అలాతశాంతి : అలాతమంటే కొరవి. అది త్రిప్పుతూపోతే మండలాకారంగా తిరుగుతుంది. నిలువుగా ఆడిస్తే రేఖాకారం. సగం తిప్పితే అర్ధచంద్రాకారం. ఇప్పుడీ ఆకారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కొరవిలోనుంచే. ఏమైపోతాయి చివరకు? కొరవిలోనే. అలాగే పరస్పర విరుద్ధ మతాలన్నీ అద్వైతంలోనుంచే వచ్చి అద్వైతంలోనే సమసిపోతాయి. దానికేదీ విరుద్ధంకాదు. అవి తమలో తాము విరుద్ధమైనా దాని కవిరుద్ధమే. అక్కడ అన్నీ శాంతించవలసిందే అని తాత్పర్యం. గౌడపాదులవారి మాండూక్యకారికా గ్రంథంలో ఇది నాల్గవ ప్రకరణం. ఇలాటి సమన్వయమే మనమక్కడ చూడగలం.
×
అలింగ : లింగమంటే చిహ్నం. గుర్తు. Token Indication. అది లేకుంటే అలింగం. ఒక భావాన్ని గుర్తించటానికి ఆధారం లేకపోవటం. బ్రహ్మతత్త్వం అలాంటిది. సన్యాసంలో ఇది ఒక తెగ. కాషాయ కమండల్వాది చిహ్నాలేవీ లేని పరమార్థ సన్యాసం. అనుమాన ప్రమాణంలో హేతువు చూపకుండా చేసిన ప్రతిజ్ఞ కూడా అలింగమే. లింగమంటే హేతువని అర్థం. అగ్నికి ధూమం లింగం.
×
అవక్రచేతాః : వక్రంగాని జ్ఞానం. సంపూర్ణమైన జ్ఞానమని అర్థం. అది ఏదో కాదు. పరమాత్మ స్వరూపం. అది సర్వవ్యాపకం. పరిపూర్ణం గనుక పరిమితత్వమనే దోషం లేదు దానికి.
×
అవకాశ : ఒక సిద్ధాంతం ప్రవర్తించటానికి ఒక మాట చెప్పటానికి వీలుపడటం Scope. అలాగే ఆకాశానికి కూడా అవకాశమని పేరు. ఖాళీ అని అర్థం.
×
అవగమ/అవగతి : గ్రహించటం. తెలుసుకోవటం. జ్ఞానం. జ్ఞానమేగాక అనుభవమని కూడా Realisation అర్థముంది. ప్రత్యక్షావగమమని గీతా ప్రయోగం. బ్రహ్మావగతి అంటే బ్రహ్మానుభవం. ఇది ఆత్మస్వరూపమే గనుక సాక్షాత్తుగానే అనుభవానికి వస్తుందని పెద్దల హామీ.
×
అవచ్ఛేద : ఒకచోటికి తెగిపోవటం. పరిచ్ఛిన్నం లేదా పరిమితం కావటం Limitation. ఇది ఇంత అని పరిగణించటం.
×
అవతార : క్రిందికి దిగిరావటమని అర్థం. అవరోహణమని కూడా అనవచ్చు. Descent. భగవత్చైతన్యం ఆయా రూపాలలో అప్పుడప్పుడు వచ్చి సాక్షాత్కరించటం అని భావం. అంతేగాక ఒకవిషయంలో ప్రవేశించటం కూడా అవతారం లేదా అవతారిక Introduction.
×
అవధాన : Attention. Concentration. ఒకదానిమీద దృష్టి పెట్టటం. జాగ్రత్త వహించటం.
×
అవధారణ : Only. అదేకాని మరొకటి కాదని నిర్థారణ చేయటం. Determination. ఈ అర్థంలో ప్రయోగించేదే ఏవ అనే శబ్దం. 'ఆత్మైవనాన్యత్.' ఆత్మే మరేదీ లేదు. ఇది ఇలాగే, ఇంతే అని నిష్కర్ష చేసే మాట ఇది.
×
అవధి : పర్యంతం. Boundary. Limit. కొస, చివర, మరణావధి. మరణం వరకు 'ఆ బ్రహ్మ భవనాత్' అన్నప్పుడు ఆ అనే మాట అవధిని చూపుతుంది. బ్రహ్మలోకం వరకూ అని అర్థం.
×
అవదాత : తెల్లనిది. స్వచ్ఛమైనది. అంతేకాదు. నిర్దుష్టమని కూడా అర్థమే.
×
అవదాన : యజ్ఞంలో మేధ్యమైన పశువును చంపి దాని శరీరంలోని భాగాలను ఒకక్రమంలో బయట పెట్టటం.
×
అవరోధ : ప్రతిబంధం Obstruction. ప్రతిరోధమని కూడా దీనికి పర్యాయమే.
×
అవభాస : వస్తువు మరొక రూపంలో కనపడటం. Appearance. రజ్జు సర్ప దృష్టాంతంలో రజ్జువే సర్పరూపంలో భాసిస్తున్నది. సర్పమక్కడ అవభాస. లేదా ఆభాస. పరమాత్మ ప్రపంచంగా కనపడటం కూడా ఇలాంటివే.
×
అవశేష/అవశిష్ట : మిగిలిపోవటం. అన్నీ బాధితమైపోగా చివరకేది మిగిలి ఉంటుందో Residue. అది అవశిష్టం. అబాధితమైన ఆత్మస్వరూపమే అది.
×
అవయవ : శరీరంలో భాగం. కరచరణాదులు Limbs.. కేవలం భాగమని కూడా Part అర్థమే. సమష్టిలో Whole దాని వ్యష్టి Part కి అవయవమని పేరు. తర్కంలో పంచావయవ వాక్యమని ఉంది. Sylogism అని పాశ్చాత్య తర్కంలోమాట. ఇందులో ఐదు అవయవాలు లేదా భాగాలు ఉంటాయి. 1. ప్రతిజ్ఞ 2. హేతువు 3. దృష్టాంతం 4. ఉపనయం 5. నిగమనం. హేతువాదమంతా ఈ రూపంగానే సాగిపోవాలని తార్కికుల ఆదేశం. Argumentation.
×
అవలంబ / అవష్టంభ : ఒక ఆధారం. Prop. Support. Base.
×
అవసర : అవకాశం Occasion. తగిన సమయం. సందర్భం context అని అర్థం.
×
అవసాన : చివరి దశ. అంతం. ఒకచోట ఆగిపోవటం. జీవితంలో వార్థక్యం తరువాత వచ్చే ఆఖరి దశ.
×
అవస్థా/అవస్థాన : నిలిచిపోవటం. నిలకడ చెందటం. Settlement. కదలకుండా ఉండటం స్థిరత్వమని కూడా అర్థమే.
×
అవస్థాత్రయ : ప్రతిదినమూ మన మనుభవించే జాగ్రత్స్వప్న సుషుప్తులు మూడూ అవస్థలే. దశలే. దీనికే అవస్థాత్రయమని పేరు.
×
అవాంతర వాక్య : ఒక పెద్ద వాక్యంలో చేరిపోయినది. మధ్యలో వచ్చే చిన్న వాక్యం. Subsidiary. ఉపనిషత్తులో ఉపదేశించే వాక్యాలు రెండు విధాలు. 1. మహావాక్యం. తత్వమసి మొదలైనవి. జీవబ్రహ్మ ఐక్యాన్ని చెప్పే వాక్యాలన్నీ మహావాక్యాలు. పోతే అలాంటి వాక్యార్థాన్ని ఒక్కసారిగా గుర్తించలేని మధ్యమ మందాధికారులకు తత్, త్వమ్, అసి అనే పదార్థాల జ్ఞానం ముందుగా ఏర్పడవలసిన అవసరముంది. ఖండరూపమైన ఈ పదార్థ జ్ఞానమే అఖండ రూపమైన మహా వాక్యార్థానికి దారి తీస్తుంది. సృష్టి స్థితి లయాది వర్ణన జీవుని ప్రవేశ వర్ణన ఇలాంటి పదార్థ బోధే. ఇది సవికల్పమైన Analysis అర్థాన్ని చెబితే వాక్యార్థం నిర్వికల్పమైన Synthesis అర్థాన్ని మనకు బోధిస్తుంది.
×
అవాఙ్మానసగోచర : వాక్కుకు, మనసుకు కూడా గోచరించనిది. అందరానిది. నిరాకారమైన సర్వవ్యాపకమైన ఆత్మతత్వం.
×
అవాచ్య : వాచ్యంకానిది. చెప్పటానికి శక్యం కానిది. ఆత్మతత్వం. అది సాక్షాత్తుగా ఫలానా అని చెప్పలేము. పరోక్షంగా సూచించవలసిందే. అనగా లక్ష్యమని అర్థం.
×
అవాక్యార్థ : పదార్థ వాక్యార్థాల జ్ఞానం కేవలం పరోక్షమే. అపరోక్షం కాదు. అందులో శబ్దాకార వృత్తి ఇంకా మిగిలి ఉంటుంది. అది కూడా దాటి బ్రహ్మాకార వృత్తి మాత్రమే ఉండిపోవాలి. అప్పుడే దానికి పరోక్షత్వం తొలగిపోయి అపరోక్ష మవుతుంది. అదే అనుభవం. ఇందులో శబ్ధార్థాల తాలూకు ఆలోచన ఉండదు. కేవలం ఆత్మ జ్ఞానమే అది. దీనికే అవాక్యార్థమని పేరు.
×
అవిషయ : జ్ఞానానికి విషయం కానిది. గోచరం కానిది. విషయం కాకపోతే దానికి విషయి అని పేరు. అది ఒక్క ఆత్మచైతన్యమే. అది ఎప్పుడూ జ్ఞానస్వరూపమే కనుక విషయియే కాని విషయం కాదు. అవిషయమే Subject.
అశనాయా : ఆహారానికి అశనమని పేరు. అది జీర్ణమైన తరువాత ద్రవంగా మార్చి రక్తంలో చేరుస్తుంది. ప్రాణశక్తి. అశనాన్ని నయనం చేస్తుంది కనుక అశనాయ అని పేరు వచ్చింది. నయమైన తరువాత మరలా ఆకలి ఏర్పడుతుంది కనుక అశనాయా అంటే ఆకలి అని అర్థం.
అవ్యయ : వ్యయమంటే ఖర్చు. మార్పు. మార్పులేని పదార్థమేదో అది అవ్యయం. భగవత్తత్త్వం నామరూపాత్మకం కాదు కనుక దానికెలాంటి మార్పులేదు. కూటస్థ సత్యం. Eternal truth.
×
అవ్యభిచార : వ్యభిచారమనగా తప్పిపోవటం, చలించటం, మారటం. ప్రాపంచికమైన ప్రతి పదార్థమూ చలిస్తూ పోయేదే. Mutable. అచలమైన దేదీ లేదు. అది ఒక ఆత్మతత్త్వమే. కనుక అది ఒక్కటే అవ్యభిచారి. ఏకరూపంగా ఎప్పుడూ స్థిరంగా ఉండేదని భావం.
×
అవికార/అవికృత : వికారమంటే మార్పు. వికారంలేని ఆత్మచైతన్యమే సరాసరి వచ్చి మానవ హృదయంలో ప్రవేశించిందని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి జీవసృష్టి వికృతం కాదు. అవికృతం. పోతే ప్రపంచ సృష్టి మాత్రం వికృతమే. అంటే చైతన్యం గుప్తమై నామరూపాలుగా మారి కనిపిస్తున్నది అని అర్థం.
×
అవితథ : వితథమంటే వ్యర్థం. వ్యర్థం కానిది అవితథం. సార్థకమని భావం. Purposeful అనృతానికి కూడా వితథమని పేరు. పోతే వితథం కానిది సత్యం గనుక సత్య మవితథం.
×
అవిద్యా : విద్య కానిది. విద్య అంటే జ్ఞానం. ముఖ్యంగా బ్రహ్మజ్ఞానం. లేదా ఆత్మజ్ఞానం. అది కాదంటే అర్థం అజ్ఞానమని. మనకున్న జ్ఞానమంతా విశేష జ్ఞానమే. ఇది సమస్యకు పరిష్కారం కాదు. కనుక దీనికి విద్య అని, జ్ఞానమని పేరు పెట్టలేదు వేదాంతులు. వారు దీనిని అవిద్య అనే పేర్కొన్నారు. వేదవాఙ్మయం మొదలు ఇప్పటి భౌతిక విద్యలవరకు అంతా అవిద్యే. Nescience. 'విద్యతే అస్తి.' ఏది ఉందో అది 'న విద్యతే నాస్తి' ఏది లేదో అది. అప్పటికి అవిద్య అంటే అభావం Absence. దేని అభావం ఉన్నట్టు ఏది కనిపిస్తున్నదో దాని అభావం. అదే ఈ ప్రపంచం. ఇది ప్రతీతి సిద్ధమేగానీ వస్తు సిద్ధం కాదంటారు అద్వైతులు. ఆత్మజ్ఞానం ఎప్పుడూ ఉంది. అయినా మనకది లేనట్టు తోస్తున్నది. ఇదే అవిద్య. పరమాత్మ కిది విద్య. జీవాత్మకు అవిద్య.
×
అవిద్యాకామకర్మ : అవిద్య అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం. దానివల్ల అనాత్మ ప్రపంచమొకటి కనిపిస్తూ ఉండటంచేత మానవుడికి ఈ ప్రపంచంమీద కామమేర్పడుతుంది. కామ్యమైన వస్తువును పొందడానికి కర్మ చేయవలసి వస్తుంది. కర్మ ఫలాన్ని అందిస్తుంది. ఇదే సంసార బంధం. కనుక బంధానికి కారణభూతమైన అనర్థాలివి మూడు. వీటికే వేదాంతులు పాపాలని, పాతకాలని పేరు పెట్టారు. 'సర్వపాపేభ్యో మోక్షయిష్యామి' అని గీతావచనం. పాపమంటే పడగొట్టేదని అర్థం. ఇందులో అవిద్యే కారణ శరీరం. కామం సూక్ష్మశరీరం. కర్మ స్థూల శరీరం. శరీర త్రయం కూడా వీటివల్లనే సంక్రమించింది. ఇవి మూడూ తొలగిపోతే కాని మోక్షప్రాప్తి లేదు మానవుడికి.
×
అవినాభావ : వినాభావమంటే వేరుగా ఉండటం. separation. వేరుగా కాక రెండు భావాలు ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని ఉంటే అవినాభావం Inseparability. కార్యకారణాలకు ఉండే సంబంధం ఇలాంటిదే. మృత్తికా ఘటాదులన్నీ దీనికి ఉదాహరణలే.
×
అవిభక్త : విభక్తం కానిది. Undividedt. నామరూపాలకూ, పరమాత్మకూ రెండింటికీ విభాగం లేదు. రెండూ అవిభక్త దేశకాలాలంటారు భగవత్పాదులు. సర్వత్రా సచ్చిత్తులు వ్యాపించే ఉన్నాయి. ప్రతి నామమూ, రూపమూ సచ్చిన్మయమే. ఒకదానికొకటి దూరంగా లేవు. దూరమైతే నామరూపాల కస్తిత్వం లేదు.
×
అవిరోధ : విరోధం లేకపోవటం. Disagreement. తేడాగాని, పేచీగాని లేకుండా రెండూ సమన్వయమైతే అది అవిరోధం. శుద్ధచైతన్యానికి ఈ ప్రపంచంతో గానీ, జీవులతోగానీ వైరుధ్యం ఏ మాత్రమూ లేదు. అధిష్ఠాన రూపంగా అది సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు విరోధానికి అవకాశమేముంది? బ్రహ్మసూత్రాలలో అవిరోధ పాదమని ఒక అధ్యాయముంది. అద్వైతానికి మిగతా మతాలేవీ విరుద్ధం కావు. అవి నదులైతే ఇది సముద్రం. అన్నీ ఇందులో సమసి పోవలసిందే అని బాదరాయణుల మాట. అంతేగాక కార్యరూపంగా కనపడే సృష్టి అంతా మూలకారణమైన పరమాత్మకంటే విరుద్ధం కాదు. అవిరుద్ధమే అని నిరూపించారు.
×
అవివేక / అవివిక్త : రెండు పదార్థాలు ఒకదానితో ఒకటి పెనవేసుకోవటం. వేరుగా ఉన్నప్పటికీ ఏకరూపంగా కలిసిపోవటం. పాలలో నీరు కలిసి ఉన్నా అవి రెండూ పరస్పర భిన్నమైన పదార్థాలే. అయినా అభిన్నంగా కనబడుతుంటాయి. వేరు గావనే భావం మన కేర్పడుతుంటుంది. ఇదే అవివేకం. ఇలాగే పరమాత్మ, ప్రపంచం రెండూ ఏకమైపోయి ఏది సచ్చిద్రూపమైన భగవత్తత్వమో ఈ నామ రూపాలలో నుంచి వేరు చేయలేక భ్రమపడుతున్నాము. ఇదే మానవుడి అవివేకం.
×
అవిశేష / అవిశిష్ట : విశేషమంటే తేడా. Difference. తేడా చూడకపోతే అవిశేషం. ఒక్కటేనని అర్థం. విశేషమంటే గుణం కూడా. Quality Attribute. గుణమేదీ లేకపోతే అవిశేషం. Substance without property. విశేషమంటే ఫలానా అని వ్యష్టిగా Particular చూడటం. అలాకాక సమష్టిగా General చూస్తే అది అవిశేషం. సామాన్యం. విశేషమంటే విభాగం. వేరనే భావం. అలా కాకుంటే అవిశేషం. ఏకత్వం అని అర్థం. అలాంటి పదార్థం ఏదో అది అవిశిష్టం. సామాన్య రూపమైన ఆత్మతత్వం.
×
అవేక్షణ : క్రిందికి చూడటమని శబ్దార్థం. బాగా లోతుకు దిగి చూడటమని భావార్థం. జ్ఞానం సమ్యగవేక్షణం అని పెద్దల మాట. Knowledge is right vision.
×
అవ్యక్త / అవ్యాకృత : వ్యక్తం కానిది. బయటపడి కనపడనిది. Unformed. Abstract. వ్యాకృతం కానిది. విస్తరించబడనిది. ప్రపంచానికీ పరమాత్మకూ నడుమనున్న ప్రకృతి లేదా మాయాశక్తి. ఇది పరమాత్మ శక్తే గనుక నిరాకారం. స్వతహాగా వ్యక్తం కాదు. అవ్యక్తం. వ్యాకృతం కాదు. అవ్యాకృతం. Unformed. Abstract. అదే పరమాత్మ ఇచ్ఛను బట్టి నామరూపాత్మకంగా పరిణమిస్తే ఈ ప్రపంచం. పరమాత్మను ప్రపంచంగా చూపేది ఈ అవ్యక్తమైన మూలప్రకృతే. Premordial matter. Cosmic Power. సాంఖ్యులు దీనికి ప్రధానమని పేరు పెట్టారు. వారు ఇదే స్వతంత్రమైన పదార్థమంటారు. కానీ అద్వైతులిది అంగీకరించరు. ఇది స్వతంత్రం కాదు. ఈశ్వర ప్రకృతే. ఆయన నాశ్రయించిన శక్తేనని సిద్ధాంతం చేశారు.
×
అవ్యవహిత : వ్యవహితమంటే ఒక పదార్థానికి దూరమైపోవటం. మధ్యలో ఏదైనా అడ్డు తగిలినప్పుడే అది జరుగుతుంది. దానికే ఉపాధి అని పేరు. Medium లోకంలోని పదార్థాలన్నీ ఒకదానికొకటి అడ్డు తగిలేవే. వ్యవహితమే. కాని పరమాత్మ సర్వవ్యాపకం గనుక అది ఎప్పుడూ అవ్యవహితం.
×
అవ్యవస్థిత : వ్యవస్థితమంటే వ్యభిచరించకుండా స్థిరంగా ఉన్నది. Stable అలా స్థిరంగా లేక ఎప్పటికప్పుడు చలిస్తూ పోతే అవ్యవస్థితం. నిలకడ లేనిది.
×
అవ్యాజ : వ్యాజమంటే నెపం. ఒక నిమిత్తం. అది లేకుంటే అవ్యాజం. సహజమని అర్థం. Natural.
×
అవ్యాప్తి : తర్కంలో ఇది ఒక దోషం. చెప్పిన లక్షణం అన్నిచోట్లా వర్తించక కొన్నిచోట్ల మాత్రమే వర్తించటం. వేదాంతంలో అవ్యాప్తి అంటే సర్వత్రా వ్యాపించక ఎక్కడికక్కడ ఆగిపోవటం. సత్చిత్తులు అన్ని వస్తువులలో వ్యాపించి ఉన్నాయి. కానీ నామరూపాలు ఎక్కడికక్కడే తెగిపోతుంటాయి. కనుక వాటికి వ్యాప్తి లేదు. వ్యాప్యమే.
×
అశబ్ద : శబ్దం కానిది. శబ్దాని కతీతమైనది. అంటే మాటల కందనిది. పరమాత్మ స్వరూపం. శబ్దమంటే శబ్ద ప్రమాణం. శాస్త్రం. అశబ్దమంటే శాస్త్ర ప్రమాణానికి విరుద్ధమైన సిద్ధాంతం.
×
అశ్వత్థ : రావిచెట్టు. లాక్షణికంగా సంసారం. శ్వః అంటే రేపు. స్థ అంటే ఉండటం. రేపటికి కూడా ఉండనిది. అంత క్షణభంగురమీ సంసారమని భావం.
×
అశివ : శివమంటే సత్యమైనది. హితమైనది. ఆత్మస్వరూపం. దానికి భిన్నంగా చూచేదంతా అశివమే. అంటే అనర్థదాయకం. అదే ఈ సంసారం.
×
అశరీర : శరీరం లేనిది. ఉన్నా దానితో సంసర్గం లేనిది. శరీరమే నేననే అభిమానం లేనిది. ఆత్మచైతన్యం. అది అశరీరం. మోక్షమని అర్థం. జీవన్ముక్తుడు కూడా శరీరాన్ని తానుగా భావించడు. గనుక వాడూ అశరీరుడే. ముక్తుడే.
×
అశుద్ధ : శుద్ధం కానిది. మలినమైనదని అర్థం. ఉపాధులే అశుద్ధి. గుణాలే అశుద్ధి. ఇలాటి ఉపాధులు లేని నిర్గుణమాత్మతత్త్వం. అదే శుద్ధం. గుణాత్మకమైన ఈ ప్రపంచమంతా అశుద్ధమే.
×
అశాంత : ఏ వికల్పాలు ఉన్నా ఆ మనస్సు శాంతమైనది కాదు. ఆయా వృత్తులు లేనప్పుడే శాంతం. వృత్తులు పోయినా వాసనలుంటాయి సుషుప్తిలో. అవికూడా పోనంతవరకూ సాధకుడి మనస్సు అశాంతమే.
×
అశోచ్య : ఆత్మరూపంగా చూస్తే ప్రపంచంలో ఏదీ శోచ్యంకాదు. అంటే శోకించవలసిన పనిలేదు. అంతా అశోచ్యమే.
×
అష్టమూర్తి : ఎనిమిది మూర్తులు లేదా రూపాలు ధరించిన వాడని అర్థం. దక్షిణామూర్తి అయిన పరమాత్మ కష్టమూర్తి అని పేరు. ఆ ఎనిమిదీ పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ప్రపంచమంతా అష్టమూర్త్త్యాత్మకమే. ఈ మూర్తులు ప్రపంచానివి కావు. పరమాత్మవి. అమూర్తమైన పరతత్త్వమే మూర్తమై ప్రపంచంగా భాసిస్తున్నదని గదా సిద్ధాంతం.
×
అష్టాంగయోగ : ఎనిమిది అంగములతో, భూమికలతో కూడిన సమాధి యోగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన, సమాధులు. ఈ ఎనిమిదింటికీ అష్టాంగములని పేరు. ఇందులో మొదటి ఐదు బహిరంగ యోగం. మిగతా మూడు అంతరంగ యోగమని పతంజలి చెప్పినమాట.
×
అసంశయ : సందేహం లేనిది. నిశ్చయం. శ్రవణానంతరం ఆత్మవిషయంలో దానికీ ప్రపంచానికీ సంబంధమేమిటని ఎన్నో సందేహాలు ఏర్పడవచ్చు. మననంతో అవి నివృత్తి కావలసి ఉంది. తరువాతనే నిశ్చయాత్మకమైన జ్ఞానం కలుగుతుంది. Conviction. అప్పటికీ మరణ సమయంలో తరువాత ఏమై పోతామో అనే సందేహం ఏర్పడవచ్చు. అదికూడా అక్కర లేదన్నాడు గీతాచార్యుడు. మరుజన్మలో ఈ కృషి తప్పక ఫలిస్తుందని హామీ ఇచ్చారు. కనుక సాధన మార్గంలో సంశయం గర్భశత్రువు. అది ఆత్మజ్ఞానంతోనే సమసిపోవాలి. 'ఛిద్యంతే సర్వసంశయాః' అన్ని సంశయాలూ అసంశయమైన జ్ఞానంగా అనుభవానికి వస్తాయి.
×
అసంసారి : త్రిగుణాత్మకమైన సంసారంతో సంబంధంలేని సిద్ధపురుషుడు లేదా జీవన్ముక్తుడు. పరమాత్మ నిత్య ముక్తుడు కనుక ఎప్పుడూ సంసారం లేదాయనకు. అసంసారియే.
×
అసక్త : సంసార బంధంలో సక్తుడు గానివాడు. చిక్కుపడని వాడు Tached person Liberated soul.
×
అసంగత : సంగతం కానిది. సంబంధం లేనిది. Unconnected. హేతువుకు నిలవనిది. Incoherent.
×
అసంహత : సంహతం గానిది. సంహతమంటే పోగైన పదార్థం. పోగైతే దానికి నామరూపాలేర్పడతాయి. పోగు కాకపోతే అది నిరాకారం. Unconstituted. కేవల చైతన్య స్వరూపం. అదే ఆత్మ. పోతే అది కాని అనాత్మ ప్రపంచమంతా సంహతమే. Formed సంహతమెప్పుడూ అసంహతం కోసమే Unformed ఉంటుంది. దానినే మనకు సూచిస్తుంటుంది.Indicator. అందుకే అన్మాత ద్వారా ఆత్మను పట్టుకోవాలని చెప్పటం.
×
అసత్/అసత్య : సత్అంటే ఉన్నది. అసత్అంటే లేనిది. అసత్యమన్నా ఇదే అర్థం. ఆత్మ సత్యమైన పదార్థం. Real. ఎందుకంటే అది స్వతః ప్రమాణం. మిగతా ప్రపంచమంతా, తద్రూపమంతా తద్రూపంగా చూస్తే సత్యం. చూడకపోతే అసత్యం. Unreal.
×
అసంభవ : ఏది ప్రమాణానికి నిలుస్తుందో అది సంభవం. Possible. ఏది నిలవదో అది అసంభవం. Impossible. Untenable.
×
అసంభావనా : సంభవం కాదేమోనని సందేహించటం. అభావనా, అసంభావనా, విపరీతభావనా అని మూడున్నాయి భావనలు. అందులో రెండవది. అసలు గుర్తించకపోవటం మొదటిది. గుర్తించినా నిలుస్తుందా లేదా అని సందేహించటం రెండవది. అది ఒకలాగా ఉంటే మరొకలాగా చూడటం మూడవది. ఆత్మ విషయంలో ఇవి మూడూ కలుగుతాయి మానవుడికి. మూడింటికీ శ్రవణ, మనన, నిది, ధ్యాసలనేవి క్రమంగా పరిష్కారాలు.
×
అసాధారణ : ఒకే లక్షణం రెండింటికీ వర్తిస్తే అది సాధారణం. Common అలా వర్తించక దేనిపాటికది అయితే అసాధారణం. చైతన్య మాత్మకు అసాధారణం. Unique అది అనాత్మకు లేదు. అనాత్మకు నామరూపాలు అసాధారణం. అవి చైతన్యానికి లేవు.
×
అసిద్ధ : ఏదో ఒక ప్రమాణానికి విషయమైతే అది సిద్ధం. ఏ ప్రమాణానికీ గోచరించకపోతే అసిద్ధం Untenable.
×
అస్తి : ఉన్నది అని అర్థం. అస్తి భాతి అనేవి రెండూ ఆత్మ లక్షణాలు. అది ఉన్నది ఉన్నట్టు స్ఫురిస్తున్నదని అర్థం. ప్రతి ఒక్కటీ లోకంలో ఉందంటాము. ఉందని భావిస్తాము. అంచేత అస్తి భాతి అవి రెండూ సర్వవ్యాపకాలు. అవే ఆత్మస్వరూపం.
×
అస్తిత్వ : ఉనికి. ఉండటం. Existance. Presence.
×
అస్థాన : స్థానం కానిది. Out of place. సందర్భం లేనిది Out of context.
×
అస్పర్శయోగ : దేనితోనూ స్పర్శ అనగా సంబంధం లేనిది. ఆత్మస్వరూపం. దాన్ని గూర్చిన అనుసంధానం అస్పర్శయోగం. మామూలు పాతంజల యోగం లాంటిది కాదిది. ఇందులో ధ్యాత ధ్యేయం ధ్యానమనే త్రిపుటి లేదు. మూడూ కలిసి ఆత్మ స్వరూపమే. కనుక ఏదీ దానినంటదు. అది అస్పర్శమే.
×
అస్మితా : దేహాదులను నేను అని ఉపాధులతో తాదాత్మ్యం చెందటం. పతంజలి చెప్పిన ఐదు క్లేశాలలో ఇది రెండవది. అవిద్యా, అస్మితా, రాగ, ద్వేష, అభినివేశాలని అవి ఐదు. ఒకదానికొకటి హేతు హేతుమద్భావం చెంది ఇవి ఐదూ మానవుణ్ణి కట్టివేసే పాశాలై కూచున్నాయి.
×
అస్మత్ప్రత్యయ : నేను అనే ప్రజ్ఞ. భావన. చిత్తవృత్తి Idea of myself. ఆత్మ ఎప్పుడూ ఇలాంటి ప్రత్యయానికే గోచరిస్తుంది. ఆత్మాకార వృత్తియని దీనికి నామాంతరం.
×
అస్వస్థ : 'స్వస్మిన్తిష్ఠతి ఇతి స్వస్థః' తనలో తాను నిలకడగా ఉంటే స్వస్థ. Self contained. అలా కాకుంటే అస్వస్థ. మనం మన ఆత్మస్వరూపంలోనే లేమిప్పుడు. అనాత్మ జగత్తులో తొంగిచూచి అదే నేనని ఎక్కడికక్కడ తాదాత్మ్యం Identity చెందుతున్నాము కనుక అందరమూ అస్వస్థులమే. మనకున్న ఈ అభిమానమే అస్వస్థత.
×
అసుర సంపత్: సాధకునికి పనికిరాని గుణాలివి. సాధన మార్గంలో అసుర సంపద మనకడ్డు తగులుతుంది. అనాత్మ తాలూకు గుణాలే అసుర గుణాలు. అవి ఎంత పోగైనా మర్గానికి అంతరాయమే. దీనికి బదులు దైవ సంపద పోగు చేసుకుంటే ముందుకు సాగిపోగలం.
×
అసుర్య : అసురలకు సంబంధించిన అంధకార బంధురమైన లోకాలు ఇవి. ఆత్మ జ్ఞానం లేని కర్మిష్ఠులు, పామరులు చివరకు పోయి చేరే స్థానాలని ఈశావాస్యం చెప్పిన మాట.
×
అహమ్/అహంకార : అహమంటే నేను అని శబ్దార్థం. అలా భావించటమే అహంకారం. నావి అనే దేహాది ఉపాధులతో కలవకుండా భావించగలిగితే ఇది ఆత్మస్వరూపమే. అలాకాక సోపాధికమైతే ఇదే అనాత్మలాగా మారిపోతుంది. కర్తృరూపమైనది అహంకారమైతే సాక్షిరూపమైన చైతన్యమాత్మ. అహంకారానికే కర్తాత్మ అని పేరుపెట్టారు వేదాంతులు. ఇది చిదాభాసుడే గాని కేవల చిద్రూపం కాదు. అంటే జీవుడని అర్థం. ఇలాంటి జీవుడే అసలైన ఆత్మ అని భ్రమించారు పూర్వమీమాంసకులు.
×
అహంబ్రహ్మాస్మి : ఇది నాలుగు మహావాక్యాలలో చివరిది. తత్త్వమసి ఉపదేశ వాక్యమైతే ఇది అనుభవ వాక్యం. ఈ జీవుడే బ్రహ్మమని దీని అర్థం. జీవుడు బ్రహ్మమైతే బ్రహ్మానికున్న పరిపూర్ణత వీడి కేర్పడుతుంది. అలాగే మరలా బ్రహ్మ అహమస్మి అని అర్థం చెప్పుకోవలసి ఉంది. దీనికి వ్యతిహారమని పేరు. అలా చెప్పుకుంటే జీవునికున్న అపరోక్షత్వం బ్రహ్మానికి సంక్రమిస్తుంది. అప్పుడు పరిపూర్ణ అపరోక్ష బ్రహ్మాత్మానుభవం ఏర్పడుతుంది సాధకుడికి.
×
అహంగ్రహోపాసన : గ్రహమంటే పట్టుకోవటం. బ్రహ్మస్వరూపాన్ని సత్యజ్ఞాన ఆనందాలనే గుణాలతో చేర్చి అదే నేనని ధ్యానిస్తూ పోవటానికే అహంగ్రహోపాసన అని పేరు.
×
అహినిర్ల్వయనీ : అహి అంటే సర్పం. నిర్ల్వయనీ అంటే కుబుసం. పాము కుబుసం విడిచిన తరువాత అది తానుగా భావించదు. అలాగే కుబుసం లాంటి శరీరమనే ఉపాధిని దూరం చేసుకొని దాన్ని తన స్వరూపంగా భావించడు జీవన్ముక్తుడు. కనిపిస్తున్నా అది తన ఆభాసే గాని తన స్వరూపం కాదతనికి. ఇది దీని అంతరార్థం.
×
అహేయ : హేయం కానిది. వదలుకో లేనిది. ఆత్మతత్త్వం. అది మన స్వరూపమే కనుక వదలుకున్నా వదలిపోయే ప్రశ్నలేదు.
×
అహైతుక : ఏ హేతువూ లేనిది. ప్రపంచానికి పరమాత్మగానీ మరొకటిగానీ కారణం గాదని వాదిస్తారు నాస్తికులు. వారి దృష్టిలో కనిపించే కార్యం తప్ప మూలకారణం లేదు. కనుకనే వారి వాదానికి అహైతుకమని పేరు వచ్చింది.
×
అక్ష : ఇంద్రియం. Organs. చక్షురాదులైన జ్ఞానేంద్రియాలైనా కావచ్చు పాణిపాదాదులైన కర్మేంద్రియాలైనా కావచ్చు.
అక్షిపురుష విద్యా : విద్య అంటే ఇక్కడ ఉపాసన. ఉపనిషత్తులలో ఇలాంటి విద్యలు ఎన్నో వస్తాయి. అందులో ఇది ఒకటి. మానవుడి దక్షిణాక్షిలో పరమాత్మ చైతన్యం బాగా అభివ్యక్తమై కనిపిస్తుందట. ఆ ఉపాధిలో తన స్వరూపాన్ని దర్శిస్తూ తదాకారమైన చిత్తవృత్తితో ధ్యానిస్తూ పోతే తదనుగుణమైన ఫలితం సాధకుడికి లభిస్తుంది. దీనికి అక్షిపురుష విద్య అని పేరు.
×
అంక : గుర్తు. చిహ్నం. ముద్ర. ప్రాపంచికమైన వాసనలన్నీ అంకములే. సుషుప్తిలో కూడా ఇలాంటి వాసనాంకితమైన మనస్సుతోనే జీవుడు పరమాత్మతో ఏకమవుతున్నాడు. కనుకనే మరలా ఆ వాసనలతోనే తిరిగి వస్తున్నాడు. సుషుప్తిలో ఎలాగో రేపు మరణంలో కూడా ఈ వాసనాంకితమైన మనసు తొలగిపోదు. ఆత్మజ్ఞాన ముదయించినప్పుడే దాని నివృత్తి.
×
అంగ : శరీరం. అవయవం. సమష్టిలో ఒక భాగం. వ్యష్టి Part.
×
అంగిరస్: అంగములన్నింటి తాలూకు రసం. సారభూతమైనది. ప్రాణశక్తి అని అర్థం.
×
అంగాంగిభావ : సమష్టికి వ్యష్టికి ఉన్న పరస్పర సంబంధం Inter relation between whole and its parts. ప్రధాన మంగి అయితే అప్రధానం దానికంగం.
×
అంజన : అంటటం. ఏదీ అంటనిదైతే అది నిరంజన. ఆత్మ స్వరూపమని అర్థం.
×
అండ : గ్రుడ్డు. Oval shape. గ్రుడ్డులాంటివి మూడున్నాయి. ఒకటి పిండాండం. ఈ శరీరం. రెండు అండాండం. దీనిచుట్టూ ఉన్న భూగోళం లాంటిది. మూడు బ్రహ్మాండం Macro cosm. ఆకాశం అని అర్థం. ఇవి మూడే చైతన్యానికి ఉపాధులు. Covers. వీటికి లోబడ్డవాడు జీవుడు. పైబడ్డవాడు ఈశ్వరుడు.
×
అండజ : గ్రుడ్డు నుంచి జన్మించేవి - పక్షులు, సరీసృపాలు.
×
అంత : కొస, హద్దు Limit. End. విజాతీయ భావమెక్కడ ఏర్పడుతుందో అది సజాతీయాని కంతం. సజాతీయ విజాతీయాలు రెండూ లేని దాత్మతత్త్వం. కనుక అది ఎప్పుడూ అనంతమే.
×
అంతర/అంతరా : లోపల అని అర్థం. Interior. ఎడమని కూడా అర్థమే. 'తే యదంతరా తద్బ్రహ్మ.'
అంతరంగ : మనస్సని ఒక అర్థం. మనలోపల మాత్రమే చేసే సాధన కూడా అంతరంగమే. దీనికి బాహ్యంగా జరిగేది బహిరంగ సాధన.
×
అంతరిత : ఒక భావానికి మరొకటి అడ్డు తగిలితే అది మరుగు పడటం. విజాతీయ వృత్తులు మనసులో ప్రవేశిస్తే సజాతీయమైన బ్రహ్మాకార వృత్తి దానిచేత అంతరితమవుతుంది. Eclipsed.
×
అంతర్యామి : పిండాండంలోనూ, బ్రహ్మాండంలోనూ సర్వత్రా ప్రవేశించి లోపల చోటు చేసుకుని వాటిని అన్నింటిని తన అదుపులో పెట్టుకునే ఈశ్వర చైతన్యం. 'యః పృథివ్యాం తిష్ఠన్' అని ఇలా ఎంతో దూరం వర్ణించింది బృహదారణ్యకం. దానికి అంతర్యామి బ్రాహ్మణమని పేరు. The inner controller of all the material world including our bodies and minds. ఈశ్వరుడే అంతర్యామి అంటే.
×
అంత్యం ప్రమాణం : చివరి ప్రమాణం. Final Proof. బ్రహ్మాకార వృత్తి. దానికి బాధకమైన వృత్తి మరొకటి లేదు గనుక అది అంత్యమైనది.
×
అంతకాల : అవసాన సమయం. ఆ లోపలే మానవుడు జ్ఞానసాధనకు ఉపక్రమించాలి. ఆ సమయంలో కృషి చేసే అవకాశం లేదు. అంతకు ముందు నుంచి చేసిన సాధన అప్పుడే పరిపాకానికి వస్తుంది. 'అంతకాలేపి మామేవ స్మరన్' అని గీతా వచనం.
×
అంతేవాసి : దగ్గర కూర్చునే వాడని అర్థం. శిష్యులు పూర్వం అరణ్యాలలో ఆచార్యుల దగ్గరగా కూర్చుని బ్రహ్మవిద్యను అభ్యసించేవారట. ఉపనిషత్తనే మాట అలాగే ఏర్పడింది. అతిరహస్యం గనుక దగ్గర కూర్చుని గ్రహించవలసిన కర్తవ్యముంది. అంతేవాసి అంటే అలాంటి రహస్యోపదేశం అందుకునే శిష్య పరమాణువు.
×
అంధం తమః : కటిక చీకటి అని అర్థం. అలాంటి రౌరవాది నరక లోకాలకు అంధం తమః అని నామకరణం. అజ్ఞానమే నరకమని లక్ష్యార్థం.
×
అంధ పరంపరాన్యాయ : ఒక గ్రుడ్డివాడిని పట్టుకుని మరొక గ్రుడ్డివాడు ప్రయాణం చేయటం. అలాచేస్తే ఎవడికీ దారి కనపడక ఇద్దరూ నూతిలోనో, గోతిలోనో పడతారు గాని గమ్యం చేరలేరు. కనుక జీవిత గమ్యం చేర్చలేని వితండ వాదాల కన్నిటికీ ఈ సామెత వర్తిస్తుంది.
×
అంధగజ దృష్టాంత : గ్రుడ్డివాళ్ళు ఏనుగును చూచి వచ్చిన వ్యవహారం. ఎక్కడికక్కడే చూచి అది గజమని భావించినట్టే పరమాత్మను నామరూపాల పరిధికి దించి ఎక్కడికక్కడే పరిమితం చేసి చూచే దృష్టి ఇలాంటిదని, అది సమగ్రం కాదని అద్వైతుల వేళాకోళం.
×
అంశ : భాగం. తునక అని అర్థం. 'మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః' అని గీత. పరమాత్మ అంశమే జీవాత్మ. ఇది వాస్తవమైన భాగమని ద్వైతులు. వాస్తవం కాదు ఆభాస అని అద్వైతులు అంటారు.
×
అంశాంశిభావ : అంశానికి అంశికి ఉన్న సంబంధం. జీవజగత్తులు అంశమని ఈశ్వరుడు అంశి అని వైష్ణవుల సిద్ధాంతం. ఇది మాయామయమని అద్వైతుల రాద్ధాంతం.