#


Back

   ఈ జీవుడు లేడు-జగత్తు లేదు ఉన్నదొక్క ఈశ్వర చైతన్యమేననే అద్వైత భావం. ఈ భావాన్ని అలాగే అర్థం చేసుకోగల సామర్థ్యముంటే మంచిదే. కాని అంతటి మహాభాగ్యానికి నోచుకోలేదు మనం. కారణమేమంటే మన బుద్ధులన్నీ నిరంతరమూ జీవజగద్రూపమైన ద్వైత వాసనలతోనే నిండి ఉన్నాయి. సర్వదా ద్వైతవాసనా వాసితమైన ఈ బుద్ధి కొక్కసారిగా తద్విలక్షణమైన అద్వైత భావాన్ని బోధిస్తే ఏమవుతుంది. గ్రుడ్డివాడి కద్దం చూపినట్లు నిష్పలమవుతుంది. అర్ధం చేసుకోకపోవటమలా ఉంచి తమ అనుభవానికి ప్రతికూలమని చెప్పి దాన్ని నిరాకరించే ప్రమాదం కూడా ఉంది. అలాగైతే అది మొదటికే మోసం.

   అంచేత చెప్పవలసింది అద్వైతమైనా-లోకుల బుద్ధులన్నీ ప్రస్తుతం ద్వైత దృష్టి పరివేష్టితాలు కాబట్టి ఆ బుద్ధుల కనుగుణంగా ముందు ద్వైత రూపమైన అధ్యారోపాన్ని చేస్తుంది శాస్త్రం. ఆ తరువాత మరలా తాను చేసిన అధ్యారోపాన్ని అపవాదం చేసి చూపుతుంది. దీనివల్ల చివరకు తానుద్దేశించిన అద్వైత భావాన్నే శాస్త్రం మనకు ఉపదేశించి నట్టవుతున్నది.

   సరే బాగానే ఉన్నది. ముల్లు తీసి కొట్టు దించుకొన్నాడట ఎవడో. ఎట్లాగూ అపవాదం చేయదలచినప్పుడది మొదటనే చేయవచ్చు గదా. ఒక ఆధ్యారోపాన్ని కాదని చెప్పి మరలా ఇంకొక అధ్యారోపాన్ని క్రొత్తగా చేయవలసిన అగత్యమేమి వచ్చింది అని మరలా ఆక్షేపణ వస్తుంది. దీని కాచార్యుల వారిచ్చే సమాధాన మేమంటే లోకులు చేసే అధ్యారోపం వేరు. శాస్త్రం చేసేది వేరు. అధ్యారోపమనే మాట ఒకటే అయినా రెంటికీ బ్రహ్మాండమైన తేడా ఉన్నది. లోకులు చేసే అధ్యారోపం సహజమైన అధ్యారోపం. అధ్యారోపమనేది ఒకటి చేస్తున్నామనే దృష్టి లేకుండానే చేస్తున్నదది. దృష్టి లేకపోవటం మూలాన్నే మరలా దాన్ని అపవాదం చేయటమెలాగో పాపం వారికి తెలియదు. తెలియకనే ఎన్ని జన్మలు గడచినా, ఎంత యత్నం చేసినా, ఈ సంసార చక్ర భ్రమణం నుంచి బయటపడలేకపోతున్నారు. అసలు రహస్యమేమంటే అధిష్ఠాన జ్ఞానం లేనంతవరకూ అపవాదమనేది సంభవం కాదు.

Page 114