×
యజన/యజ్ఞ/యజమాన : అర్చించటం. భజించటం. పూజించటం. Worship యజనం చేసే క్రియ యజ్ఞం. Sacrifice. అనుష్ఠానం. యజనం చేసేవాడు కర్మిష్ఠుడైన గృహస్థుడు. వాడే యజమానుడు. కర్త. అతడు చేసే యజ్ఞం నాలుగు విధాలు. విధి, జప, ఉపాంశు, మానస. మొదటిది కాయికం. రెండు మూడు వాచికం. నాలుగు మానసికం. మొదటి మూడు బహిర్యాగమైతే నాలుగవది అంతర్యాగం. అదే జ్ఞానయజ్ఞం Spiritual sacrifice. యజ్ఞమంటే ఈశ్వరుడని కూడా అర్థం. 'యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర' ప్రతికర్మా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని భావం. ఇవిగాక మామూలుగా గృహస్థుడైన వాడు చేసే యజ్ఞాలు అయిదు ఉన్నాయి. దేవయజ్ఞం. దేవతల కోసం యజ్ఞయాగాదులు, పితృదేవతల కోసం శ్రాద్ధతర్పణాదులు. ఋషులకోసం వేదాధ్యయనాదులు. మనుష్యులకోసం అతిథి సంతర్పణాదులు. భూతములకోసం ధాన్య కణాదులు చల్లటం మొదలగునవి. ఇవి నిత్యమూ చేస్తూ పోవాలి ప్రతిగృహస్థుడు అని ధర్మశాస్త్ర శాసనం. ఇంతేగాక మనోవాక్కాయలతో ప్రతిక్షణమూ మనం సాగించే కర్మకలాపమంతా యజ్ఞమేనని ఒకమాట ఉంది. దీనికి నిలయం మన శరీరమే. ఇది నిత్యమూ చేస్తున్న జీవుడే ఇందులో యజమానుడు. ఇది సక్రమంగా సాగిస్తే సత్ఫలితం. అక్రమంగానైతే దుష్ఫలితం చవిచూడవలసి ఉంటుంది. ఇహంలో తప్పినా పరంలో తప్పదు అలాంటి అనుభవం.