గణ : గుంపు. సమూహం. నామరూపాలు. సంసారం. దీనికి పతి గణపతి. జీవుడని అర్థం. ప్రమథ గణాలంటే వీడిచుట్టూ ఉన్న పాంచభౌతిక పదార్థాలు. నామరూపాలే అవి. మానవుణ్ణి బాగా మథించేవి లేదా వేధించేవని భావం. ప్రకృతి గుణాలే గణాలు. సత్వరజ స్తమస్సులు.
×
గతి : గమనం. పోవటం. నడవటం. దశ State. అవస్థ. ఇంతేగాక జ్ఞానమని కూడా ఒక అర్థముంది. అనన్య ప్రోక్తే గతి రత్ర నాస్తి. ఇక్కడ అగతి అని విరిచి చెప్పారు. అగతి అంటే జ్ఞానం లేకపోవటం. సమర్థుడైనవాడు బోధిస్తే జ్ఞానం లేకుండా పోదని భావం. 'సాకాష్ఠా సా పరాగతిః.' అంటే అవగతియే గతి అని భాష్యంలో వర్ణించారు. అవగతి అంటే జ్ఞానమే. అద్వైతంలో జ్ఞానమే అనుభవం.
×
గత : గడచిపోయిన కాలం. విషయం. Past.
×
గతాగత : గడచిపోయినది. గడవబోయేది. Past and Future. అవేవో గావు జనన మరణాలు. దీనివల్లనే సంసారయాత్ర నిరంతరం సాగిపోతుంటుంది. అంతేగాక ఎప్పుడూ రాకపోకలు సాగించటం కూడా గతాగతమే.
×
గతానుగత : ఒకడు పోయిన మార్గంలోనే మరొకడు వెళుతూ ఉండడం. 'గతానుగతికో లోకః.' లోకమంతా గొర్రెదాటుగా ముందుగా సాగిపోతూ ఉంటుందని ఒక లోకోక్తి. ఎవరికీ విచారణ లేకుండా గ్రుడ్డిగా వెళ్ళిపోతున్నారని భావం.
×
గత్యంతర : ప్రస్తుతం మనకున్న మార్గంతప్ప మరొక మార్గమేదైనా ఉంటే అది గత్యంతరం. Another way.
×
గంతా/గంతవ్య/గమ్య : ఒక గమ్యంవైపు ప్రయాణం చేసేవాడు లేదా సాధకుడు గంత. అతడు ప్రయాణించి అందుకొనే స్థానం గమ్యం లేదా గంతవ్యం. Destination. ఆధ్యాత్మ మార్గంలో సాధకుడని సాధనమని వాడికి లభించే సిద్ధి అని అర్థం చేసుకోవలసి ఉంటుంది.
×
గమ/గమనం
×
గమక
×
గంధ
×
గర్భ : ఉదరం. లోపలి భాగం. హిరణ్యగర్భ. హిరణ్యమంటే స్వయం ప్రకాశమైన ఆత్మచైతన్యం. అది తనలో గుప్తంగా ఉన్నవాడు హిరణ్యగర్భుడు. జీవుడు. సమష్టి జీవుడు. బ్రహ్మదేవుడు.
×
గర్వ : మనోబుద్ధి చిత్తాహంకారాలు. ఈ నాలుగింటికీ అంతఃకరణ చతుష్టయమని పేరు. ఇందులో సంకల్ప వికల్పాలు మనస్సుకు. నిశ్చయం బుద్ధికి. సంవేదనం చిత్తానికి. గర్వం అహంకారానికి లక్షణాలట. గర్వమంటే నేను అని తన స్థితిని తాను బలపరుచుకుంటూ చెప్పే వ్యవహారం selfdom.
×
గహన : విషమం. అర్థం కానిది. అంతుపట్టనిది. సంసారమని లాక్షణికార్థం.
×
గహ్వర : బాగా లోతైనది. Deep. Unfathomable. గంభీరమైనది. మానవ హృదయం. సంసారం.
×
గాఢ : మునిగిపోయినది అని అక్షరార్థం. బాగా లోతుకుదిగి తీవ్రంగా కృషిచేసి పట్టుకొన్నది కూడా. సంసారంతో గాఢమైన బంధం ఏర్పడిందంటే అలాగ స్థిరపడిన బంధమని అర్థం.
×
గాత్ర : శరీరం. Body.
×
గాణపత్య : గణపతిని దేవతగా ఆరాధించే మతం. షణ్మతాలలో ఇది ఒక మతం. భగవంతుడి షాడ్గుణ్యంలో బలమనే గుణాన్ని ప్రధానంగా తీసుకుని ఆవిర్భవించిన మతమిది. వీరు గణపతి ఉపాసకులు. గాణపత్యమని కూడా ఈ మతానికి మరొకపేరు.
×
గాథా : గానం చేయబడినది. శ్లోకమని అర్థం.
×
గాయత్రీ : 'గాయంతం త్రాయతే ఇతి.' గానం చేసే వాడిని కాపాడేది గాయత్రీ మంత్రం. ఇది ఒక ఛందస్సు. Metre. ఆ ఛందస్సులో బంధించిన మంత్రమిది. కనుక మంత్రానికి ఆ పేరు వచ్చింది. 24 అక్షరాల మంత్రమిది. విశ్వామిత్రుడు దీనికి ద్రష్ట. బ్రహ్మవిద్యకిది ఆలంబనం. పరమాత్మ దీనికి స్వరూపం. సాయుజ్యంలోనే దీనికి వినియోగం. సవిత నుపాసిస్తున్నట్టు పైకి కనిపించినా ఆ సవిత ఎవరో కాదు స్వప్రకాశ శీలుడైన పరమాత్మే.
×
గార్హపత్య : గృహపతి అంటే గృహస్థుడు. యజమానుడు. House holder. వాడికి సంబంధించినది గార్హపత్యం. గృహస్థాశ్రమమని అర్థం. నాలుగు ఆశ్రమాలలో ఇది రెండవది.
×
గార్హపత్యాగ్ని : ఇక్కడ గృహమంటే శరీరం. దీనిని పాతి కాపాడేది గృహపతి. శరీరంలో ఉన్న జఠరాగ్ని. అదే మన ఆరోగ్యాన్ని చక్కగా నిలబెడుతున్నది. ఆకలి లేకుంటే ఆహారం రుచించదు. ఆహారం లేకుంటే బ్రతుకులేదు. ఈ గృహపతికే గార్హపత్యమని పేరు. ఇది ఉష్ణగుణంతో కూడినది గనుక అగ్నిలాంటిది. Appetite.
×
గార్హస్థ్య : గృహస్థాశ్రమం. గృహంలో అంటే శరీరంలో, స్థ అంటే ఉన్నవాడు జీవుడు. వీడి భావం గార్హస్థ్యం అని లాక్షణికమైన అర్థం.
×
గార్గీ : బృహదారణ్యకంలో వస్తుందీ పాత్ర. ఈవిడ గర్గ గోత్రంలో జన్మించినది గనుక ఈ పేరు వచ్చింది. ఒక గొప్ప బ్రహ్మవాదిని. యాజ్ఞవల్క్యునితో చాలాదూరం వాదించిన వ్యక్తి. ఆయన మహత్వాన్ని తాను అర్థం చేసుకొని పదిమందికీ చాటిన మహనీయురాలు.
×
గీతా : గానం చేయబడినది. భగవద్గీత అని కూడా అర్థమే. భగవంతుడైన కృష్ణపరమాత్మచే గానం చేయబడినది గనుక దానికా పేరు సార్థకమైనది.
×
గీతి : ఋగ్వేదం మంత్ర ప్రధానమైతే, యజుర్వేదం వచన రూపమైతే, సామం గీతి ప్రధానమైనది. గీతి అంటే గానం. సామగానమనే మాట ప్రసిద్ధమే గదా. అదే సంగీతానికంతటికీ మూలమంటారు.
×
గుణ : ద్రవ్యం తాలూకు ధర్మం. Quality. Property of a substance. పృథివికి గంధమనేది గుణం. సత్వ రజ స్తమస్సులనే ప్రకృతి గుణాలు కూడా కావచ్చు. నామరూప క్రియలు కూడా ఆ మాటకు వస్తే గుణాలే. వీటితో కలిసినదైతే ఆత్మ సగుణం. కలవనిదైతే నిర్గుణం. ఇందులో నిర్గుణం స్వరూపమైతే సగుణం విభూతి. గుణమంటే అప్రధానమైనదని కూడా Secondary ఒక అర్థముంది. ప్రధానమైతే ముఖ్యమని అప్రధానమైతే గుణమని పేర్కొంటారు శాస్త్రంలో.
×
గుప్త : దాచబడినది. గోప్యమైనది. రహస్యం Secret. ఆత్మస్వరూపం ఇలాంటిదే. దాన్ని ప్రకటన చేసుకోవలసిన బాధ్యత ప్రతి మానవుడికీ ఉంది. అప్పుడే జీవిత సమస్యకు పరిష్కారం చేసుకోగలడు.
×
గురు : బరువైనది. పెద్దది. ఆచార్యుడని కూడా అర్థం. వేదం వేదాంతం రెండూ శిష్యులకు బోధించేవాడెవడో వాడు. Teacher. Preceptor.
×
గురూపదేశ : యోగ్యుడైన గురువు యోగ్యుడైన శిష్యుడికి చేసే బోధ. ముఖ్యంగా అన్నిటికన్నా రహస్యమైన బ్రహ్మతత్వాన్ని శిష్యుడి అనుభవానికి తెచ్చే ప్రబోధం. దీనికే సంప్రదాయమని, ఆగమమని పేరు Intuition.
×
గురుపరంపర : ఒక గురువు నుండి శిష్యుడు అతని నుండి ప్రశిష్యుడు ఇలాగ బ్రహ్మోపదేశం అందుకుంటూ వచ్చే మార్గానికి పరంపర అని పేరు. గురు వంశమని కూడా పేర్కొంటారు దీనిని Tradition. గురుశిష్య సంప్రదాయమని భావం.
×
గరిమా : గురుత్వం. గురుభావం. అణిమాది అష్టసిద్ధులలో ఒకటి. ఉన్నట్టుండి బరువెక్కిపోవటం.
×
గుహా : కొండ గుహ.Cave.. వస్తువును మరుగు పుచ్చేది. బుద్ధి. మానవుడి బుద్ధిలోనే పరమాత్మ మరుగుపడి ఉన్నాడు. గుహాహీతం. గుహలాంటి బుద్ధిలో గుప్తమై ఉన్నాడు అని ఉపనిషద్వచనం. అక్కడేగాని మరెక్కడా లేడని కాదు. సర్వత్రా ఉన్నా అద్దంలాంటి బుద్ధిలోనే ప్రకాశిస్తున్నదా తత్వం. దాన్ని పట్టుకోవటానికిది తోడ్పడే సాధనమనే దృష్టితో బుద్ధిలో ఆత్మతత్వముందని చెప్పవలసి వచ్చింది. బుద్ధే దాని కుపలబ్ధి ద్వారమని Medium. Gateway భావం.
×
గుహ్య : గుహలో ఉన్నది. గోప్యమైనది. రహస్యం. అన్నిటికన్నా రహస్యమైనది ఆత్మవిజ్ఞానం. 'గుహ్యం బ్రహ్మ సనాతనం' అని మాట. రాజవిద్యా రాజగుహ్యం అని గీతావచనం. The top secret అని అర్థం.
×
గృథ్/గర్థి : ఆశపడటం. ఆశ. కాంక్ష. ప్రాపంచిక వాంఛ. 'మాగృధః కస్య స్విత్ధనం.' నేవీదీ కోరనక్కరలేదు. కారణమేమంటే ఇదంతా నీ ధనమే. నీది నీవు కోరటమనేది అర్థం లేని మాట. ఆత్మకానిదేదీ లేదు గదా. అలాంటి భావనతో నీవీ ప్రపంచాన్ని చూస్తే నిత్యతృప్తుడవై జీవించగలవు అని ఈశావాస్యం లోకానికంతా చాటి చెప్పిన సత్యం.
×
గోచర : గో శబ్దానికి చాలా ఉన్నాయి అర్థాలు. వేదాంతానికి కావలసినవి ఒకటి ఇంద్రియం. గోచరమంటే ఇంద్రియాలకు స్ఫురించే శబ్దస్పర్శాదులు. జ్ఞానమని ఇంకొక అర్థం. గోచర అంటే జ్ఞానానికి విషయమయ్యేదంతా. అలా విషయం కాదు గనుకనే ఆత్మ అగోచరం.
×
గోచార : గో అంటే ఇక్కడ గ్రహమని అర్థం. గ్రహాలన్నింటి సంచారానికి గోచారమని సంజ్ఞ. ఇది జ్యోతిశ్శాస్త్ర విషయం. అదే మానవుడి జీవితాన్ని నడుపుతున్నదని వారి అభిప్రాయం. అజ్ఞానికైతే ఇది వాస్తవమే. జ్ఞాని విషయంలో ఏ గ్రహమూ పనిచేయదు. మీదు మిక్కిలి అతని మార్గానికి అది ఇంకా దోహదం చేస్తుందని శాస్త్రంలో ఉన్న విషయం.
×
గోపన/గోపాయన/గోప : కప్పి పుచ్చటం. దాచుకోవటం. నీవేదైనా అన్యంగా చూచినప్పుడే దానివల్ల నీవు భయపడవచ్చు. భయమేస్తేనే దాని నుంచి నిన్ను నీవు దాచుకోవాలని చూస్తావు. కాబట్టి జీవులందరూ గోపులు, గోపకులు. గోపాలురు. ఈశ్వరుణ్ణి వేరుగా పరోక్షంగా దర్శించి భయపడే స్వభావమున్నవారని భావం. కనుకనే ఈశ్వర భావానికి దూరమై పోతున్నారు మానవులు.
×
గౌణ : గుణాన్ని బట్టి వచ్చిందీమాట. సింహ గుణమైన క్రౌర్య శౌర్యాదులెవరిలో నైనా చూస్తే వాణ్ణి సింహమని పేర్కొంటాము. వాస్తవంలో వాడు సింహం కాడు. గుణసామ్యాన్ని బట్టి సింహత్వ మారోపించాము. ఇలా ముఖ్యార్థంలో కాక గౌణార్థంలో చెబితే అది గౌణం. Secondary. Metaphorical. బాహ్యమైన చరాచర పదార్థా లిలాంటివే మనకిప్పుడు. వీరు నావాళ్ళు, ఇవి నావని పేర్కొంటాము. నేననే ఆత్మకు వాటిని ముడిపెట్టి చూస్తున్నాము. దీనికే గౌణాత్మ అని పేరు వేదాంతంలో. మమకార మని దీనికి మారుపేరు. దీనికి భిన్నంగా శరీరమే నేనని భావిస్తే దానికి మిథ్యాత్మ అని పేరు.
×
గౌతమ : గో అంటే జ్ఞానం తమ అంటే జ్ఞానంలో నిష్ణాతుడని అర్థం. ఇలాంటి ఉత్తమ జ్ఞాని ఎవరో కాదు. న్యాయశాస్త్ర ప్రణేత అయిన ఆచార్యుడు. గౌతముని న్యాయదర్శనం షడ్దర్శనాలలో ప్రసిద్ధమైనది. ఇదే పూర్వమీమాంస ఉత్తరమీమాంస దర్శనాల కన్నింటికీ పునాది రాయి. న్యాయవిద్యా గంధం లేకపోతే ఎవరూ ఏ సిద్ధాంతమూ చేయలేరు. దానిని చక్కగా ప్రతిపాదించలేరు.
×
గౌరవ : గురుభావం. గురుత్వం. Reverence to elders. బరువు Weight. అంతేగాదు తేలికగా చెప్పవలసిన విషయం డొంక తిరుగుడుగా బయటపెడితే దానికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రక్రియా గౌరవం అని పేరు పెట్టారు శాస్త్రంలో.
×
గ్రంథి/గ్రంథ : గ్రథనమంటే కూర్చటం. Compilation. అలా కూర్చినదేదో అది గ్రంథం. ముడిపెట్టటమని కూడా అర్థమే. గ్రంథి అంటే ముడి. Knot. లాక్షణికంగా చెబితే హృదయంలో కలిగే సంశయ విపర్యయాది వాసనలు. జన్మజన్మలనుంచి పేరుకొని ఉన్న ఈ సంస్కారాలకే Impressions. Instincts. గ్రంథులని పేరు. 'భిద్యతే హృదయ గ్రంథిః.' అలాటివన్నీ సమూలంగా తొలగిపోతేనే కారణ శరీరం భంగమవుతుంది అంటే అజ్ఞానం నిర్మూలనమవుతుంది. అజ్ఞానం తొలగితేనే జ్ఞానప్రాప్తి.
×
గృహ/గృహపతి : గృహమంటే ఇల్లు. శరీరమే గృహమని వేదాంతుల మాట. గృహ్ణాతి ఇతి గృహం. ఏది మనలను పట్టుకొని కట్టిపడేస్తుందో అది. దీనిలో బందీ అయి జీవించేవాడే గృహపతి. వాడే జీవుడు.
గ్రస్త : గ్రసనమంటే మ్రింగటమని చెప్పాము. ఏది మ్రింగబడుతుందో అది గ్రస్తం. అభిమాన గ్రస్తం అంటే అభిమానం చేత కబళించబడ్డ వాడని అర్థం. ఎవడో కాడు ఈ జీవుడే.
×
గ్రహ/అతిగ్రహ : పట్టుకునేదని అర్థం. మన ఇంద్రియాలు గ్రహాలు. పోతే అవి పట్టుకునే శబ్ద స్పర్శాదులు అతిగ్రహాలు. రెండింటికున్న ఈ పరస్పర వ్యవహారం వల్లనే సంసార బంధం ఈ జీవుడికి.
×
గ్రాహక/గ్రాహ్య/గ్రహణ : గ్రహించేవాడు, గ్రహించబడేది, గ్రహించడం. ఇది ఒక త్రిపుటి. ఇందులో గ్రాహకుడంటే ప్రమాత. The knower. గ్రాహ్యమంటే ప్రమేయం. The known. గ్రహణమంటే ప్రమాణం. The act of knowing. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానాలని కూడా వీటికి మారుపేర్లు.
×
ఘట : కుండ. బాన.pot.ఘటించబడినది ఘటం. కూర్చబడినది. Composed అని అర్థం. లాక్షణికార్థంలో శరీరం కూడా ఘటమే. ఇదికూడా పంచభూతాలు పంచీకృతమై ఏర్పడినదే.
×
ఘటాకాశ : ఒక కుండలో ఉండే ఖాళీ. అది వాస్తవంలో మహాకాశమే. అయినా కుండ తయారయ్యేసరికి దానిలోనే పరిమితమై ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే చిదాకాశంలో ఈ శరీరం ఎప్పుడు సృష్టి అయిందో అప్పటినుంచి చైతన్యం ఈమేరకు ఉన్నట్టు భాసిస్తున్నది. ఇది చిదాభాసుడైన జీవుడు. దీనిని మించి సర్వత్రా వ్యాపించిన మహాకాశం లాంటివాడు ఈశ్వరుడు. రెండింటికీ తేడాలేదు. లేదని గుర్తించినప్పుడే ఈ జీవుడు ఆ ఈశ్వర భావం అందుకోగలడు. క్రొత్తగా అందుకొనే వ్యవహారం కూడా కాదు. అందుకో లేదనే అజ్ఞానాన్ని జ్ఞానంతో పోగొట్టుకొని ఆ రూపంగా నిలిచి ఉండడమే అందుకోటమనే మాటకు అర్థం.
×
ఘటనా/ఘటన : ఒకటి కుదర్చటం. కుదరకుండా చేయటం. రెండింటికీ సామర్థ్యముంటే అది ఘటనా ఘటన సామర్థ్యం. మాయాశక్తిని వశంలో ఉంచుకున్న ఈశ్వరుడే ఘటనా ఘటన సమర్థుడు. సృష్టించగలడు. సంహరించగలడు అని తాత్పర్యం.
×
ఘన : గొప్పది. పెద్దది. Big.దట్టమైనది. Dense. విజాతీయమైన అంశం ఏ మాత్రమూ లేక సజాతీయ భావంతోనే నిండిపోయిన పదార్థం. సువర్ణ ఘన. బంగారు కడ్డీ. అయోఘన ఇనుప కడ్డీ. అన్నప్పుడు వాటిలో బంగారం ఇనుము తప్ప మరొక లోహం లేనేలేదని అర్థం. అలాగే ఆత్మకు ప్రజ్ఞాన ఘనమని పేరు ఉన్నది. ప్రజ్ఞానం తప్ప ప్రజ్ఞేయమైన ప్రపంచ వాసనకు దేనికీ అందులో చోటులేదని కేవల చైతన్య స్వరూపమేనని తాత్పర్యం. Pure Consciousness.
×
ఘృణా : కరుణ. జాలి. జుగుప్స. అలాటి కారుణ్య మేమాత్రమూ లేకుంటే దానికి నిర్ఘృణ అని పేరు. దాని భావమే నైర్ఘృణ్యం. ప్రపంచాన్ని ఇంత విషమంగా సృష్టించాడా ఈశ్వరుడంటే ఆయనకు నైర్ఘృణ్య దోషమంటదా అని ప్రశ్న వచ్చింది వేదాంత శాస్త్రంలో. ఇది కేవలం మానవుడి దృష్టిదోషం వల్లనే కనపడుతూ ఉంది కాని అసలు సృష్టి అనేది ఈశ్వరుడు చేయనే లేదని వేదాంతులు దీనికి పరిహారం చెప్పారు.