ఇప్పుడు మరలా దాన్ని మనం గుర్తించాలంటే ఈ ఘటాకారాన్ని మరచి మృదాకారమేమనసుకు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే పృథు బుధ్నో దరాది విశేషాలకు భిన్నంగా నీలత్వ కఠినత్వాది సామాన్య స్వరూపాన్ని మనం విభజించి చూడాలి. అప్పుడా ఘటాకారం మగ్నమై దానికి మూలభూతమైన మృదాకారమే మనకు దర్శనమిస్తుంది. అలా దర్శించిన తరువాత మరలా ఈ దూరం చేసిన ఘటం మరేదో గాదు. ఆ మృత్తునుంచి వచ్చినదే. ప్రత్యణువూ దానితో నిండినదే. పగిలితే మరలా తద్రూపంగా మారేదే. కాబట్టి త్రికాలాలలోనూ దానికి వేరుగా లేదని నిరాకరించవలసి ఉంటుంది. దానితో ఇక ఘటమనే రూపమే అసలస్తిత్వాన్ని కోలుపోయి ఉన్నదంతా మృత్తికేనని అధ్యవసాయ Conviction మేర్పడుతుంది. అలాగే ప్రస్తుత మీ ప్రపంచం నుంచి వేరు చేసి మొదట బ్రహ్మతత్త్వాన్ని గ్రహించినా మరలా ఈ ప్రపంచ సృష్టి స్థితి లయాలన్నీ తన్మూలంగానే జరుగుతున్నవి కాబట్టి ప్రపంచమనే కార్యమే లేదు. అది కూడా బ్రహ్మమేనని మన మనుభవానికి తెచ్చుకోగలం.
ఇలా ద్వైతంతో ఆరంభమైనా చివరికద్వైత భావంలోనే పర్యవసానం కావటం మూలాన శాస్త్రమనేది అధ్యారోపం చేసినా అది మనకు వాంఛనీయం. లోకం చేసే అధ్యారోపానికీ దానికీ సాజాత్యం లేదు. లోకుల అధ్యారోపం అజ్ఞాన మూలకం. అందులో అధిష్ఠానం తాలుకు జ్ఞానం లేదు. అధిష్ఠానమంటే బ్రహ్మతత్త్వం. దాని జ్ఞానం లేదు గనుకనే ప్రపంచం మనకక్కడ అపవాదం కావటం లేదు. పోతే ఈ శాస్త్రీయమైన అధ్యారోపమలాంటిది కాదు. ఇది శాస్త్రజ్ఞులు బుద్ధిపూర్వకంగా చేస్తున్న అధ్యారోపం. దీనివల్ల అధిష్ఠానం ఫలానా గదా అనే జ్ఞానముదయిస్తుంది మనకు. జ్ఞానముదయించిందంటే అజ్ఞానం నశించి తీరుతుంది. తన్మూలంగా ఇక ఈ చరాచర ప్రపంచమూ అపోదితం కాక తప్పదు. ఎందుకంటే బ్రహ్మమనేది తెలియకపోవటం వల్లనే ఆ బ్రహ్మం మనకీ జగద్రూపంగా భాసిస్తున్నది. అది ఏదో తెలిసిందంటే ఇది బలా దూరయి మరలా ఆ బ్రహ్మంగానే సాక్షాత్కరిస్తుంది. ఇది ఎలాంటిదంటే రజ్జువును గుర్తించనంత వరకూ అదే మనకు సర్పరూపంగా కనిపించి ఫలానా అని గుర్తించే సరికి మరలా ఈ సర్పమా రజ్జువుగానే గోచరించటం లాంటిది.
Page 117