ఉత్తరార్ధమ్
84
యస్య సర్వే సమారంభాః-కామ సంకల్ప వర్జితాః
జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం-తమాహుః పండితం బుధాః 4-19
కర్మలేవీ చేయకున్నా అన్నీ చేసినట్టేనని చెప్పాము. తత్త్వవేత్త విషయంలో అయితే చేయకున్నా చేసినట్టే ననే మాట కర్ధమేమి. అని మరలా సందేహం. కర్మ చేయటమంటే బాహ్యంగా కనిపించే ఆచరణ అనేగాదు. అంతరమైన సంకల్పమే అసలుకర్మ. ఎందుకంటే సంకల్పం లేకుండా ఏపనీ చేయలేము మసం. ఈ సంకల్పమనేది మనకు కామం వల్లనే ఏర్పడుతుంది. కామమంటే ఒకటి కావాలనే కోరిక. అది తన కన్నా భిన్నంగా ఈ ప్రపంచ మొకటి ఉందని భావించేనప్పుడే ఉదయిస్తుంది.
ఇలాంటి భావన తత్త్వదర్శి అయిన వాడికి లేదని పేర్కొన్నాము. వాడు ప్రపంచాన్నంతటినీ తన స్వరూపంగానే భావిస్తాడు. అంతాతానే అయినప్పుడిక అంతా తనదే. మరి దేనికోస మఱ్ఱులు చాచాలి వాడు. అలా ప్రాకులాడకపోతే అది సంకల్పమే అయినా కామసహితం కాదు తద్వర్జిత మవుతుంది. దీనినే సత్యసంకల్పమంటారు. తన రూపం సత్యం కాబట్టి దానిలోనుంచి ఉదయించే సంకల్పంకూడా సత్యమే. ఇలాంటి సంకల్పంతో ఏకర్మ నిర్వర్తించినా ఫరవా లేదు. అదీ సత్యమే అవుతుంది. ఎంచేత. తనకంటే భిన్నంగా ఆకర్మనుకూడా భావించడు తత్త్వవేత్త. అంచేత కర్మచేసినా చేయనివాడే అవుతాడు. సందేహం లేదు.
ఇంతదూరం వచ్చిన తరువాత ఆదృష్టి వాడికి విశ్వతో ముఖంగా వ్యాప్ స్తుంది. అప్పుడది విస్ఫులింగం కాదు. విజృంభమాణమైన అగ్ని జ్వాల. దాని మంటలో పడి సమస్త కర్మలూ కట్టెల మాదిరి కాలిపోవలసిందే. అప్పుడిక కర్మ లేమిటి. వాణ్ణి బంధించటమేమిటి. కర్మ వాగురలోనుంచి అతి మెలకువతో తప్పించు కోగల మహానేర్పరి వాడు.