#


Back

   అంటే అనాత్మ రూపమైన ఈ ప్రపంచానికి వ్యతిరిక్తంగా ఆత్మరూపమైన ఒక పరిశుద్ధ చైతన్యమే మనసుకు వస్తుందని భావం. ఇలా కార్య జగత్తునుంచి మన దృష్టిని క్రమంగా దాని కధిష్ఠానమైన ఆత్మతత్త్వంవైపు మళ్ళించటానికే శాస్త్ర మీ ప్రపంచ సృష్టి స్థితిలయాలనే కరువు పెడుతుంది. నిజంలో ఈ సృష్టిలయాదులేవీ లేవు. లేకపోయినా ఏదో జరిగినట్టు చేసినట్టు ఆరోపిస్తుంది శాస్త్రం. అది ఈ కార్యజగత్తు నుంచి ఆ కారణాన్ని వేరుచేసి చూపటానికే. అలా కాకపోతే కార్యజగత్తు మీదనే పరిభ్రమిస్తూ మన దృష్టి అక్కడే ఉన్న మూలతత్త్వాన్ని గమనించలేదు. ఈ ఆరోపణవల్ల ఓహో దీని సృష్ట్యాదుల కన్నింటికీ మూలం ఫలానా గదా అని ఆ మూల పదార్థాన్ని ఆకళించుకోగలదు.

   ఈ విధంగా అధ్యారోపణ చేసి బ్రహ్మమనే అధిష్ఠానం తాలూకు జ్ఞానాన్ని మనకందించిన తరువాత శాస్త్రం మరలా దానినే మన కపవాదం చేసి చూపుతుంది. అది ఎలాగంటే బ్రహ్మమే ప్రపంచాని కుపాదానమూ, నిమిత్తమూ కూడా అవుతున్నది. కాబట్టి ఈ ప్రపంచమనే కార్యమా బ్రహ్మచైతన్యం కంటే ఇక మనం వేరుగా భావించటానికి లేదు. ఒక మట్టి కుండకు కారణమని చెప్పామంటే ఆ మట్టికంటే తత్కార్యమైన ఘటం వేరుగా కనపడదు గదా. అలాగే సర్వాధిష్ఠానమైన ఆ చైతన్యం కంటే ఇదికూడా వేరు కావటానికి వీలులేదు. దీనితో స్థావర జంగమాత్మకంగా కనిపించే ఈ సృష్టి అంతా ఇసుమంత కూడా అసలు లేనేలేదని అపవదించి నట్టయింది. ఇందులో దాగి ఉన్న సూక్ష్మమేమంటే ప్రపంచం తాలూకు సృష్ట్యాదికాన్ని అధ్యారోపం చేయటంవల్ల బ్రహ్మమనే అధిష్ఠాన జ్ఞానమేర్పడుతుంది మొదట. మరలా ఆ అధిష్ఠాన చైతన్యం కన్నా ఈ ప్రపంచం భిన్నంకాదని త్రోసిపుచ్చటంవల్ల నిష్ప్రపంచమైన కేవల బ్రహ్మచైతన్యమొక్కటే ఉందనే పరిశుద్ధమైన Purified అద్వైత భావమే మన మనసులో నిలిచిపోతుంది.

   మృద్ధటాది దృష్టాంతాలవల్లనే మన మీ రహస్యాన్ని బాగా అర్ధం చేసుకోవచ్చు. ఒక ఘటాన్నే చూస్తూ నిలబడితే మనకాఘటం తాలూకు పృథు బుధ్నోదరా ద్యాకారమే దృష్టికి తగులుతూ పోతుంది. అంతేగాని అది ఏ మూల పదార్థంతో తయారయిందో ఆ మృత్తిక రూపం మనసుకు రాదు. అక్కడే ఉన్నా దాని స్వరూపం దీని ఆకారంలో మగ్నమై Merged అది మనకు దూరమై పోతుంది.

Page 116