
బిరుదులు. ఏవో చాపల్యంతో తగిలించుకొన్నవి గావివి. ప్రత్యక్షరమూ సార్ధకమైన బిరుదులు. తిక్కన తరువాత ఇంత చక్కగా రస పోషణ చేసిన మహాకవి మరొకడు లేడు సాహిత్యంలో. శృంగారం దగ్గరినుంచి బీభత్స భయానకాలవరకూ ఏది ఎక్కడ పోషించినా రసజ్ఞుల హృదయాలలో హత్తుకొని పోతుందది. ఊర్వశి నరకాసురుల శృంగారమొక ఆభాస అయితే ఉషానిరుద్ధుల దొక భాసురమైన శృంగారం. యుద్ధ వర్ణనలలోని వీరరౌద్ర బీభత్స భయనకా లతిలోకం. ఇక నరుకుడిచేత బాధలుపడ్డ ఋషుల పాట్లు, హంసడిభకుల చేత భంగపడ్డ దుర్వాసుని పాట్లు, సత్యాకృష్ణుల ద్యూత క్రీడలోని ఇసిరివాట్లు, పౌండ్రక నారద సంవాదంలోని చాటు మాటు చీవాట్లు, అన్నీ హాస్య రసాని కుదాహరణలే. నరకుడి చావు వార్తవిని కృష్ణునితో మొరపెట్టిన భూమాత ఆక్రందన, డిభకుడు హంసుని మరణం చూచిపడ్డ ఆవేదన కరుణ రసాన్ని వెదజల్లే సన్నివేశాలు. పోతే అద్భుత రసమెక్కడపడితే అక్కడే చూపగలడు కవి. కరసరసి రుహంబున నొక, సరసీరుహం బమర వదన సరసీరుహమున్, పరిమళ వశమున మోపుచు, ధరణిధర కన్యదొంతి తామర చూపిందట. కుజము కుంజరముచే కూలునో కూలదో కూలు కుంజరము నీ కుజము కూల్చిందంటాడు కృష్ణుడు పరమేశ్వరుణ్ణి చూచి. ఆకాశ గంగ నీ యడుగున బోడమెనీ కిట్లర్ఘ్యపాద్యంబు లిచ్చుటెంత, కమలంబు నీనాభి గన్నిది నీకిట్టు, పుష్పాంతరంబుల పూజయెంత, అంటారు మహర్షులు కృష్ణ పరమాత్మను చూచి. ఇరుల బండారంపుటింటికి బెట్టిన బోండు మల్లెల కోటలా ఉందట సర్ప పరివేష్టితమైన నీలకంఠుని కంఠం. పాల పెన్నురువు గుబ్బలి మీద నెలకొన్న నిండు వెన్నెల ముగ్గులా ఉందట పాండురాంగుని శరీరం మీద దాల్చిన విభూతి రేఖలు. అద్భుతమైన భావాలివి.
అసలీ మహాకవి భావాలే అతి విలక్షణం అనన్యాదృశం. నీగాలికిందృణ మీతండంటాడు బలరాముడితో కృష్ణుడు. బలరాముడు గాలైతే, నరకాసురుడు గడ్డిపోచట. మంట మంటలం బూచిన బాణజాలమట. బాణాలలో నుంచి వచ్చిన ఎర్రని మంటలు తీగలు పూచిన ఎర్రని పుష్పాలు. అరచందురు డెందములో జొరబారే తోకచుక్కలా ఉంది హరినిటలతటం మీద గ్రుచ్చుకొన్న నరకాసురుడి బాణం. ఒక జింక ఉన్నట్టుండి గంతు వేస్తే కత్తిరిస్తే మిట్టిపడ్డ తమలపాకులా ఉందంటాడు. వేదపు గని వేల్పట బ్రహ్మదేవుడు. ఊర్వశి కనుదోయి వెన్నెలలు నిండితేగాని నరకుడి కోర్కెలు నిండవట. పండిన సంతసమట బాణుడిది.
Page 196
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు