవహారం జ్ఞాపకం వస్తుంది. ప్రతి ఒక్కడూ ఏనుగును చూచినవాడే. కాని పూర్తిగా మాత్రం కాదు. అందులో తోక పట్టుకొని ఒకడు బల్లెంలాగా ఉందంటే- తొండం బట్టుకొని ఒకడు రోకలిలాగా ఉందంటాడు. అది దాని సమష్టి రూపమెలా అవుతుంది. అలాగే ఈ దర్శనాలలో ఏదీ కూడా సమగ్రమైనది కాదు. కాదు గనుకనే శంకర భగవత్పాదులందులో ప్రతి ఒక్క దానిని సరి దిద్దవలసి వచ్చింది.

   శంకరుల వారికి షణ్మత స్థాపకులని ఒక పేరున్నది. శైవం వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, కౌమారం ఈ ఆరింటినీ షణ్మతాలని వ్యవహరిస్తారు. ఇవి ఆరూ కూడా ఆస్తిక దర్శనాలే. అయితే ఎవరికి వారు తమ దైవతమే సర్వోత్కృష్టమని వాదిస్తారు. అది కేవలం పాక్షికమైన దృష్టి షణ్మతాలనేవి అసలు భగవంతుడిలోని షడ్గుణాలను బట్టి అవతరించాయి. జ్ఞానైశ్వర్యశక్తి బలవీర్య తేజస్సులనేవే ఆ షడ్గుణాలు. అవి ఆరూ అభిన్నంగానే ఉన్నాయి భగవత్తత్త్వంలో. అభిన్నమైన ఈ గుణాలను పరస్పర విలక్షణంగా భావించటం మూలాన్నే ఇన్నిమతాలేర్పడ్డాయి. వీటిలో వైష్ణవం జ్ఞాన ప్రధానం. శైవమైశ్వర్య ప్రధానం. శాక్తేయం శక్తి గుణ ప్రధానం. ఇలా ఒక్కొక్క గుణాన్ని వేరు చేసి తీసుకోటంవల్ల దైవం వేరు కావటం వల్లఅది పరస్పర విద్వేషాలకు నాందీ పలికింది. నిజానికిన్ని గుణాలూ లేవు. ఇన్ని దైవతాలూ లేవు. షడ్గుణ సంపన్నుడైన భగవానుడొక్కడే. గుణాలన్నీ ఆయన తాలూకు విభూతులే As-pects అని సమన్వయించి చూపారు భగవత్పాదులు. "సచ భగవాన్ జ్ఞానైశ్వర్య బలవీర్య తేజశ్శక్తిభి స్సదా సంపన్న" అని గీతా భాష్య ముఖంలో ఆయన సెలవిచ్చిన సూక్తి. ఇదీ వారు చేసిన షణ్మత స్థాపన.

Page 10