×
ప్రమ/ప్రమాతా/ప్రమాణ/ప్రమేయ/ప్రమితి : ప్రమ అంటే జ్ఞానం. ఆత్మజ్ఞాన మని ఇక్కడ అర్థం. అది కలవాడు ప్రమాత. దానికి సాధనం ప్రమాణం. దానిద్వారా అందుకొనే పదార్థం ప్రమేయం. దానివల్ల కలిగే ఫలం ప్రమితి. వీటినే రకరకాలుగా వ్యవహరిస్తారు వేదాంతంలో. జ్ఞానం, జ్ఞాతా, జ్ఞాన సాధనం, జ్ఞేయం జ్ఞప్తి అని కూడా వీటినే పేర్కొనవచ్చు. ఇది లోకంలోనూ శాస్త్రంలోనూ తప్పనిసరిగా ఉండవలసిన నియమం. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే చేసుకునేవాడొకడు, చేసుకోబడేది ఒకటి, చేసుకునేందుకు తోడ్పడే సాధనమొకటి, చేసుకొంటే కలిగే ప్రయోజనమొకటి ఉండి తీరవలసిందే గదా. ఇది లోకంలో ఎలాగో వేదాంతంలో కూడా అలాగే ఆవశ్యకం. అక్కడ ప్రమాత జీవుడు. నీవూ నేనూ. ప్రమాణం మన ఇంద్రియాలు, మనస్సు. ప్రమేయం పరమాత్మ తత్త్వం. దాన్ని గ్రహిస్తే కలిగే అనుభవం ప్రమితి. వీటి పరస్పర సంబంధాన్ని చక్కగా భావన చేసి సాధన ఎడపడకుండా చేయగలిగితే తప్పకుండా సాధకుడు సిద్ధిని పొందగలడని శాస్త్రజ్ఞులు బోధిస్తారు. ఇందులో ఒక సూక్ష్మమేమంటే అద్వైతంలో ఈ నాలుగింటికీ భేదం లేదు. నాలుగూ కలిసి ఒకే ఒక ఆత్మతత్త్వమే. అదే వికల్పించి చూస్తే నాలుగు రూపాలలో భాసిస్తున్నది. విమర్శించి చూస్తే నాలుగూ ప్రమాత అయిన జీవుడి స్వరూపంగానే సాక్షాత్కరిస్తుంది. ఇదీ అద్వైత సిద్ధాంతం.