వాసవకన్య
“వాసవకన్య” - చాలా చిత్రమైన నామధేయమిది. ఏమిటి ఈ నామానికర్థం. నామ మనేది యాదృచ్ఛకంగా ఏర్పడేదేగాని దాని కర్థమేమిటని అడగరాదు. ప్రతినామమూ ఒక శబ్దమే. ప్రతి శబ్దమూ అర్థవంతమే. దానికేదో ఒక వ్యుత్పత్తి ఉండి తీరుతుంది. ఏమిటీ శబ్దానికి వ్యుత్పత్తి. వాసవ అనే మాట వస్తువనే పదం నుంచి వచ్చింది. వసు సంబంధమైనది వాస్తవం. వసువంటే రత్నమని- బంగారమని - ధనమని - అర్థం. వసుమతి - వసుంధర - అని ఈ భూమికి పేరు వచ్చిందంటే అందుకే వచ్చింది. వసువంటే చాలా శ్రేష్ఠమని కూడా అర్థమే. వసుమనస్సంటే చాలా మంచి మనస్సు గలవాడు. వసిష్ఠుడంటే అందరిలోనూ శ్రేష్ఠుడు.
ఈరెండు లక్షణాలూ ఉన్నందువల్ల వాసవ అంటే వైశ్యజాతి అని అర్థం చెప్పుకోవచ్చు. ధనకనకాది వస్తువులతో సంబంధమున్నవారు వైశ్యులే. అంతేగాక శ్రేష్ఠులని పేరగాంచిన వారూవారే. ఇంకా ఒక విశేషముంది మనం తెలుసుకోవలసింది. అదేమంటే మానవులలోనే గాక దేవతలలో కూడ నాలుగు వర్ణాలున్నాయని వర్ణిస్తున్నది బృహదారణ్యకోపనిషత్తు. అగ్ని అనేవాడు దేవతలలో బ్రాహ్మణుడు. ఇంద్ర, వరుణ, సోమరుద్రాదులు క్షత్రియులు. కాగా పసువులనే వారు దేవతలలో వైశ్య జాతికి చెందినవారట.
వైశ్యులకు విశులని పేరు. అసలు విశులనేమాట నుంచి వచ్చిందే వైశ్య అనే మాట. విశంతి-సర్వత్ర గచ్చంతి - వ్యాప్రియంత ఇతివిశః- అన్నిచోట్ల తిరుగుతూ చేస్తూ ఉండేవారు కాబట్టి విశులయినవారు వారు. క్షత్రియజాతిని సృష్టించిన తరువాత తృప్తిలేక మరలా వైశ్యులను సృష్టించాడట బ్రహ్మ. కారణం విత్తోపార్ణయితు రభావాత్తన్నారు భాష్యకారులు. ధనార్జన చేసేవారు లేక. ఏమి లేకపోతే. కర్మానుష్ఠానమనేదే పొసగదు. ఏ సత్కర్మ ఆచరించాలన్న ధనమే దానికి సాధనం. ధనమూలమిదమ్ జగత్. ఐహికమైన అర్థకామాలకే గాదు. ఆముష్మికమైన ధర్మానుష్ఠానానికి కూడా దోహదం చేసేది ధనమే. ధనకనక వాస్తువాహనాదు లంతా ధనమే. దానిని సంపాదించేవాడూ నలుగురికీ అందజేసేవాడూ ఒకడు కావాలి.
Page 105