#


Back

ఉత్తరార్ధమ్


87
బ్రహ్మార్పణమ్ బ్రహ్మ హవి-రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యమ్-బ్రహ్మ కర్మ సమాధినా  4-24

4-24

జ్ఞానమే యజ్ఞమని వర్ణించారు. అది ఎలా సంభవం. యజ్ఞమంటే బాహ్యంగా జరిగే కలాపం గదా అని ప్రశ్న వస్తుంది. వాస్తవమే. యజ్ఞ మంటే అదే అభిప్రాయం మనందరికీ. అయితే అవన్నీ ద్రవ్యయజ్ఞాలు. ద్రవ్యయజ్ఞాలలో ఒక అగ్ని హోత్రమనీ ఒకహవిస్సనీ ఒక ఆర్పణమనీ-దానితో హవిస్సును హోమం చేయట మనీ ఒక కర్మానుష్ఠాన మనీ- ఫలమనీ. ఇంత కలాప ముంటుంది. ఇదంతా మనకు భౌతికంగా బాహ్యంగా కనపడు తుంటుంది.

ప్రస్తుత మీ జ్ఞానాన్ని ఒక యజ్ఞమని పేర్కొన్నామంటే ఇవన్నీ దానిలో కూడా ఇలాగే ఉంటాయని గాదు. ఒక యజ్ఞం లాగా అది చాలా పవిత్ర మైనదని దాన్ని ప్రశంసించట మిది. తన్మూలంగా సాధకుడికి దాని మీద ఒక ప్రరోచన Inclination కలిగి దాన్ని అర్జించటానికి నడుము కడతాడు. అందుకోసమే దాన్ని యజ్ఞమని వర్ణించటం. అంతేగాని ప్రతి ఒక్క కర్మా బ్రహ్మాకారంగా దర్శిం చుమని చెబుతున్నప్పుడు యజ్ఞమని విశేషించి చెప్పటం దేనికి. అనావశ్యకం.

కొందరీరహస్యం గ్రహించలేక నిజంగానే ఇది ఒక యజ్ఞమని అర్థం చేసుకొని యజ్ఞాంగములుగా ప్రసిద్ధి చెందిన అగ్ని హోత్రహవిర్మంత్రాదుల నన్నింటినీ బ్రహ్మ దృష్టితో దర్శిస్తూ పోవాలని అదే జ్ఞాన యజ్ఞమని వ్యాఖ్యానిస్తు న్నారు. అది శుద్ధ తప్పని చాటారు భగవత్పాదులు. అగ్నిహోత్రాదులను బ్రహ్మ దృష్టితో చూచినా అవి ఎక్కడికీపోవు. అలాగే కనిపిస్తుంటాయి. మహా అయితే బ్రహ్మ దృష్టి ఉంటుంది మనకంత మాత్రమే. అలా చూడటం ఉపాసన అవుతుందేగాని జ్ఞానం కాదు.

అయితే మరి ఎలా చూస్తే జ్ఞానమవుతుంది. ఏది బ్రహ్మమో అది ఈ అర్పణాదు లనిగాక - ఈ అర్పణాదులుగా ఏవి కనిపిస్తున్నవో అవి వాస్తవానికి బ్రహ్మమేనని చూడాలి. అప్పుడు బ్రహ్మ మర్పణాదులుగా గాక అర్పణాదులు బ్రహ్మాకారంగా దర్శనమిస్తాయి. ఇది ఎలాంటిదంటే ఈ కనిపించేది రజతం కాదు - శుక్తికేనని చూడటంలాంటిది. దానివల్ల రజతమనే భ్రాంతి తొలగిపోయి శుక్తిక అనే వాస్తవం బయట పడుతుంది. వస్తువనేది ఎప్పుడూ ఏకం. దాన్ని మరచి చూచే బ్రాంతులనేకం. ఒక రజ్ఞవును మరిచి చూదామంటే అది సర్పం కావచ్చు. దండంగావచ్చు. ధారగావచ్చు. వీటికే వికల్పాలని పేరు. ఈ వికల్పాల వల్లనే సంసారం. అదే సుఖ దుఃఖాలకు మూలం.

ప్రస్తుత మీ నామరూపాది ప్రపంచ మంతా ఆత్మ రూపమైన బ్రహ్మతత్త్వాన్ని విస్మరించటంవల్ల ఏర్పడ్డ వికల్పమే. ఇది ఇలా ఉన్నంత వరకూ మనకు క్షేమం లేదు. కాబట్టి బ్రహ్మమే ఇది అనే దృష్టితో చూడటం పనికిరాదు. అలా చూస్తే ఇది లయం కాదు. ఇంకా గట్టి పడుతుంది. లయం చేసుకోవాలంటే ఇదంతా ఆ బ్రహ్మమే - అంతకన్నా విలక్షణం కాదని దర్శించాలి. అప్పుడిది ప్రవిలయమై దీని బదులా బ్రహ్మ చైతన్యమే దృఢపడుతుంది. అంటే సవికల్పమైన దృష్టిపోయి సాధకుడికి కేవల నిర్వకల్ప దృష్టి నిలిచి ఉంటుంది. అదే జ్ఞానం. దాన్ని నిరం తరం నిలుపుకోటమే యజ్ఞం. పూర్ణజ్ఞానులంతా ఇలాంటి జ్ఞాన యజ్ఞమే చేస్తుం టారు. వారు జీవితసంలోచేసే ప్రతి కర్మా ఈ యజ్ఞ కుండంలో పడి భస్మం కావలసిందే తప్పదు.