పారమేశ్వరమైన ఈశక్తికి నిలయాలే పద్మాలు. ఆమె పద్మాలయ. మన భాషలో అలర్మేల్మంగ. ఈ పద్మాలనేవి ఏవోగావు. మన శరీరంలో ఉన్నవని వర్ణించే మూలాధారాది షట్చక్రాలే. అవే షట్కమలాలు. వాటిలో విహరిస్తుంటుందా శక్తి. చివర కేడవ చక్రమైన సహస్రారంతో తన కాశ్రయమైన పరమాత్మతో సాయుజ్యాన్ని భజిస్తున్నది. సరిగా ఈ ఆధ్యాత్మికమైన భావానికి బాహ్యమైన సంకేతమే మనకు కనిపించే ఈ ఏడుకొండలు. వృషభాద్రి నుంచి వేంకటాద్రి దాకా విస్తరించి ఉన్న ఈ సప్తగిరులూ సప్తచక్రాలే. ఒక్కొక్క కొండ ఎక్కిపోతున్నా మంటే ఒక్కొక్క చక్రాన్ని దాటి పోతున్నాము మనం చివరకాఖరి దైన సహస్రార చక్రం చేరేసరికి స్వామి సన్నిధినే చేరుతున్నాము. అదే గదా ఆనంద నిలయం యాత్రికులకు. పై నుంచి తిలకిస్తే సరిగా సహస్రారం లాగానే భాసిస్తుందీ ఆనందనిలయం అక్కడికివెళ్లేసరికి శ్రీరూపిణి అయిన ఈశక్తి శ్రీచక్రరూపంగా ప్రభుపాదాల నాశ్రయిస్తుంది. శివశక్తేక్య మిదే.
అసలీ స్వామి శివరూపమో తెలియదు. శక్తిరూపమో తెలియదు. శివుడను కొంటే శివుడు. శక్తి అనుకొంటే శక్తి. శక్తి అన్నందుకు గుర్తు ఔత్తరాహులైన యాత్రికులంతా ఆ విగ్రహాన్ని బాలాజీ అని సంబోధించటమే బాలా అంటే శక్తికి మారుపేరు గదా. మరి దేవాలయ ప్రాకారానికి నలువైపులా సింహవిగ్రహాలు సింహ వాహిని తత్త్వాన్ని మనకు సూచిస్తున్నాయి. పోతే ఉత్తుంగమైన పక్షస్సూ సుందరమైన ముఖవర్చస్సూ - గుప్తమైన ధమ్మిల్లమూ -సుకుమారమైన మూర్తి విశేషమూ -శుక్రవారాభిషేకమూ - ఇలాంటి కలాపమంతా శక్తితత్త్వనికి నిదర్శనాలేమో.
ఇక శివతత్త్వ లక్షణాలు కూడ తక్కువగా లేవు. వైష్ణవక్షేత్రాలలో మరే దేవుడికీ కానరాని ఈశ్వర శబ్దమీ దేవుడి పేరులోనే చిత్రంగా చోటుచేసుకున్నది. అది భరించలేక కొందరు దానికి మారుగా వేంకటరమణా వేంకటాచలపతీ శేషాచల వాసా అని కూడా ఆ దేవుని సంబోధనలు చేయవచ్చు. అయినా ఆ స్వామీ వేంకటేశ్వరుడని పిలిచానా పలకకపోడు. స్వామి విగ్రహం మీది నాగాభారణాలూ - త్రిశూలాది చిహ్నాలూ - బిల్వార్చనాదులూ - ఆయన శివస్వరూపాన్ని కూడా మనకు చెప్పకనే చెబుతున్నాయి.
Page 78