ఓంకార : సోహం అనే మాటలో సకార హకారాలు లోపిస్తే అవి ఓం అయిందంటారు. సః అహం సోహం. వాడే నేను అంటే ఆ ఈశ్వరుడే నేను. నాకూ వాడికీ తేడా లేదని భావం. ఇది అనుభవానికి తెచ్చుకోవటానికి దీన్ని మూడు వర్ణాలుగా విభజించారు. అ+ఉ+మ. అ అనేది జాగ్రదవస్థకూ అందులో ఉన్న విశ్వుడనే జీవుడికీ సంకేతం. ఉ అనేది స్వప్నానికీ తైజసుడికీ సంకేతం. మ అనేది సుషుప్తికీ అందులోని ప్రాజ్ఞుడికీ సంకేతం. సంకేతాన్ని ఉచ్ఛరించేటపుడీ అవస్థాత్రయాన్ని అందులో బందీ అయిన జీవుణ్ణి భావనచేసి కడపట మకారమనే నాదమెక్కడ ఆగిపోతుందో దాన్ని తురీయావస్థగా గుర్తించగలిగితే అప్పుడీ జీవభావమంతా ఎగిరిపోయి జీవుడీశ్వరుడే అనే ఏకాత్మ భావం అనుభవానికి రాగలదు. కనుకనే 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్మా మనుస్మరన్' అని గీత బోధించింది. ఓం అనేది దానికి కేవలమొక ఆలంబనం లేదా ప్రతీక symbol.
×
ఓదన : అన్నమని అర్థం. దధ్యోదనమనే మాటలో తెలిసిపోతుంది. జరగబోయే ఫలితాన్ని ముందుగా మనస్సులో ఉంచుకొని చెప్పటానికిది ఒక ఉదాహరణగా ఇస్తారు. 'ఓదనం పచతి దేవదత్తః.' అన్నం వండుతున్నాడు దేవదత్తుడని అర్థం. వండితే గదా అది అన్నమవుతుంది. వండకముందే అన్నమనటంలో అర్థమేమిటి? అన్నంగా తయారుచేయటానికి యత్నిస్తున్నాడని భావం. దీన్ని భవిష్యద్వృత్తి అంటారు శాస్త్రంలో. సుషుప్తిలో ఉన్న ప్రాజ్ఞుడిలాంటివాడే. వీడిప్పుడు ప్రాజ్ఞుడు కాడు. ప్రజ్ఞాన రూపుడైన ఈశ్వరుడు నేనని భావిస్తే అవుతాడు.
×
ఓతప్రోత : పడుగు పేకలని అర్థం. అలాగే ఒకదానితో ఒకటి పెనవేసుకుని అల్లుకుపోతే దానికి పేరు. దేహంతో జీవచైతన్యం అలాగే ఓతప్రోతమై కూచుంది. కనుక దీనిని మరలా ఆత్మజ్ఞానంతో విభజించి రెండూ కలిపి ఏకాత్మ తత్త్వంగా గుర్తించటమే మానవుడు చేయవలసిన యత్నం.
×
ఓకస్: స్థానమని అర్థం. Abode. దివౌకస అంటే దేవతలు. దేవలోకమే ఓకస్సుగా కలవారని అర్థం.
×
ఓకోవిద : అసలైన స్థానమేదో గుర్తించినవాడు. మర్మజ్ఞుడు. ఓకోవిద అనే మాటలోనే ఓ అనే అక్షరం లోపించి కోవిద అనే రూపమేర్పడింది. రెండింటికీ అర్థమొకటే. అర్థంలో మార్పులేదు.
ఔత్పత్తిక : ఉత్పత్తి కలిగినది. తయారైనది. సహజం కానిది. Created.
×
ఔపచారిక : ఉపచారంవల్ల గ్రహించేది. ఉపచారమంటే గౌణార్థం. ondary Sence లక్షణ. లాక్షణికంగా ప్రయోగించిన విషయానికి ఔపచారికమని పేరు. 'సింహోదేవదత్తః' దేవదత్తుడు సింహమే. సింహగుణాలు కలగినవాడని అర్థం.
×
ఔపనిషద : ఉపనిషత్తులకు సంబంధించినది. 'ఔపనిషదః పురుషః' ఉపనిషత్తులలో చెప్పిన పురుషుడు. అంటే పూర్ణ స్వరూపమైన ఆత్మ చైతన్యం అని అర్థం. అది ఉపనిషత్ప్రమాణం వల్లనే గ్రహించాలిగాని, వేదంలోని పూర్వభాగమైన కర్మకాండ ద్వారా కాదు.
×
ఔపదేశిక : ఉపదేశమంటే Intuition తమ అనుభవాన్ని ఇతరుల కందివ్వటం. దానికి సంబంధించిన జ్ఞానం ఔపదేశికం. Secret knowledge. బ్రహ్మానుభవానికి కేవలం ప్రవచనం చేస్తే సరిపోదు. ప్రవచన అనంతరం ఉపదేశించాలి సద్గురువైన వాడు. అప్పుడే జ్ఞానానికి పరిపూర్ణత. పూర్ణానుభవం అదే.
×
ఔపాధిక : ఉపాధివల్ల ఏర్పడినది. నైమిత్తికమని కూడా పేర్కొంటారు. సహజం కానిది. ఒక విశేషం ద్వారా సంక్రమించినది. Accidental నిమిత్తముంటే ఉంటుంది. లేకుంటే తొలగిపోతుంది. కనుకనే ఇది నిత్యం కాదు.
×
ఔత్సర్గిక : ఉత్సర్గమంటే సామాన్య సూత్రం. General rule. దానికి చెందినది ఔత్సర్గికం. ఉత్సర్గమంటే సృష్టికి కూడా వాచకమే. దానికి చెందినది లేదా సృష్టియైనది అని కూడా అర్థం చెప్పవచ్చు.