అధిష్ఠానమేమిటని ప్రశ్న. దేనిమీద ఒకటి అధ్యారోపణ చేస్తామో దాని కధిష్ఠాన Basis మని శాస్త్ర పరిభాష. రజ్జువుమీద సర్పాన్ని ఆరోపించామంటే రజ్జువనేది అధిష్ఠానం. అలాగే బ్రహ్మం మీద ప్రస్తుత మీ జగత్తునంతా ఆరోపితం చేశాము. కాబట్టి బ్రహ్మమే అన్నిటికీ అధిష్ఠానం.
అయితే వచ్చిందేమంటే ఫలానా బ్రహ్మమే దీనికంటికీ అధిష్ఠానమనే జ్ఞానం లేదు మనకు. కేవలం కార్యరూపమైన జగత్తునే చూస్తున్నాము గాని తత్కారణమైన అధిష్ఠానం మనకు కనపడటంలేదు. కనపడకపోయే సరికది బ్రహ్మమో, మరొకటోననే వికల్ప దృష్టి ఏర్పడుతున్నది. అధిష్టానం దీనికి ఫలానా అని నిష్కర్షగా గుర్తించేవరకూ ఇలాంటి వికల్పం తప్పదు. ఇది రజ్జువని గుర్తించినప్పుడే గదా సర్పధారా దండాదులైన వికల్పాలన్నీ నివర్తించేది. అలాగే ప్రపంచానికంతా అధిష్ఠాన రూపంగా ఆ బ్రహ్మ చైతన్యాన్ని గుర్తించాలి లోకులు. అలా గుర్తించాలంటే అధిష్టానం మరేదోగాదు అదేనని హేతు దృష్టాంత పురస్సరంగా నిరూపణ చేయాలి శాస్త్రం. నిరూపిస్తే అధిష్ఠాన రూపమైన బ్రహ్మతత్త్వాన్ని పట్టుకొని దాని బలంతో ఈ సమస్త ప్రపంచాన్నీ మన మపవాదం చేయగలం.
శాస్త్రమిలాంటి నిరూపణ చేసి అధిష్ఠానమయిన బ్రహ్మతత్త్వాన్ని మనకు బయట పెట్టటానికే మొదట ఆధ్యారోపమనేది చేస్తున్నది. అది ఎలాగని అడగవచ్చు. మనం ప్రతిక్షణమూ మనచుట్టూ పరిచినట్టు చూస్తున్న ఈ ప్రపంచమంతా ఒక కార్యం Product కార్యమనే సరికిది దానిపాటికదే ఆవిర్భవించిందని చెప్పటానికి లేదు. ఒక కారణ Producer మనేది ఉండాలి దానికి. ఆ కారణం కూడా ఏ పరమాణువులో Atoms కాదు ఏ ప్రధానమో Primordial matter కాదు. లేక అభావమో Total absence కాదు. అది కేవల మఖండమైన బ్రహ్మచైతన్యమే. ఆ చైతన్యమే కారణం కాబట్టి అందులో నుంచే ఇది ఆవిర్భవిస్తున్న దందులోనే ప్రస్తుత ముంటున్న దందులోనే చివర కస్తమిస్తున్నది. ఇలా ఆది మధ్యాంతాలలో ఆ చైతన్యాన్ని విడవకుండా ఇది అంటి పట్టుకొని ఉందని వర్ణించటం మూలాన మనదృష్టి ఈ కార్యం మీద నుంచి ఆ కారణం మీదకి పరుగెడుతుంది. అంతేగాక దీని లక్షణాలకు భిన్నంగా దాని లక్షణాలను వర్ణించటం మూలానా కార్యజగత్తుకు విలక్షణంగా దాన్ని మనం మనసుకు తెచ్చుకోగలం.
Page 115