ఉత్తరార్ధమ్
76
కర్మణై వహి సంసిద్ది-మాస్థితా జనకాదయః
లోక సంగ్రహ మేవాపి-సంపశ్యన్ కర్తు మర్హసి 3-20
ఇలాంటి అనాసక్తి యోగంతోనే తరించారు పూర్వం జనకాదు లైన రాజర్షులంతా. అవి ఏవో పురాణగాథ లనుకొంటే నిన్న మొన్నటి శంకర విద్యార ణ్యాదుల మాట ఏమిటి. పరిపూర్ణజ్ఞానులై కూడా వారు కర్మ లాచరిస్తూ వచ్చారు. అనాసక్తే లేకపోతే వారి కాకర్మ బంధకం కావలసి వస్తుంది.
అయితే అంత జ్ఞాననిష్ఠులైకూడా వారు కర్మ ఎందుకు చేయవలసి వచ్చిం దని అడగవచ్చు. మంచి ప్రశ్నే ఇది. పూర్ణజ్ఞానికి కర్మ చేయవలసిన అగత్యంలేదు వాస్తవంలో, అంతా జ్ఞానమయంగానే వాడికి భాసిస్తుంది. కడకు దేహయాత్రకు కూడా వాడు పాటు పడనక్కరలేదు. అదికూడా జ్ఞాన బలంతోనే సిద్ధిస్తుంది. అలాంటప్పుడీ శంకరాదులంతా ఎందు కంతంత వ్యాసంగం పెట్టుకోవలసి వచ్చిందని అడగటంలో తప్పులేదు.
ఇక్కడే మనమొక రహస్యం గ్రహించవలసి ఉంది. పూర్ణజ్ఞాని అయిన వాడు ముక్తుడు కావడంలో సందేహం లేదు. కాని వాడు దేహ పాత మయ్యే వరకూ కాలం వెళ్ళబుచ్చవలసి ఉంది. అలా వెళ్ళ బుచ్చే జీవన్ముక్తులందరూ రెండు జాతులు, ఒకరు గోవింద భగవత్పాదులలాగా ప్రపంచంతో అంతగా సంబంధం పెట్టుకోక తమ పాటికి తాము సమాధినిష్ఠలో కాలం గడిపేవారు. పోతే మరి ఒకరు శంకర భగవత్పాదులలాగా తాము సంపాదించిన నిక్షేపాన్ని తమ వరకే గాక పదిమంది ముముక్షువులకూ పంచిపెట్టే ప్రయత్నంలో ఉన్నవారు. అయితే వీరికి కలిగే ఈ సంకల్పం కూడా లౌకికమైనది కాదు. సత్య సంకల్ప మది. నిత్యముక్తుడైన ఈశ్వరుడే వారికలాంటి సంకల్పం కలిగిస్తాడు. వారి మూలంగా ముముక్షు లోకాని కొకమేలు జరగవలసి ఉంది. దానిని బట్టే అసలు వారికా సంకల్పమనేది ఉదయిస్తుంది దీనికే అధికార Divine Deputation మని పేరు. దానిని నిర్వహించే ఆ మహనీయుల కాధికారిక పురుషులని పేరు, లోక సంగ్రహమే వారికి ధ్యేయం. తమ మాటల ద్వారా రచనల ద్వారా ఉపదేశం ద్వారా లోకులను ధార్మికుల గానూ ధార్మికులను జిజ్ఞాసువులుగానూ జిజ్ఞాసువులను జ్ఞానులుగానూ జ్ఞానులను అనుభవజ్ఞులుగానూ-చేయటమే వారు చేసే ఆ లోక సంగ్రహం. అందులో స్వప్రయోజన దృష్టి కేమాత్రమూ చోటులేదు. కాబట్టి ఆత్మదృష్టితో జరిపే ఆ కలాపమంతా వారి కెంతమాత్రమూ బంధకం కాదు. మీదు మిక్కిలి బంధగత జన మోచకం.