#


Back

   కాని ఇక శేషమంటూ ఉండబోదు. అలా ఉండటానికది వస్తుసిద్ధమయితే గదా. కేవలం మన భ్రాంతి జన్యమే. భ్రాంతి ఎప్పుడు పోతుందో తన్నిమిత్తమయిన ప్రపంచంకూడా ఇక నిశ్శేషంగా పోయి తీరవలసిందే. కాబట్టి అపవాదం చేస్తే ప్రపంచం తొలగదేమోననే భయం లేదు. తొలగిపోయే స్వభావమున్నప్పుడెందుకుగాను తొలగదు. తప్పకుండా తొలగుతుంది.

   అయితే ఈ అపవాదమనేది మనమలాగే చేయటానికి లేదు. దానికొక షరతున్నది. మొదట అధ్యారోపమనేది Imposition చేసి ఆ తరువాతనే దాని నపవాదం Deposition చేయాలి మనం. అధ్యారోపమంటే ఒక వస్తువు మీద మరొక దాన్ని తెచ్చి పడవేయటం లేదా ఆరోపించటం. అయితే ఆరోపించామంటే ఆ ఆరోపిస్తున్నదొక వస్తువుగా Actually ఎక్కడో ఉన్నదని కాదు మరలా. ఎక్కడా లేని దాన్నే ఉన్నట్టుగా కల్పిస్తాము. ఇలాటి ఒక కల్పనకే అధ్యారోపమని పేరు. ఈ అధ్యారోపణ ప్రస్తుతం మన మీ ప్రపంచాన్ని ఆ బ్రహ్మ స్వరూపం మీద చేయవలసి ఉన్నది. బ్రహ్మమనేది సిద్ధమైన పదార్థం. దానికి విలక్షణంగా కనిపించే ప్రపంచమంతా కల్పితమే. కల్పితమైనది గనుకనే ఈ చరాచర జగత్తునంతా దానిమీద ఆరోపించటం. అయితే కల్పితమని చెబుతూ మరలా దీన్ని అదేపనిగా దానిమీద ఆరోపించటం దేనికని ప్రశ్న. అది శాస్త్ర మారోపించటం కాదు. ఆ మాటకు వస్తే లోకమే ఆరోపిస్తున్నది. లోకమారోపిస్తుంటే లోకబుద్ధి ననుసరించి శాస్త్రం కూడా అలాగే ఆరోపణ చేయవలసి వస్తున్నది. అంత మాత్రమే.

   అయితే లోక మీ ఆరోపణ ఎలా చేస్తున్నదని అడగవచ్చు. అసలఖండంగా వ్యాపించి ఉన్నదొక్క బ్రహ్మచైతన్యమే. దాన్ని మనమలాగే దర్శిస్తే సరిపోయేది. కాని చైతన్యంగా కాక దాన్ని మన మీ స్థావర జంగమాత్మకమైన ప్రపంచంగా భావించి చూస్తున్నాము. ఇది మనలో ఇప్పుడా బాల గోపాలమూ అనుభవ సిద్ధమే. కాబట్టి ఇలా భావిస్తున్నామంటే అది ప్రపంచాన్ని బ్రహ్మంమీద ఆరోపించటమే గదా. ఈ ఆరోపణ మనమనాది సిద్ధమైన మన అవిద్యాదోషం వల్ల జన్మ జన్మలనుంచీ సాధిస్తూ వచ్చాము. అంచేత అది సహజమై Inherent పోయింది మనకు. ఈ సహజారోపానికే ఆచార్యుల వారధ్యాసమని పేరు పెట్టారు.

Page 112