×
చలాచల : కదులుతూ ఆడుతూ ఉండే లక్షణం. మనస్సెప్పుడూ ఇలాంటిదే. సంకల్ప వికల్పాత్మకంగా ఎప్పుడూ ఇది చలిస్తూనే ఉంటుంది. సాధకుడైనవాడు దీనిని అదుపులో పెట్టుకోవాలి. యోగులైతే నిరోధించమని సలహా ఇస్తారు. జ్ఞానులు నిరోధం ఒప్పుకోరు. దానికి మారుగా సజాతీయమైన బ్రహ్మాకార వృత్తిని అనులోమంగా చూస్తూ పొమ్మంటారు. ఎప్పుడెప్పుడు మనస్సు చలిస్తుందో అప్పుడది ప్రారబ్ధమని భావించి మరలా తమ బ్రహ్మనిష్టలో తాము ఉండడమే జ్ఞాని చేయవలసిన పరిశ్రమ. గౌడపాదులవారు జీవన్ముక్తుడు కూడా చలాచల నికేతుడే కనుక చలించి నంత మాత్రాన బెదరిపోరాదు, అది ప్రారబ్ధ లక్షణమని భావించి మరలా అచలమైన ఆత్మను దర్శిస్తూ కూర్చోమని, అదే సాధన అని సలహా ఇచ్చారు.