#


Back

ఉత్తరార్ధమ్


92
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం త ద్యోగైరపి గమ్యతే
ఏకం సాంఖ్యంచ యోగంచ-యః పశ్యతి సపశ్యతి  5-5

ఇలాంటి సమన్వయదృష్టి ఉన్న వాడికే సాంఖ్యయోగాలు రెండూ ఒక్కటేననే సత్యం బోధపడుతుంది. సాంఖ్యమంటే జ్ఞానమనీ - యోగమంటే కర్మ అనీ గీతా పరిభాష. వాటి రెంటినీ ఏకంగానే భావిస్తున్నాడు తత్త్వవేత్త. ఏకంగానే అంటే సాధనలో కాదు. ఫలంలో. రెండూ ఫలంలో సమానమే. ఎలాగంటే జ్ఞానంవల్ల ఏ మోక్ష ఫలాన్ని పొందుతాడో సాధకుడు దానినే కర్మవల్ల కూడా పొందుతున్నాడు. అయితే జ్ఞానంవల్ల నేరుగా పొందుతాడు. కర్మవల్ల పరం పరయా పొందుతున్నాడు. ఎలాగైనా ఫలప్రాప్తిలో తేడాలేదు. కాబట్టి ఫలదృష్ట్యా రెండూ ఒక్కటే. ఇక్కడ వున్న సూక్ష్మ మేమంటే కర్మయోగ శిక్షణ అంతా పూర్వ జన్మలోనే ముగించుకొని ప్రస్తుత జన్మలో ఆలోచనా పరుడుగానే జన్మించిన ఉత్తమాధి కారికి కర్మ మార్గమక్కరలేదు. నేరుగా వాడు జ్ఞానమార్గంలోనే అడుగు పెట్ట వచ్చు.

అలాంటి పూర్వ సంస్కారం లేని మంద మధ్య మాధికారులు మాత్ర మీజన్మలోనైనా ఆ శిక్షణ నారంభించవలసిందే. కాబట్టి వారు వారి యోగ్యతకు తగినట్లు ఆయా కర్మ భక్తి సమాధి రూపమైన యోగాన్ని సేవిస్తూ తన్మూలంగా చిత్తశుద్ధి సంపాదించి ఆ తరువాతనే జ్ఞానంలో ప్రవేశించాలి. అంచేత ఫలైక్యమున్నా - ఇద్దరికీ సాధన క్రమంలో ఉన్న ఈ తేడా మనం గమనించ వలసి ఉంది మరలా.