#


Index

చిత్రతరంగిణి

  5. పరమాత్మ ఎలా పరిపూర్ణుడో ఆయనతో అవినాభూతంగా ఉన్న ఈ శక్తి కూడా పరిపూర్ణమే. అది అవినా భూతంగా ఉన్నంత వరకూ దానికి పర అని పేరు. ఆయన ఈ ప్రపంచ సృష్టిని చేయాలని సంకల్పించే సరి కాపర పశ్యంతి అయింది. దానికొక ప్రణాళిక తయారుచేయగానే అది మధ్యమ అయింది. ప్రణాళిక కార్యరూపాన్ని ధరించి బయటపడగానే అది వైఖరి అయింది. పరాస్యశక్తి ర్వివి ధైవ శ్రూయతే అని శ్వేతాశ్వతరం చాటుతున్నది. ఏకరూపమైన శక్తి వివిధ రూపాలుగా అవతరించిందట. ఏకరూపిణిగా ఉన్నప్పుడది అవ్యక్త. వివిధ రూపాలుగా మారితే అదే వ్యక్త. అవ్యక్తమైన శక్తి అంతకంతకూ వ్యక్తమవుతూ వచ్చిన దశలే ఈ నాలుగూ. అందులో బాగా వ్యక్తమైన దశనే వైఖరి అన్నారు. అదే ఈ చరాచర ప్రపంచం.

  6. మనమంతా ఇప్పుడీ వైఖరీ రూపమైన ప్రపంచంలో జీవిస్తున్నాము. ఊరక జీవించటమే అయితే పరవాలేదు. అధి భౌతిక - ఆధ్యాత్మిక, అధిదై వికరూపమైన తాపత్రాయానికిది మనలను గురి చేస్తున్నది. దానికి కారణమా మూల ప్రకృతి కార్యకరణ విషయాకారంగా పరిణమించటమే. కార్యమంటే శరీరం, కరణం మనః ప్రాణాలు, విషయ మీ నామరూపాత్మకమైన బాహ్య జగత్తు. మనఃప్రాణాలతో కూడిన శరీరమొకటి ఏర్పడేసరికీ శరరమే నేనని అభిమానించ సాగిందా విశ్వచైతన్యం. తన్నిమిత్తంగా జీవభావం వచ్చి పడింది ఈశ్వరుడికి. చైతన్య ధాతువొక్కటే వాస్తవానికి. జీవుడని ఈశ్వరుడని భేదం లేదు. ఈశ్వర చైతన్యమే శరీరమనే ఉపాధి నభిమానించి దానిమేరకే నిలిచిపోతే జీవుడు. అలా కాక నిరుపాధికమై సర్వమూ తానేనని భావిస్తే ఈశ్వరుడు. మరి సర్వవ్యాపకమైన సమష్టి చైతన్యం వ్యష్టిరూపమైన జీవచైతన్యమెలా అయింది. అదే అనిర్వచనీయం. ఒక్కమాటలో చెబితే అవిద్య పొమ్మన్నారు వేదాంతులు. ఎక్కడిదీ అవిద్య. ఆ పరాశక్తి విలాసమే ఇది. విద్యావిద్యా స్వరూపిణి ఆవిడ. సృష్టి స్థితి లయాలే కాక మరి రెండు కృత్యాలున్నాయామెకు. ఒకటి తిరోధానం. మరొకటి అనుగ్రహం. అందులో తిరోధానమనే ముఖంతో మనలనది ఈ శరీరంలో తెచ్చిపడ వేసింది. చిత్రవిచిత్రమైన జగద్విలాసాన్నంతా ప్రదర్శిస్తూ మనలను తాపత్రయానికి పాలు చేసింది.

Page 161

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు