ఈ ప్రశ్నకింతకు ముందే మనం సమధానం చెప్పుకొన్నాము. నామరూపాత్మక మైన ఈ ప్రపంచమంతా అసలవిద్యాకల్పితం. ఇది ప్రాతీతికమే Notional గాని వాస్తవికంగా Actual లేదు. అయితే చిత్రమేమంటే లేకుండానే కనిపిస్తున్నది మన కంటికి. మనకు కనిపించే ఏ పదార్థమైనా రెండు విధాలుగానే కనిపిస్తుంటుందని చెప్పాము. ఉండి కనిపించటమొకటైతే లేకుండానే కనిపించట మింకొకటి. ఒక ఏటిలో నీళ్ళు కనిపిస్తున్నాయంటే అవి అక్కడ ఉండే మనకు కనిపిస్తున్నాయి. అదే ఎండమావులలో అయితే లేకుండానే ఉన్నట్టు కనిపిస్తుంటాయి. కాటుకలో నలుపనేది ఉండి కనిపిస్తుంది. ఆకాశంలో అయితే లేకుండానే కనిపిస్తుంది. ఇలాగే ఏదైనా లోకంలో.
ఇందులో ఉండి కనిపించే దాన్ని మనమెంత ప్రయత్నించినా తొలగించుకోలేము కారణమేమంటే అది వస్తుధర్మం. మనం పొమ్మంటే పోదు. రమ్మంటే రాదు. అనపాయోపజనమన్నారు దాన్ని. పోతే లేకుండా కనిపించేదున్నదే అది వస్తుధర్మం కాదు. మానవుడి దృష్టి దోషం Misapprehension వల్ల ఏర్పడింది. కనుకనే లేదని అపవదిస్తే చాలు. తప్పకుండా తొలగిపోతుంది. ఇంతెందుకు ఒక త్రాచుపామే ఉందనుకోండి. అది వాస్తవంగానే వచ్చి త్రాటిమీద చేరిందయితే మనం పొమ్మన్నా పోదు. మీదు మిక్కిలి మనమీద బడి కరిచే ప్రమాదం కూడా ఉన్నది. కాని వాస్తవంగా లేక అక్కడ పడివున్న ఒక త్రాడే అలా పాములాగా దూరానికి కనిపిస్తున్నదనుకోండి. అప్పుడు మనకు భయంలేదు. చూచినంత సేపూ అలాగే తోచినా తేరిచూచి ఎప్పుడు కాదని భావిస్తే అప్పుడే మాయమవుతుంది. కారణమది వాస్తవంగా అక్కడ లేకపోవటమే.
అలాగే ప్రస్తుతమింతగా మనం చూచే ఈ ప్రపంచం కూడా అసలు వస్తుతః ఎక్కడా లేదు. ఉన్నదెప్పుడూ ఒక బ్రహ్మమేనని గదా నిరూపించాము. ఆ బ్రహ్మమే అనాది సిద్ధమైన మన అవిద్యా దృష్టి మూలంగా పిండరూపమయిన ఈ శరీరంగాను, అండరూపమైన ఈ విశ్వ శరీరంగానూ రూపాంతరం ధరించి మనకిలా దర్శన మిస్తున్నది. ఇది యధార్థ సర్పం కాదు మనం భయపడటానికి. రజ్జుసర్పం కనుకనే రజ్జు సర్పాన్ని ఎలా కాదనుకొంటే పోతుందో ఇదీ అలాగే మన మపవదిస్తే చాలు. పోవటానికి సిద్ధంగా ఉంది. ఆ పోవటంలో కూడా నిశ్శేషంగానే తొలగిపోతుంది.
Page 111