ఉత్తరార్ధమ్
83
కర్మ ణ్య కర్మ యః పశ్యే దకర్మ ణిచ కర్మ యః
స బుద్ధిమాన్ మనుష్యేషు-సయుక్తఃకృత్స్న కర్మకృత్ 4-18
ఇంతకూ ఒక పని జరుగుతూ ఉన్నప్పుడూ ఏమీ జరగటంలేదని భావిం చాలి. అలాగే ఏమీ జరగనప్పుడు కూడా కర్మ జరుగుతున్నట్టు చూడాలి. అలా ఎవడుచూడగలడో వాడే అందరిలో బుద్ధిమంతుడు. వాడే యోగి. వాడే సకల కర్మలూ చేసినవాడు.
ఇదిఏమిటి. కర్మలో అకర్మ చూడమన్నారు. బాగనే ఉంది. కాని ఆనోటనే ఆకర్మలో మరలా కర్మ చూడాలంటున్నారు. ఇది వరస్పర విరుద్ధంకాదా అని ఆశంకవస్తుంది.
దీనికి సమాధాన మేమంటే కర్మలనేవి లోకంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. నామరూపాలను బట్టే ఏ కర్మ అయినా. ఇది కర్మ జగత్తు. కాబట్టి కర్మ అనేదెప్పుడూ లేకుండాపోదు అయితే అలా జరిగే దాన్ని నా మూలంగా జరుగుతూ ఉందని భావించరాదు మనం. నా ప్రమేయమేమీ లేదందులో. ప్రకృతి గుణాలే వాటిని నిర్వర్తిస్తుంటాయి. నేను వాటిని కేవలం ఉదాసీనంగా చూస్తున్న శుద్ధచైతన్య రూపుడనని వైదొలగడమే కర్మలో అకర్మను చూడటం.
అలాగే శుద్ధచైతన్యం తప్ప సృష్టిలో మరేదీ లేనప్పుడీ నామరూపాలుగానీ, ఈ కర్మ కలాపంగానీ ఎక్కడి నుంచి వచ్చింది. వచ్చిందంటే దానిలోనుంచే రావాలి. ఇదంతా. దావిలోనే ఇదంతా ఒక ఇంద్రజాలం లాగా జరుగుతూ ఉండాలి. అలా జరిగేటప్పుడు దాని మూలంగా నా చైతన్యానికి క్షతి ఏముంది. తెరపైన తిరిగే బొమ్మల మూలంగా తెరకెలాంటి దోషమూ అంటదుగదా. ఇలా అనుసంధానం చేసుకోవడమే ఆ అకర్మలో మరలా కర్మను దర్శించటం.
కాబట్టి రెండూ పొసగేవే. ఒండొంటికి వైరుధ్య మేమీలేదు. ఇందులో ఇమిడి ఉన్న సబబేమంటే అకర్మ అనేది బ్రహ్మచైతన్యమే. మరి కర్మ అనేది ఏదోగాదు. నామరూపప్రపంచమే. అంచేత అకర్మలో కర్మ చూడటమంటే ఏమన్నమాట. నామరూపాల నన్నింటినీ బ్రహ్మంగా భావించటమని అర్థం. అలాగే కర్మలో అకర్మ చూడటమంటే చరాచర జగత్తంతా వ్యాపించి బ్రహ్మమే ఉందని గుర్తించడం.
కనుక రెండూ ఒక్కటే చివరకు. ఒకటి స్వరూపజ్ఞానమయితే మరొకటి దాని విభూతిదర్శనం.