#


Back

ఉత్తరార్ధమ్


72
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్ఠితాత్
స్వభావ నియతమ్ కర్మ- కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్  18-47

లోకవ్యవస్థ ఇలా ఉండవలసింది గనుకనే ఎవడికి నియతమైన ధర్మంవాడు చేస్తూపోవటమే మంచిది. అది వాడి వ్యక్తి జీవితానికీ సమాజ జీవితానికీ రెండిం టికీ శ్రేయోదాయకం. అలాకాక ఒకరు చేయవలసిన దానిలో మరొకడు వేలు పెట్టాడంటే అది ఇద్దరికీ నష్టం. దానివల్ల సమాజ శ్రేయస్సు కూడా దెబ్బ తింటుంది.

ఒక ఇంట్లో తండ్రి తల్లి-కొడుకులూ కూతుళ్ళూ-అని ఉన్నారను కోండి. అందులో తండ్రి బయటికి పోయి సంపాదించి తెస్తే- తల్లి అన్నీ తయారుచేసి నలుగురికీ అమర్చితే-కొడుకులు చదువు సంధ్యలు నేరిస్తే కూతుళ్ళు తల్లికి తోడ్పడుతూ ఇల్లూ వాకిలీ చక్కబెడుతుంటే- గృహం బాగుపడుతుంది గాని ఒకరి పని ఒకరు చేస్తామని కూచుంటే ఎలా బాగుపడుతుంది.

అలాగే సమాజంలోకూడా ఎవరి విధులు వారు నిర్వర్తించాలి. విద్యార్థి చదువు కొని బాగుపడాలి. ఉపాధ్యాయుడు చదువు నేర్పాలి. ఉద్యోగస్థులు వారి వారి ఉద్యోగ విషయాలు సక్రమంగా నెరవేర్చాలి. వ్యాపారస్థులు క్రయ విక్ర యాలు సరిగా నడుపుతుండాలి. మరి పరిపాలకు లన్నింటినీ పర్యవేక్షణ చేస్తూ పోవాలి. అందరూ కలిసి అన్ని పనులూ చేయటం సాంకర్యమైతే ఏపనీ చేయక పోవటం సోమరితన మవుతుంది. దానివల్ల తన జీవనమూ జరగదు. సమాజ జీవనమూ ముందుకు సాగదు. ఎవరికి తగినట్టు వారు వ్యక్తలందరూ కృషిచేస్తే సమష్టి రూపమైన మానవ సమాజం పురోగమిస్తుంది. అంతకంత కభ్యు దయాన్ని సాధిస్తుంది.

కాబట్టి పరధర్మం పైన వేసుకొని సంబాళించలేక చతికిల పడటం కన్నా స్వధర్మ మది ఎంత తక్కువ దనిపించినా మనకది విహితమని అనుసరించటమే హితం. విగుణమంటూ ఎలా ఆచరించటమని ప్రశ్నలేదు. విషంలో వుట్టిన క్రిమికి విషమెలా మారకం గాదో అలాగే విగుణమైనా అది వాడికి కీడుచేయదు. కారణమే మంటే అది లోకుల దృష్టిలో ఎంత నికృష్ణమైనా వాడి కాజన్మ సిద్దం. బ్రాహ్మజ్ఞాని అయి కూడా ధర్మవ్యాధుడు మాంస విక్రయం చేసినట్టు వర్ణించింది మహాభారతం. హింసాత్మకమైన కర్మ అయినా అది వాడికి కిల్బిషాన్ని అపాదించ లేదు. అది ఎలాగా అని శంకించరాదు. ఒక వైద్యుడు శస్త్ర చికిత్స చేస్తాడు. పురుషులకూ చేస్తాడు. స్త్రీలకూ చేస్తాడు. దానిని హింస అని గాని వ్యభిచార మని గాని ఆనలేవు గదా. అది వాడి వృత్తి ధర్మం. అలాగే ఇదీ అని అర్ధం చేసుకోవాలి. చేసుకొంటే ఇక గుణదోష విచారమంటూ ఉండబోదు.