#


Back

   ఈ అధ్యాస అనేది మరలా రెండు తరగతులు. ఒకటి చేతనం అచేతనం మీద వచ్చి పడటం. వేరొకటి అచేతనం చేతనం మీద వచ్చి పడటం. మన ప్రాణం దగ్గరి నుంచీ త్వగింద్రియం దాకా ఈ పిండ శరీరమంతా అచేతనమే. దీనిమీద ఆ ఈశ్వరచైతన్యం వచ్చి పడింది. దానితో అచేతనమైన శరీరానికి చేతన భావమేర్పడి ఈ శరీరమే నేననే తాదాత్మ్య బుద్ధి Sense of Identity కది దారి తీసింది. దీనికే దేహాత్మ భావమని పేరు. అహంకార Ego మన్నా ఇదే. దీని మూలంగా జీవుడనే వాడు రంగంలోకి వచ్చాడు. పోతే జీవుడెప్పుడు వచ్చాడో ఈ జీవుడు మరలా తనచుట్టూ ఉన్న ప్రపంచమంతా నాది అని దానితో సాంగత్యం చెందాడు. ఇది చేతనం మీద అచేతనాన్ని అధ్యసించటం. దీని మూలంగా జగదాత్మ బుద్ధి ఏర్పడింది. మనకు. ముందు చెప్పింది ఆత్మభావమైతే ఇది ఆత్మీయ భావం The mine. దీనికే మమకారమని పేరు.

   ఈ అహంకార మమకారాలు మనలో ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాణికి ఉంటూనే ఉన్నాయి. ఇది నేను, ఇది నాది అని అభిమానం పెట్టుకొని నిత్యమూ వ్యవహరించటం లోనే మనకిది తార్కాణమవుతున్నది. ఇలా ద్విపాత్రాభినయం చేసే ఈ అధ్యాసంవల్లనే మనకన్ని విధాలైన సంసార బాధలు. అంచేత ఈ అనర్ధాన్ని సమూలంగా మనం పెరికి వేయాలంటే మరలా ఒక అధ్యారోపణ అనేది చేయక తప్పదు.

   అయితే ఇది చాలా విడ్డూరంగా ఉన్నదీమాట. ఎందుకంటే అధ్యారోపంవల్లనే మనకిన్న అనర్ధాలూ సంప్రాప్తమైనాయని వక్కాణించారు మీరు. అలాంటప్పుడు మనకు హితైషియైన శాస్త్రం దానికి నివారణోపాయం సూచించాలి గాని తాను మరలా ఒక అధ్యారోపణ చేయటమేమిటి. అలా తానే చేస్తున్నప్పుడిక లోకం చేస్తున్నదని ఆక్షేపించటం దేనికి. చూడబోతే ఇది అమ్మను తిడతావేమిరా అన్న సామెత జ్ఞాపకం చేస్తున్నదని సందేహించవచ్చు.

   దీనికి సమాధానమింతకుముందే బయట పెట్టాము. శాస్త్రమేది బోధించినా, ఎప్పుడు బోధించినా అది మనబోటి లోకులకే ననే విషయం మనమెప్పటికీ మరచి పోరాదు. అలాంటప్పుడు లోకుందరూ శాస్త్రమేది చెప్పదలిస్తే అది యథాతథంగా As it is ఆకళించుకోగలిగి ఉండాలి. అలా ఆకళించుకోలేకపోతే దాని ప్రయత్నమే అసలు విఫలమయిపోతుంది. ప్రస్తుత మీ వేదాంతశాస్త్రం మనకు బోధించ వలసిందేమిటింతకూ.

Page 113