ఉక్తి / ఉక్త : ఉక్తి అంటే చెప్పటం. మాటాడటం. ఉక్తమంటే చెప్పబడిన విషయం. అది మంచి మాట అయితే సూక్తి. లేదా సూక్తం. Wellsaid statement. Great utterance. strong>కాకపోతే దురుక్తం Ill పనికిరాని మాట. 'ఉక్తానుక్త దురుక్త చింతనం వార్తికం' అని వార్తికానికి నిర్వచనం చేశారు పెద్దలు. అక్కడ దురుక్త మంటే చెడ్డమాట అని కాదు అర్థం. కొరతపెట్టి చెప్పినమాట అని.
×
ఉక్థ : వైదికమైన ప్రయోగం. ఉక్తమనే భావం.
×
ఉచిత : యుక్తమైనది. తగినది. Proper. Befitting. శాస్త్రోచితమంటే శాస్త్రానికి అనుగుణమైనదని భావం.
×
ఉచ్చయ : పోగుకావటం. పోగు. సమూహం. రాశి Heap. అధికమవటం అని కూడా అర్థమే. సముచ్చయమనే మాటలో తెలుస్తుంది ఈ విషయం. జ్ఞాన కర్మ సముచ్చయ. జ్ఞానమూ కర్మ రెడూ కలిపి పట్టుకోవటమని భావం. అభ్యుచ్చయమని కూడా ఒక మాట ఉంది. బాగా కలుపుకుంటూ రావటం Gather అని భావం.
ఉచ్ఛిత్తి / ఉచ్ఛేద : తెగిపోవటం. విచ్ఛిన్నం కావటం. వినాశం. Break. Destruction. ఉదాహరణకు నిద్రలో ఆత్మజ్ఞానం అనుభవానికి రాకపోతే అది అక్కడికి ఉచ్ఛిన్నమైందని భావించడం సహజం. కాని వాస్తవంలో అది అక్కడ ఉంది. వస్తుసిద్ధమైనా బుద్ధి సిద్ధం కాలేదు గనుక దానికి ఉచ్ఛేదమని భ్రాంతి చెందుతున్నాము.
×
ఉచ్ఛ్వాస : లోపలికి పీల్చే గాలి. దీనికే అపానమని నామాంతరం. దీనికి భిన్నంగా బయటికి వదిలేగాలి నిశ్వాసం. ప్రాణమని దానికి మరొకపేరు.
×
ఉత్కర్ష : పైకి లాగటం. ఆధిక్యం. ఎక్కువ. ప్రాధాన్యం అని అనేకార్థాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేక పదం నికర్ష లేదా అపకర్ష.
×
ఉత్క్రమ : పైకి పోవటం. దాటిపోవటం. ప్రాణోత్క్రమమంటే ప్రాణ వాయువు శరీరాన్ని విడిచి నిష్క్రమణ చెందటం. అది కపాలరంధ్రం ద్వారా జరిగితే ఉత్తమ లోకాలు లభిస్తాయని, మిగతా శరీర రంధ్రాల ద్వారా అయితే అధో లోకాలు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం.
×
ఉత్సర్గ : వదిలేయటం. సృష్టిచేయటం. Creation. సామాన్య సూత్రమని General rule కూడా ఒక అర్థముంది.
×
ఉత్తర : దాటిపోవటం. To pass by. To Transcand. ఉత్తరణమని కూడా దీనికే మరొకపేరు. రెండు పదార్థాలలో మేలైన దానికి కూడా ఉత్తరమని పేరు Better between the two.
×
ఉత్తీర్ణ : దాటిపోయినవాడని ముఖ్యార్థం. లక్షణార్థంలో సంసార సాగరాన్ని దాటిపోయిన సిద్ధపురుషుడని భావం. తీర్ణుడని కూడా పేర్కొనవచ్చు. 'స్వయం తీర్ణః పరాన్తారయతి' అని ఒక న్యాయముంది. తాను తరించి మరొకరిని తరింపచేయాలట. అలాంటి సిద్ధపురుషుడికి తీర్థంకరుడని కూడా పేరు పెట్టారు.
×
ఉత్తమ : అన్నింటిని దాటిపోయినది. శ్రేష్ఠమైనది. Supreme. మంద మధ్యమ అధికారుల కంటే పైస్థాయి నందుకొన్న సాధకుడు. Aspirant.
×
ఉత్థాన : పైకి లేవటం. బయట పడటం.
×
ఉత్థిత : అలా పైకి లేచినవాడు The person who has risen above సంసారంలో పడకుండా బయట పడ్డవాడని భావం.
×
ఉత్పత్తి : పుట్టుక, జన్మ, సృష్టి, ఉత్పత్తి వినాశాలంటే జనన మరణాలు. చతుర్విధ క్రియలలో మొదటి దశ.
×
ఉత్ప్రేక్ష : ఊహ. భావన. Imagination. Inference. పరమాత్మ తత్త్వాన్ని సాధనచేసి స్వయంగా దర్శించాలేగాని చేయకుండా కేవలం ఇలాగలాగని ఊహించేది కాదు. ఉత్ప్రేక్షకు అవకాశం లేదక్కడ. తుదకు ప్రపంచ వ్యవహారమే మనమూహించి తెలుసుకునేది కాదు. కనుకనే అనిర్వచనీయ మన్నారు దీన్ని. ఉన్నదున్నట్టు గ్రహించాలంటే ఉత్ప్రేక్షకాదు. ఉపదేశం కావాలి మానవుడికి.
×
ఉత్సూత్ర : ఒక సూత్రాన్ని అనుసరించక దాని పరిధిని మించి అర్థం చెప్పటం. సూత్రకారుని హృదయాన్ని బట్టి భాష్యకారుడప్పుడప్పుడు సూత్రంలోని శబ్దాలను వదిలేసి శాస్త్రానుసారంగా దాని అర్థాన్ని వివరించి మనకు చెబుతుంటారు. దీనికి ఉత్సూత్ర భాష్యమని పేరు.
×
ఉదయ : ఉదయించటం. పైకి రావటం. To rise. కలగటం. జన్మించటమని కూడా అర్థం చెప్పవచ్చు.
×
ఉదర : కడుపు. కుక్షి అని ముఖ్యార్థం. లోపలి భాగమని లాక్షణికార్థం. ఇవి రెండూగాక ఉత్+అర = ఉదర. అరమంటే కొంచెం. ఉత్అంటే ఏ కొంచెమో అని అర్థం చెప్పారు ఉపనిషత్తులో. బృహదారణ్యకంలో 'ఉదరమంతరం కురుతే' అని ఒక మాట ఉంది. బ్రహ్మస్వరూపంలో ఉదరం అంటే ఏ కొంచెమైనా అంతరం తేడా చూస్తే అది మనకు భయోత్పాదకమేనట.
×
ఉదాన : పంచవాయువులలో నాలుగవది. శరీరంలోనుంచి జీవుణ్ణి అవసానంలో పైకి తీసుకుపోయేది. అంతేగాక బ్రతికివున్న కాలంలో ఎక్కిళ్ళు మొదలైనవి సృష్టించేది.
×
ఉదాసీన : ఊరక ఉండిపోవటం. పైన కూచుని చూస్తూ ఉండటం. Supervision అధ్యక్ష అనే మాటకిది పర్యాయపదం. 'ఉదాసీనవ దాసీనః' అని పరమాత్మను వర్ణిస్తుంది గీత. ఉదాసీనుడిలాగ కూచునేవాడే పరమాత్మ అట. అంటే ఏ పనీచేయక ఏ ఫలమూ అనుభవించక సాక్షిగా ఉన్నవాడని భావం. మానవుడు కూడా తన కర్తృత్వ భోక్తృత్వాలను వదలుకొని ఈశ్వరుడిలాగా ఉదాసీనుడై ఉంటేనే మోక్షం ప్రాప్తిస్తుందని ఇందులో దాగి ఉన్న భావం.
×
ఉదాహరణ : ప్రస్తుత విషయం బాగా బోధపడకపోతే దానిని చక్కగా వివరించటానికి తీసుకువచ్చే మరొక విషయం. ఉత్ఆ హరణ మరొక చోటునుంచి తేవటమని అక్షరార్థం. దృష్టాంతం Illustration. తార్కాణమని భావం. Example పేర్కొనటమని కూడా ఒక అర్థముంది. Mention. జగదీశ్వరులకున్న సంబంధం రజ్జు సర్పాలకున్న సంబంధం లాంటిదే. ఇలాంటి ఉదాహరణల ద్వారా ఈశ్వరుని సత్యత్వం, ప్రపంచ మిథ్యాత్వం మనకు చక్కగా తెలిసిపోతుంది.
×
ఉద్గీథ : గొంతు పైకెత్తి గానం చేయటం. ఉద్గీతే ఉద్గీథ. వైదికమైన ప్రయోగమిది. ఉద్గానం చేయబడినది ఉద్గీతం. ఓంకారానికి ఉద్గీథమని పేరు. దీనికి సంబంధించిన విద్య ఉద్గీథ విద్య. ప్రణవోపాసన అని నామాంతరం.
×
ఉద్దేశ : నిర్దేశించడం. పేర్కొనడం Mention. ఉద్దేశమూ, లక్షణమూ, పరీక్షా అని న్యాయశాస్త్రంలో న్యాయానికి నిర్వచనం చెప్పారు. ఒక విషయాన్ని ముందు ఉదాహరించి తరువాత దానికి నిర్వచనం చేసి ఆ తర్వాత ఆ నిర్వచనం చెల్లుతుందో లేదోనని నిరూపించవలసి ఉంటుందట. అప్పుడే శాస్త్రానికి పరిపూర్ణత అని నైయాయికుల మాట. ఉద్దేశమంటే అభిప్రాయం Aim అని కూడా అర్థమే.
×
ఉద్దేశ్య : ఏది ఉద్దేశిస్తామో అది. The intended. వాక్యంలో ఉద్దేశ్యమని, విధేయమని రెండు భాగాలుంటాయి. బంగారం పచ్చగా ఉంటుందనే వాక్యంలో బంగారమనేది ఉద్దేశ్యం. అంటే దానిని గూర్చి ఏదో మనం చెప్పదలచాము. ఏమిటా చెప్పదలచినది. పచ్చగా ఉండటం. దీనికి విధేయమని పేరు. అంటే ఆ గుణం దానికి విధించి చెబుతున్నాము. వీటినే ఆంగ్లభాషలో Subject అని Predicate అనీ పేర్కొంటారు. మహావాక్యాలకు అర్థం చెప్పటంలో ఈ విభాగం ఎంతో మనకు తోడ్పడుతుంది.
×
ఉద్ధార : ఒక చోటినుంచి తీసి ప్రక్కన పెట్టడం. పైకెత్తడం. ఆఖరుకు పలకకుండా మౌనం వహించటం కూడా అని అర్థం చెప్పవచ్చు. 'ఉద్ధారః కృతః' అంటే ఒక పుస్తకంలో నుంచి తెచ్చి ఉదాహరించబడినది అని గాని కేవలం మౌనం వహించ బడిందని గాని అర్థం చెప్పవచ్చు.
×
ఉద్భావన : పైకి తేవటం. ఊహించటం To think aloud. To bring out.
×
ఉద్భిజ్జ : నేల చీల్చుకుని పైకి వచ్చినది. లతా వృక్ష గుల్మాదులు. నాలుగు భూతరాసులలో ఇది ఒకరాశి. మొదటిది జరాయుజం. రెండవది అండజం. మూడవది స్వేదజం. నాలుగవది ఉద్భిజం.
×
ఉద్భవ/ఉద్భూత : పైకి వచ్చి కనపడేది Formed manifest. జన్మించినది Born. ప్రకటమైనది.
×
ఉద్యోగ/ఉద్యమ : ప్రయత్నం Effort. పైకి రావటం. To come up. మోక్షమార్గంలో ఉద్యోగమనేది చాలా ప్రధానమైన విషయం. అది లేకుంటే కృషి చేయలేడు. గమ్యం చేరలేడు మానవుడు.
×
ఉన్నయ/ఉన్నీత : పైకి తెచ్చుకోవటం. ఊహించటం. భావించటం. అలా ఊహించబడ్డ విషయానికి Inferred ఉన్నీతమని పేరు. ముందు శరీరంలో ఒక చైతన్యకళ ఉందని గుర్తించి సాధకుడైనవాడు ఆ తత్త్వాన్నే ప్రపంచమంతటా వ్యాపింప జేసుకుని చూడాలట. ప్రతిచోటా దాగివున్న సత్యాన్ని ఉన్నయం చేయాలి. అంటే పైకి తెచ్చుకొని దర్శించాలి అని భావం.
×
ఉన్మనస్: మనస్సుకు అతీతమైనది. దాటిపోయినది. Beyond mind. ఇది ఒక యోగ భూమిక. అమనస్కమని కూడా అంటారు. వేదాంతులు చెప్పే ఆత్మ చైతన్యమిదే. Supramental consciousness. అది కూడా మనోభూమికకు అతీతమైన తత్వమే. యోగులది వృత్తి రూపమైతే జ్ఞానులది సాక్షిరూపం.
×
ఉపకార : తోడ్పడటం. Help. contribute.లోకమంతా ఉపకార్యోపకారక సంబంధంతోనే జీవిస్తున్నదని బృహదారణ్యకం చాటుతున్నది. మధు బ్రాహ్మణమనే ఘట్టమంతా ఇదే. పరస్పరం తోడ్పడటం మూలాన జీవయాత్ర సాగుతున్నది. సాపేక్షమేగాని Relative నిరపేక్షమైనదేదీ లేదు లోకంలో. నిరపేక్షమైన దొక పరమాత్మ తత్త్వమే. అలాంటి తత్త్వమున్నదని మనకు ఈ సాపేక్ష ప్రపంచమే సూచిస్తున్నదంటారు మహర్షులు.
×
ఉపక్రమోప సంహార : ఉపక్రమమంటే ఆరంభం. ఉపసంహారమంటే అంతం. Beginning and End. శాస్త్రంలో ఒక విషయాన్ని ఇదమిత్థమని నిరూపణ చేయాలంటే ఆరు విధాలైన ఆధారాలుండాలి మనకు. వీటికే తాత్పర్య లింగమని పేరు. అందులో మొదటిది ఉపక్రమోప సంహారాలు. లింగమంటే ఒక విషయం ఫలానా అర్థమే చెబుతుందనే సూచన. అందులో ఇది ఒకటి. ఉపక్రమంలో ఏది ప్రస్తావిస్తామో అదే ఉపసంహారంలో కూడా కనపడాలి మనకు. లేకుంటే రెండింటికి అందిక పొందిక లేకపోతుంది. రెంటికీ సమన్వయ మున్నప్పుడే ఆ విషయం శాస్త్రజ్ఞుడు ఉద్దేశించి నదేనని నిర్థారణ చేయవచ్చు. తత్త్వమసి మహావాక్యంలో మొదట ప్రపంచమంతా సద్రూపమేనని, జీవరూపంగా ఈశ్వరుడే ప్రవేశించాడని వర్ణించబడింది. ఇది ఉపక్రమం. మరలా చివరకు 'ఐతదాత్మ్య మిదం సర్వం స ఆత్మా' అని వర్ణించబడింది. ఇది ఉపసంహారం. దీన్నిబట్టి జగత్తూ, జీవుడూ ఇద్దరూ ఈశ్వర స్వరూపమే అనే అద్వైత సిద్ధాంతానికి బలమేర్పడున్నది.
×
ఉపకోసల విద్య : ఛాందోగ్యంలో ఎన్నో ఉపాసనలు చెప్పబడ్డాయి. వాటికి విద్యలని పేరు. ఆ విద్యలలో ఇది ఒకటి. దీని వివరణ ఛాందోగ్యంలో చూడవచ్చు. కామలాయనుడనేవాడు జాబాల వద్ద నేర్చుకొన్నదిది. కమ్బ్రహ్మ-ఖమ్బ్రహ్మ కేవల సుఖం కాదు. కేవల ఆకాశం కాదు. ఆకాశంలాగా అంతటా విస్తరించిన ఆనందమే బ్రహ్మమని భావించాలట.
×
ఉపగమ : Approach. అందుకోవటం. చేరటం.
×
ఉపచార : లక్షణ Secondary sense. గౌణమని కూడా అంటారు. ముఖ్యార్థం కాకుండా లక్ష్యార్థం చెప్పుకోవటం. అలా చెబితే దానికి ఔపచారికమని పేరు. 'సింహోమాణవకః.' ఈ బ్రహ్మచారి సింహమే అని అన్నప్పుడు అతడు వాస్తవంగా సింహం కాదు. కాని సింహ గుణాలైన పట్టుదల, ప్రతాపమూ ఉన్నవాడని అర్థం చెప్పుకోవచ్చు. ఇదే ఉపచారమంటే.
×
ఉపచయ : అపచయానికి వ్యతిరేకి. ఎక్కువ. అధికం అని అర్థం. పోగు కావటమని కూడా అర్థమే.
×
ఉపజన : రహస్యంగా, ఏకాంతంగా. In privacy.
×
ఉపదేశ : దగ్గరగా కూర్చుని చూపటం. సూచించటం. To Direct or Instruct in solitude. రహస్యంగా ఒక సత్యాన్ని అందజేయడం. బ్రహ్మోపదేశం అంటే బ్రహ్మతత్త్వం చాలా విలువైనది గనుక బాహాటంగా కాక అధికారియైన వాడికి దాని జ్ఞానాన్ని రహస్యంగానే బోధించవలసి ఉంటుంది. ఇక్కడ జ్ఞానమంటే అనుభవం కూడా. కనుక Transmission of secret knowledge రహస్య విజ్ఞానాన్ని శిష్యుని అనుభవానికి తెచ్చే విధానమని భావం.
×
ఉపధాన/ఉపాధి : ఒక దానిలో మరొకదాన్ని ఉంచటం. ఇవి రెండూ వస్తువులే నంటారు లోకులు, మిగతా శాస్త్రజ్ఞులు. బల్లమీద పుస్తకం ఉంచామంటే బల్లా వాస్తవమే. పుస్తకమూ వాస్తవమే. ఇక్కడ బల్ల ఆధారమైతే దానిమీద పెట్టిన పుస్తకం ఉపాధి. కాని అద్వైతులు దీని నంగీకరించరు. వారి మతంలో ఆధారమే వస్తువు. దానిమీద తెచ్చిపెట్టిన ఉపాధి మరొక వస్తువుగాదు. దాని తాలూకు ఆభాసే Form. ఉదాహరణకు జలంమీద తరంగం కనిపిస్తున్నదంటే తరంగం జలానికి వేరుగా స్వతంత్రమైన పదార్థం కాదు. జలమే తరంగంగా భాసిస్తున్నది. కనుక జలంమీద ఉపాధిగా ఆరోపితమైనది జలమేనని చెప్పవలసి ఉంటుంది. జలం ద్రవ్యమైతే Substance తరంగం దాని రూపం Form. రూపం ద్రవ్యానికెప్పుడూ వేరుకాదని వారి సిద్ధాంతం. కనుక ఉపాధి అంటే ఆభాస అని అర్థం చేసుకోవలసి ఉంది. ఉపాధి అనే మాటకు ద్వారమని, Medium ప్రణాళిక అని కూడా అర్థమే. నామరూపాలు చైతన్యానికి ఉపాధులు. దేహేంద్రియాదులు ఆత్మకు ఉపాధులు అని అంటే అర్థం లోపలి చైతన్యం వీటిద్వారా ప్రసరిస్తున్నదని. వస్తువు ప్రసరించే సాధనమే ఉపాధి అనే మాట కర్థం.
×
ఉపనయన : దగ్గరకు తీసుకుపోవటం. చేర్చటం. గురువు దగ్గరకు వటువును తీసుకెళ్ళి సంస్కారం చేయించటం. దీనికే గురూపసదనమని కూడా పేరు. సంస్కారం పొందితే వాడు ఉపనీతుడౌతాడు. Baptised. Invested with the holy thread. ఇంతేగాక తర్కశాస్త్రంలో పంచావయవ వాక్య ప్రయోగమని ఒకటి ఉంది. అందులో నాలుగవ అవయవానికి ఉపనయమని పేరు. Application. అంటే ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని హేతువు ఉదాహరణతో బలపరిచి మరలా దాని నసలు విషయానికి ముడిపెట్టి చెప్పటం.
×
ఉపనిషద్: ఉప-దగ్గరగా, నిషద్కూర్చోవటం అని అర్థం. అరణ్యాలలో శిష్యులు గురువు దగ్గర కూర్చుని రహస్యంగా బ్రహ్మవిద్య నభ్యసించేవారట. కనుక బ్రహ్మవిద్యకు ఉపనిషద్అని పేరు వచ్చింది. రహస్య విజ్ఞానమని కూడా ఒక అర్థం చెప్పారు Secret doctrine భాష్యకారులు. వేదంలో ఇది చివరి భాగం. కనుక వేదాంతమని కూడా దీనికి పేరు వచ్చింది. వేదం కర్మకాండ అయితే వేదాంతం జ్ఞానకాండ.
×
ఉపన్యాస : ముందు పెట్టటం. To place before. ఉదాహరించటం. ప్రస్తావించటమని అర్థం.
×
ఉపపత్తి : హేతువు Argument. Reason. ఒక విషయం ఇదమిత్థమని నిర్ణయించటానికి తగిన కారణం చూపటం. ఉపపత్తి ఉంటే అది ఉపపన్నమవుతుంది. చెల్లుతుందని అర్థం.
×
ఉపపద : ఒక పదానికి దగ్గర ఉన్న మరొక పదం. ఈ పదానికి అర్థం నిష్కర్షగా చెప్పాలంటే ఆ పదం తోడ్పాటు ఉండాలి. అలా తోడ్పడే పదం ఉపపదం. బిరుదమని కూడా Title అర్థమే.
×
ఉపభోగ : కర్మఫలాన్ని అనుభవించటం. అంతేగాక జ్ఞానఫలాన్ని అనుభవించినా అది ఉపభోగమే. మొదటిది సంసారంలోనైతే రెండవది సాయుజ్యంలో.
×
ఉపబృంహణ : బలపరచటం. గట్టి చేయటం. ఇతిహాస పురాణాలతో వేదార్థాన్ని బలపరిస్తే దానికి వేదోపబృంహణమని పేరు. అలాగే ఇముడ్చుకోవటమని కూడా ఒక అర్థముంది ఈ శబ్దానికి. బ్రహ్మతత్త్వం అన్నిటికంటే పెద్దదనే గాక అన్నింటిని తనలో బృంహణం అంటే ఇముడ్చుకోగలిగేది గనుక బ్రహ్మమని పేరు వచ్చిందట.
×
ఉపమర్ద : బాగా నలగగొట్టటమని అర్థం. ఆత్మజ్ఞానంతో కర్మకు ఉపమర్ద మేర్పడుతుందని అద్వైతుల సిద్ధాంతం. అంటే కర్మ నిష్కర్మగా మారిపోతుందని భావం.
×
ఉపమాన : ప్రస్తుతాంశం బాగా తెలియకపోతే అలాంటిదే మరొక అంశాన్ని తెచ్చి దానితో పోల్చి చెప్పటం. Analogy. అద్వైతులు చెప్పే ప్రమాణాలలో ఇది ఒక ప్రమాణం. 'గో సదృశో గవయః' గవయమంటే ఏమిటో చాలామందికి తెలియక పోవచ్చు. అది గోవులాగే ఉండే ఒక జంతువు. గోవుతో పోల్చి చెబితే అర్థమవుతుంది మనకు. ఇప్పుడీ గోవు ఉపమేయమైతే గవయమనేది దానికి ఉపమానం. తెలిసినది ఉపమేయం. తెలియనిది ఉపమానం. తెలియనిదాన్ని తెలుసుకోవాలంటే తెలిసిన దానితో పోల్చి చెప్పటమే సరియైన మార్గం కనుక ప్రత్యక్షాదుల లాగే ఉపమానం కూడా ఒకగొప్ప ప్రమాణమైంది.
×
ఉపయోగ : వినియోగం Utility అని అర్థం. వాడటమని కూడా Use అర్థమే.
×
ఉపరాగ : సూర్యచంద్రులకు పట్టే గ్రహణం. Eclipse. ఒకదాని గుణం మరొకదానికి బాగా పట్టటం కూడా. తాదాత్మ్యం Identity.
×
ఉపరక్త : అలా మమేకం చెందిన పదార్థానికి పేరు Tinged. Coloured. Totally overpowered.
×
ఉపలక్షణ : లక్షణమంటే నిర్వచనం. Definition. ఒక భావాన్ని సూచించేది. అందులో ఒకదాన్ని మాత్ర ముదాహరించి మిగతా ఆ జాతివన్నీ అలాగే ఉంటాయని సూచన చేస్తే Indicate అది ఉపలక్షణం. ఒక అప్అంటే జలాన్ని చెబితే చాలు. మిగతా నాలుగు భూతాలకూ అది ఉపలక్షణ మవుతుంది Representative. Inclusive.
×
ఉపలంభ/ఉపలబ్ధి : ఒక విషయాన్ని తెలుసుకోవటం. గుర్తించటం. అది మనకు పట్టుబడటం. ఒక విషయం మనకు లభించటం లేదా దొరకటం. Availability. అలా కాకుంటే అనుపలబ్ది Non-availability. Absence.
×
ఉపశమ : ఉపశమించటం. తగ్గిపోవటం. విరమించటం. ఆగిపోవటం. ప్రపంచోపశమమని పరమాత్మను వర్ణించింది శాస్త్రం. ప్రపంచమనే భావం ఎక్కడ పూర్తిగా తొలగిపోతుందో అదట పరమాత్మ స్వరూపం. తాపత్రయం జీవుడికి తొలగిపోవటం కూడా ఉపశమమే.
×
ఉపసదన/ఉపసత్తి : దగ్గరకు వెళ్ళడం Approach. సమీపించటం. ముఖ్యంగా శిష్యుడు గురువుగారిని సమీపించి వారి దర్శనం చేసుకోవటం. దీనినే గురూపసదన మంటారు.
×
ఉపసర్జన : ప్రధానమైన అంశంకాక Main దానికి తోడ్పడే అప్రధానమైన అంశం. Subsidiary. Accessary.
×
ఉపస్కార : అసలు విషయానికి ఉపకరించేది. తోడ్పడేది. దానికి అలంకార ప్రాయమైనది.
×
ఉపస్థ : గోప్యేంద్రియం. స్త్రీ పురుషులకు ఇద్దరికీ సంబంధించినది. కర్మేంద్రియాలలో ఐదవది. దీని గుణం ఆనందమన్నారు శాస్త్రంలో.
×
ఉపస్థాన/ఉపస్థిత : దగ్గరకు వెళ్ళి ఉండటం. సామీప్యం. సన్నిధి Presence. అలాంటి సన్నిహితుడైనవాడు ఉపస్థితుడు Present. ఉపస్థానమంటే ఉపాసన. ఉపస్థితుడంటే ఉపాసకుడు అని కూడా అర్థమే.
×
ఉపహిత : ఒక ఉపాధిలో Medium చేరి ఆ మేరకే ఆగిపోయినది. పరిమితమైనది. మనస్సులో చేరి అక్కడికే పరిమితమైన జీవచైతన్యం. దీనికి ఉపహిత చైతన్యమని పేరు.
×
ఉపాధి : ఆవరించినది. కప్పివేసినది. నామరూపాలు చైతన్యాన్ని కప్పి తగ్గించి చూపుతున్నాయి. చైతన్యం వాటిద్వారా ప్రసరిస్తుంటుంది. ఈ ఆవరణమూ ద్వారమే ఉపాధి. శరీరాదులిలాంటివే. వస్తువు కాభాస ఉపాధి. అదే దాన్ని కప్పుతుంది. అదే దాన్ని విప్పిచూపుతుంది. కప్పితే ఆవరణం. విప్పితే ద్వారం.
×
ఉపాయ : కలవటం. కలిపేది. మార్గం. సాధనం. Helper. Means. దీనికి భిన్నమైనది అపాయం. విడిపోవడమని అర్థం.
ఉపాంగ : అంగమంటే ప్రధానమైన అంగికి తోడ్పడేది. దానికి మరలా తోడ్పడేది ఉపాంగం.
×
ఉచ్ఛూన : పైకి ఉబ్బినది. ఈ ప్రపంచమంతా శివతత్త్వం నుంచి ఇలా పైకి ఉబ్బి కనిపిస్తున్న పదార్థమే. దీనిని మరలా శివస్వరూపంగా భావించాలి మనం. అప్పుడిది చదునై శివాత్మకంగా మారుతుంది. అదే శివసాయుజ్య మంటారు శివాద్వైతులు.
×
ఉన్మజ్జన : శివతత్త్వం దేహంలో ప్రవేశించి ఇక్కడ నిమజ్జన Merge మయి కూచుంది. మరలా దీన్ని శివభావనతో చూస్తే సంసార సాగరంలో నుంచి మరల ఉన్మజ్జన Emerge మయి శివాత్మకంగా మారగలడీ జీవుడని తాంత్రికుల సిద్ధాంతం.
×
ఉపాంశు : బిగ్గరగా కాకుండా పక్కవాడికి మాత్రమే తెలిసేలాగా ఉచ్చరించటం. రహస్యంగా ఒకరికొకరు మాటాడుకోవటం. Between two only. The preceptor and the disciple. నాలుగు విధాలైన యజ్ఞాలలో జపయజ్ఞం తరువాతిది ఉపాంశు యజ్ఞం. మంత్రోపదేశాలన్నీ ఇలాంటి విధానంలోనే జరుగుతుంటాయి.
×
ఉపాదాన : దగ్గరకు తీసుకోవటం. దీనికి వ్యతిరేకి అపాదానం. మూడు విధాలైన కారణాలలో ఇది ఒక కారణం. Cause. ప్రకృతి అని కూడా పేర్కొంటారు దీన్ని అద్వైతులు Material cause. ఒక కార్యం ఏ మూలపదార్థం నుంచి ఏర్పడుతుందో అది. కుండ అనే కార్యం మట్టిలోనుంచి వస్తున్నది. మట్టి కుండకు ఉపాదానం. అద్వైతుల దృష్టిలో కార్యం దాని ఉపాదానం కంటే వేరుకాదు. మట్టే కుండగా రూపుదిద్దుకొని కనిపిస్తున్నది. నుక ఉపాదానమూ దాని ఉపాదేయమూ రెండూ అభిన్నమే.
×
ఉపాసన : ఉప దగ్గరగా, ఆసన కూచోటం. ఏ దేవతను మనసా స్మరిస్తామో దాని మూర్తికి మనసు దగ్గర పడితే దాని కుపాసన అని పేరు. Meditation or worship. ఇది సగుణం, నిర్గుణమని రెండు విధాలు. మొదటిది ధ్యానమార్గమైతే రెండవది జ్ఞానమార్గం.
×
ఉపేక్షా : అపేక్షకు వ్యతిరేకి. అక్కరలేదని ఉదాసీనంగా చూడటం. తీసుకుంటే ఉపాదానం. వదిలేస్తే హానం. రెండూ కాని మధ్య స్థితి ఉపేక్ష. హానోపాదానాదులు Selection and Rejection రెండూ లేని ఉదాసీనత. ఇదే అద్వైత సాధనలో చేయవలసిన గొప్ప కృషి.
×
ఉపోద్బలక : ఒకదాన్ని సహేతుకంగా నిలబెట్టడానికి ఇంకా అవీ ఇవీ చెప్పి బాగా బలపరచటం. To strengthen. దోహదం చేయటం. To support.
ఉర్వారుక మివ : దోసకాయ పండిపోతే దాని తొడిమ దానిపాటికదే ఊడిపోతుంది. ఉర్వారుకమంటే దోసపండని అర్థం. దోసపండు తొడిమలాగే జీవన్ముక్తుడి శరీరం కూడా వాడి స్వరూపం నుంచి పక్కకు తొలగిపోతుంది. ప్రారబ్ధం కొద్దీ అంటి పట్టుకున్నా వాడి దృష్టిలో దేహాత్మాభిమానం లేదు గనుక తొలగిపోయినట్టే భావిస్తాడు.
×
ఉల్లేఖన/ఉల్లింగన : ఫలానా అని గుర్తించటం, ఉదాహరించటం, ఎత్తిచూపటం, వాగ్రూపంగానే కాక మనసా భావించటం. అనుభవానికి తెచ్చుకోవటం. చేసిన సిద్ధాంతాన్ని తన కన్వయించుకోవటం. తాంత్రికుల భాషలో దీనికి ఉల్లేఖనమనే గాక ఉదాహరణమని కూడా పేరున్నది.
×
ఊహ : ఊహించటం. Imagination. Inference. తర్కంలో ఒక నిమిత్తాన్ని బట్టి నైమిత్తికాన్ని అర్థం చేసుకోవటం. Determining the fact with the help of some token or symbol.
×
ఊర్జస్: బలం. వీర్యం. Strength. ఆహారమూ దానివల్ల కలిగే సామర్థ్యమూ రెండింటికీ వర్తిస్తుంది ఇది.
×
ఊర్ణనాభి : తంతుకీటమని, సాలెపురుగని అర్థం. అది తన నోటిలోని లాలాజలాన్నే ఒక దారంగా పేని దాని ఆధారంతోనే క్రిందికి దిగి వస్తుంది. మరలా దాన్ని లోపలికి తీసుకుంటూ పైకి వెళ్లి పోతుంది. అలాగే పరమాత్మ తనలోని నామరూపాల బలంతోనే ప్రపంచాన్ని సృష్టిస్తూ క్రిందికి దిగివచ్చాడు. మరల దీన్ని తనలోకే చేర్చుకుంటూ అద్వితీయంగా నిలిచి పోతాడని అద్వైతులు వర్ణించే ఉపమానమిది.
×
ఊర్ధ్వమూల : ఊర్ధ్వమూల మధశ్శాఖమని గీతా శ్లోకం. సంసారమనే అశ్వత్థ వృక్షానికి మూలం ఊర్థ్వదిశగా ఉందట. అది ఏదోగాదు మాయాశక్తితో కూడిన పరమాత్మ చైతన్యమేనని భాష్యం చెప్పారు భగవత్పాదులు. కనుక అసంగ శస్త్రంతో దీనిని ఛేదించి సాధకుడు ఊర్ధ్వముఖంగా ప్రయాణంచేసి ఆ తత్వాన్నే చేరవలసి ఉంటుంది అని దీని ఆంతర్యం.
×
ఊర్ధ్వోచ్ఛ్వాస : ఎగశ్వాస అని అర్థం. ఉదానవాయువు ఆగకుండా అవసాన కాలంలో పైపైకి వెళుతూ చివరకు శరీరాన్ని వదిలేసి పోతుంది. దీనికే వాడుకలో ఎగశ్వాస అని పేరు.
×
ఊర్ధ్వగతి : అథోగతికి వ్యతిరిక్తం. సత్కర్మలు, ఉపాసనలు ఆచరించినవారు పితృయానం, దేవయానం చేసి పరలోకాలకు వెళ్ళే మార్గం.
×
ఊర్ధ్వలోక : కర్మిష్ఠులు, ఉపాసకులు అంతకంతకూ ఉత్తమ లోకాలు చేరి అక్కడ ఉత్తమ భోగాలు అనుభవిస్తారు. అలాంటి లోకాలకు ఊర్ధ్వలోకాలు అని పేరు. స్వర్గాదులు.
×
ఊర్మి : అల. తరంగం. షడూర్ములని వేదాంతుల పరిభాష ఒకటి ఉంది. తరంగాలలాగా వస్తూ పోతూ ఉండేవి అని అర్థం. అవి ఆరు. అందులో జరామరణాలు రెండు స్థూలదేహానికి చెందినవి. క్షుత్పిపాసలు రెండూ సూక్ష్మదేహానికి పోతే మోహశోకాలు రెండూ కారణ దేహానికి సంబంధించిన దోషాలు. ఇవే షడూర్ములు. వీటిని నిశ్చలమైన సాగరంలాంటి మన చైతన్య సాగరంలో అదిమి వేయగలిగితే అంతా ఆత్మాకారంగా అనుభవానికి రాగలదు.