#


Back

ఉత్తరార్ధమ్


93
లోకేస్మిన్ ద్వివిధా నిష్టా - పురా ప్రోక్తా మయానఘ
జ్ఞాన యోగేన సాంఖ్యానాం - కర్మ యోగేన యోగినాం  3-3

ఈ విధంగా సాధన మార్గంలో ఉన్న తేడాను మనసులో పెట్టుకొనే ఆ భగవానుడిలా సెలవిచ్చాడు. నేనీ లోకులకు రెండు రకాలైన మార్గాలను బోధించాను. ఒకటి జ్ఞానం - మరొకటి కర్మ అందులో జ్ఞానులైన వారికి జ్ఞాన మార్గ మైతే-కర్ములకు కర్మ మార్గం చెప్పాను. ఎవరి పాటికి వారు తమ మార్గం పట్టుకొనిపోతే చాలు. చివరికిద్దరూ ఒకే గమ్యాన్ని చేరుతారు. ఇందుమూలంగా మార్గంలో ఉన్న భేదాన్ని ఆయన స్పష్టంగా బయట పెట్టారు. కాబట్టి ఇప్పుడు మన మొక అపోహను పోగొట్టుకొనవలసి ఉంది. సాధారణం లోకులందరికీ ఒక అపోహ ఉంది. విద్యావంతులకు కూడా చాలా మంది కుందది. ఏమంటే కర్మ భక్తి జ్ఞానాలు మూడు మార్గాలే అందులో ఎవడేది పట్టుకొని పోయిన గమ్యం చేరవచ్చునని. అది శుద్ద పొరబాటని మన కిప్పుడు తేలిపోయింది. అన్నీ ఒకటే అయితే జ్ఞానయోగుల కిదీ - కర్మ యోగుల కదీ - రెండు రకాలు చెప్పానని భగవానుడెలా అంటాడు. కాబట్టి అవి రెండూ ఒకటి కావు.

అయితే ఒకటి కావంటే ఇందులో ఒక రహస్యముంది మరలా. రెండు రెండు ప్రత్యేక మార్గాలు కావవి. అయితే మరేమిటి. ఒకే మార్గంలో రెండు మజిలీలు. నాస్య: పంధా విద్యతే యనాయ- అన్నారు పెద్దలు. మోక్షాని కొక్కటే మార్గం. రెండూ లేవు. రెండనేది కేవలం మజిలీలే. అందులో మొదటి మజిలీ కర్మ చివరి మజిలీ జ్ఞానం. అందుకే ద్వివిధా నిష్ఠా అని ఏక వచనాంతంగా ప్రయోగించింది. విధాలంటే భూమికలు. రెండు భూమికలు కల ఒకే నిష్ఠ అది. దీనిని బట్టి గీతా శాస్త్రంలో చెప్పినదంతా క్రోడీకరిస్తే ఒకే ఒక యోగమని తేట పడుతున్నది. దీని కుపోద్బలకంగా "ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయం" అని తాను అనాది నుంచీ ఒకే ఒక మార్గాన్ని బోధిస్తూ వచ్చి నట్టు సూచిస్తాడు భగవానుడు.