×
ప్రకృతి : 'ప్రకర్షేణ కరోతీతి ప్రకృతిః' బాహుళ్యంగా చేస్తూ పోయేది. ఈశ్వరుని మాయాశక్తికి ప్రకృతి అని, మాయ అని, అవ్యాకృతమని, అక్షరమని పేరుపెట్టారు అద్వైతులు. ఇదే ఉపాదాన కారణం ప్రపంచానికి. ఇది ఈశ్వరుడికి ఎప్పుడూ అధీనమై ఉండాలిగాని స్వతంత్రంకాదు. కాగా సాంఖ్యులు దీని నంగీకరించరు. వారీ ప్రకృతిని ఈశ్వర శక్తి అని భావించరు. ఇది తనపాటికి తానే ప్రపంచసృష్టి చేస్తున్నదని వాదిస్తారు. దీనికి వారు ప్రధానమని పేరుపెట్టారు. కనుకనే వారికి ప్రధాన కారణవాదులని నామధేయం. ప్రకృతి అంటే మరొక అర్థముంది. పూర్వ జన్మలలో చేసుకొన్న కర్మ జ్ఞాన సంస్కారం వర్తమాన జన్మలో ప్రకటమై ఫలితానికి వస్తే దానికి కూడా ప్రకృతి అని పేరు. 'ప్రకృతిం యాంతి భూతాని' అని గీతా వచనం. ప్రకృతి అంటే అవిద్య అని కూడా అర్థమే. 'పురుషః ప్రకృతిస్థో హి' అని ప్రయోగం.