#


Back

ఉత్తరార్ధమ్


60
అన్యేత్వేవ మజానంతః - శ్రుత్వాన్యేభ్య ఉపాసతే
తేపిచాతి తరం త్వేవ - నిత్యం శ్రుతి పరాయణాః  13-25

పోతే నలుగవదైన మార్గానికి కూడా చెందిన వారనేకులున్నారు. వారతి మందులు. స్వయంగా ఏదీ భావన చేయలేరు. గ్రహించలేరు. కాని పెద్దలు చెప్పిన దేదయినా విని దాని కనుగుణంగా నడుచుకొనే స్వభావమున్నది వారికి.

గ్రుడ్డికన్నా మెల్లమేలన్నట్లు అది కూడా కొంత మంచిదే. జ్ఞానం లేదేగాని వారికి శ్రద్ధాభక్తులున్నాయి. స్వయంగా చేయలేరే గాని చెబితే చేస్తారు. చేసేది మంచి పనే కాబట్టి అలా చేస్తూ పోతే కొంత కాలానికి చిత్తం శుద్దమవుతుంది. అంటే రజస్తమస్సులు పోయి సత్త్వం మిగులుతుందని అర్థం. సత్త్వమెప్పుడు ఆవిర్భవించిందో అప్పుడు జ్ఞానమనేది తప్పకుండా ఉదయిస్తుంది. “సత్వా త్సంజా యతే జ్ఞాన”మని గీతా భగవానుడు హామీ ఇచ్చాడు. ఇక్కడ రజస్త మస్సులు నశించటం క్షేత్రాన్ని తయారు చేయటమైతే- సత్త్వం పరిశుద్ధం కావటం బీజావాపం లాంటిది. పోతే జ్ఞానోదయ మనేది ఆ బీజంలో నుంచి అంకురం మొలకెత్తటం వంటిదని భావించాలి మనం.