ఉత్తరార్ధమ్
97
అజ్ఞ శ్చా శ్రద్ధధాన శ్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకోస్తి నవరో-న సుఖం సంశయాత్మనః 4-40
అయినా నూటికి తొంబదితొమ్మిది మందికీ రహస్య మంతుబట్టటంలేదు లోకంలో. అంచేతనే వారికి శ్రద్దలేదు. ఏ విషయమైనా దాని విలువ తెలిసి నప్పుడే సాధించాలనే శ్రద్ధ ఏర్పడుతుంది. అసలు దాని ముక్కూ మొగం తెలియని వారికి దానిమీద శ్రద్ధ ఎలా కలుగుతుంది. కనుక అజ్ఞానంవల్లనే మనకు శ్రద్ధలేకపోవడం.
శ్రద్ధ ఎప్పుడు కరువయిందో అప్పుడు ప్రతి ఒక్కటీ మనకు సంశయా స్పదమే. శ్రద్ధ అంటే నమ్మకమే గదా. సమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్మన్నారు. సామాన్యులకేగాదు - సాధకుల నుకొనే వాళ్ళకు కూడా ఈ జాడ్యమెంతో ఉంది. కలడు కలండనెడు వాడు కలడో లేడో అన్నట్టు ఎంత ప్రయత్నిస్తున్నా- ఏదో ఒక సాధన భూమికలో సంశయ పిశాచ మెదురపుతూనే ఉంటుంది.
ఇదుగో ఈ సంశయమనే దయ్యం పట్టిందంటే చాలు. ఇక దాన్ని విడిపించు కోటమసాధ్యం. కేవల మజ్ఞత వరకయితే ఒక విషయం తెలియదు. అంత మాత్రమే. నమ్మకం లేకుంటే లేకపోయింది. దాని జోలికి పోము. అదీ ప్రమాదం లేదు. కాని తెలుసుకొని నమ్మి కొంత ముందుకుపోయి మధ్యలో ఇది యధార్ధంగానే మనలను కడతేరుస్తుందా లేదా అని అనుమానించామో అంతకన్నా ప్రమాదంలేదు. ఇహానికీ పరానికీ దూరమయి రెంటికీ చెడిన రేవడి లాగా తయారవుతాము. చేసింది కూడా దానితోపాటు ఊడ్చుకుపోతుంది.
కాబట్టి మోక్ష సాధనలో మానవు డెప్పుడేగాని సంశయానికి గురికారాదు. అలా కాకూడదంటే చేసే పని ముమ్మాటికీ సత్యమేనని విశ్వాసం సడలకుండా ఉండాలి. అది సడలకుండా సాగాలంటే తన గమ్యమేమిటో దాన్ని నూటికి నూరుపాళ్ళూ కచ్చితంగా తెలిసి పట్టుకోవాలి. ఇలా మూడు ఒక దాని కొకటి సహకారులయి చివరకు మోక్షఫల ప్రాప్తికి దోహదం చేస్తాయి. లేకుంటే అంతా అయోమయమే.