×
కర్తా/కరణ/కర్మ/క్రియా : కర్త అంటే ఒక పని చేసేవాడు. జీవుడు. కరణమంటే వాడా పని చేయటానికి తోడ్పడే సాధనం. Instrument. లేదా పనిముట్టు. కర్మ. దాని ద్వారా వాడు చేసే పని. అదే క్రియ అన్నా అర్థం. The agent. The implement. The work. దానివల్ల ఏర్పడే ఫలితాన్ని అనుభవించేవాడు మరలా ఈ కర్తే కనుక జీవుడికి కర్త భోక్త అని పేరు వచ్చింది. చేసేటపుడు కర్త. అనుభవించేటప్పుడు భోక్త. కరణానికే ఇంద్రియమని పేరు. అది బాహ్యమైతే చక్షురాదులు, వాగాదులు. అభ్యంతరమైతే ప్రాణం, మనస్సు, మనోవాక్కాయాలు మూడింటికీ త్రికరణాలని పేరు. వీటివల్ల సాగించే కర్మ మూడు విధాలు. ప్రారబ్ధం ఆగామి సంచితం. వర్తమానంలో అనుభవించేది ప్రారబ్ధం. భవిష్యత్తులో అనుభవించబోయేది ఆగామి. అనుభవానికింకా రాక భూతకాలానికి సంబంధించి పోగయిన కర్మ సంచితం. ఇంతేగాక కర్మ అనేది మరోవిధంగా చూస్తే రెండు వర్గాలుగా మనం దాన్ని విభజించవచ్చు. శాస్త్రం విధించిన కర్మ ఒకటి. లౌకికంగా మనం ప్రతిదినమూ మన ఇష్టానుసారంగా చేస్తూ పోయే కర్మ ఒకటి. ఇది లౌకిక కర్మ అయితే అది శాస్త్రీయ కర్మ. లౌకిక కర్మ ప్రియమే గానీ మనకు హితం కాకపోవచ్చు. అదే శాస్త్రీయంగా ఆచరిస్తే ప్రియమూ, హితమూ రెండూ అవుతుంది. శాస్త్రీయ కర్మలు విధులు కావచ్చు, నిషేధాలు కావచ్చు. ఇందులో నిషేధాలను నిర్మొహమాటంగా వదిలేయాలి. విధులలో నిత్యనైమిత్తికాలను విధిగా ఆచరించాలి. కామ్యాలను కోరికలుంటే ఆచరించటం లేకుంటే మానేసినా ప్రమాదం లేదు. నిత్యనైమిత్తికాలను మానేస్తే ప్రత్యవాయమనే దోషం వచ్చిపడుతుంది.