#


Back

ఉత్తరార్ధమ్


66
న కర్మణా మనారంభా - నైష్కర్మ్యం పురుషోశ్నుతే
నచ సన్న్య సనా దేవ - సిద్దిం సమధిగచ్ఛతి  3-4

అయితే ఒక అశంక. ఇంత అసిధారావ్రతం చేసేదానికన్న అసలీ కర్మల నేమీ అనుష్ఠించకుండా ఊరక కూచుంటే సరిపోలేదా. దానివల్ల మనకిక ఏబాధా లేదు గదా - అని అడగవచ్చు.

వాస్తవమే. ఏకర్మా ఆరంభించకపోతే మంచిదే. కానే అంత మాత్రాన అది నైష్కర్మ్య మనుకోరాదు. నైష్కర్మ్య మంటే ఏకర్మా లేకపోవటం. కర్మ అనేది ఏ ఒక్కటీ చేయకపోతే అది మనకు దక్కాలి వాస్తవంలో. కానీ దక్కదది. ఎందుచేత. కర్మ ఏదీ లేదంటే అది నిశ్చలమైన ఆత్మచైతన్యమే. ఆ చైతన్య మనుభవానికి రావాలంటే సత్త్వం బాగా శుద్ధిచెందాలి. అది శుద్ది కావాలంటే దానిని శోధించే కర్మను ఆచరించి తీరాలి. అప్పటికి కర్మాచరణమే నైష్కర్మ్యానికి ఉపాయ మయింది. మరి కర్మను ఆరంభించక పోతే అది ఎలా సిద్దిస్తుంది.

అందుచేత ఇంతకూ సాధకుడు పాటించవలసింది ఏమిటని ప్రశ్న, నైష్కర్మ్య రూపమైన ఆత్మ స్వరూపాన్ని గమ్యంగా భావించి దాన్ని చేరటానికి సాధనంగా తగిన కర్మ నాచరించాలి. అదికూడా మధ్యలో విడిచిపెట్టక గమ్యం చేరే దాకా అనుష్ఠిస్తూనే పోవాలి. అసలు అనుష్ఠించకున్నా సుఖంలేదు. అనుష్ఠిస్తూ అది ఫలించకుండా విడిచిపెట్టినా లాభంలేదు. ఇందులో మొదటిది సాధనం లేకుండా సాధ్యాన్ని ఆసించటమైతే రెండవది సాధ్యమైన జ్ఞానం కలగకుండానే సాధనాన్నే జారవిడవటం అవుతుంది. రెండూ తెలివితక్కువే.

అంతేకాదు. కర్మను ఆరంభించకపోతే ఎలా నైష్కర్మం సిద్ధించదో అలాగే సిద్ధి కలిగే లోపలనే దానిని వదిలేసినా ప్రయోజనంలేదు. సన్న్యాసమంటే వదులు కోవటమే. అది ఫలితం సిద్ధించిన తరువాత చేయవలసిన పని. ముందుగా కాదు. తొందరపడి ముందుగానే చేశామంటే ప్రారంభించి కూడా అది నిష్ఫలమే.