#


Back

పూర్వార్థమ్


6
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్లాతి నరోపరాణి
తద్వ చ్ఛరీ రాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ   2-22

నిజమే. చెందబనిలేదు వాస్తవానికి. అయినా మనకలాంటి ధైర్య మబ్బటం లేదు. ఏమి కారణం. దేహంతో పుట్టి దేహంతో పెరిగి దేహంతోనే నశిస్తున్నాము మనం. దేహాతి రిక్తమైన చైతన్యమే నీవని శాస్త్రమెంత ఘోషించి చెప్పినా దానితో తాదాత్మ్యం చెందలేకపోతున్నాము. మీదు మిక్కిలి ఏ శాస్త్రమూ చెప్పకపోయినా నిత్యమూ ఈ చేహమే నేనని దీనితోనే ప్రతి ఒక్కరమూ మమేకంగా బ్రతుకు తున్నాము. అలాంటప్పుడు ధైర్యమనేది ఎలా అబ్బుతుంది. అబ్బకపోవటమే సహజం.

అయితే అలాగని ఊరక కూచోరాదు. కూచుంటే వివేచనా బుద్ధి ఉండి మనకు ప్రయోజనం లేదు. వివేక మున్నందుకు మన మీ జడమైన దేహం నుంచి శుద్ధమైన చైతన్యాన్ని వేరు చేసుకొని చూడవలసి ఉంది. దృఢమైన దీక్షతో చేయాలాపని. అలా చేయట మభ్యాసమైతే మనకవి రెండూ వేరనే భావం బాగా తార్కారణమవుతుంది. అద ఎలాగని అడగవచ్చు. ప్రతి రోజూ మనం స్నానం చేసిన తరువాత ప్రాత బట్టలు మార్చుకొని క్రొత్త బట్టలు ధరిస్తూ ఉంటాము. అలాగే రేపు అవసానంలో కూడా ఈ శరీరాన్ని ఒక పాత గుడ్డలాగే వదిలేసి మరొక క్రొత్త శరీరాన్ని ధరిస్తామనే భావం మనసు కేర్పడుతుంది. పాత దుస్తులు వదలి కొత్తవి ధరిస్తున్నప్పుడు దుస్తులే మారుతున్నవి గాని శరీరం మారటంలేదు గదా. అది అలాగే నిలిచి ఉండటం చూస్తున్నాము. అలాగే మరికొంత విమర్శించి చూచామంటే ఈ శరీరాలు కూడా దుస్తుల మాదిరి మారుతూ పోతుంటే లోపల వాటిని కనిపెట్టి చూచే చైతన్య మెలాటి మార్పూ లేక యథాపూర్వంగా నిలిచి ఉంటుందనే సత్యం అనుభవానికి రాకపోదు.

అయితే ఎటు వచ్చీ గట్టి నమ్మకంతో తగినంత అభ్యాసం సాగించవలసి ఉంటుంది మనం. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు పెద్దలు అక్కడే ఉన్నదయినా ప్రయత్నించనంత వరకూ అది మన సొమ్ముగాదు. ప్రయత్నం చేయగా చేయగా ఎలాంటి కార్యమైన పాకానికి వస్తుంది. పైగా ఇక్కడ చైతన్యమనేది మనం క్రొత్తగా సృష్టించవలసింది గాదు. సృష్టి అయినట్టు కనిపించే ఈ శరీరాది సంఘాతం వాస్తవంలో ఉన్నదీగాదు. లేకున్నా ఇది ఇలా భావిస్తుంటే - ఉన్నా అది దీనిలో మరుగు పడిపోయింది. కనుక అదే ఉంది ఇది లేదనే విమర్శ దృష్టితో చూడాలి సాధకుడు పరిపక్వమైన దృష్టి అలవడిం దంటే తప్పకుండా ఈ శరీరమొక జీర్ణమైన వస్త్రం మాదిరే మనకు భాసిస్తుంది. దానితో రేపు అవసాన సమయంలో అది మనలను వీడిపోతుంటే ఆ వియోగాన్ని తనది కాదన్నట్టు తేలికగా చూడగలడు మానవుడు. అంత తేలికగానే తాను చైతన్య రూపుడుగా ఎక్కడికీ పోకుండా నిశ్చలంగా ఉన్నాననే యథార్థాన్నీ అనుభవానికి తెచ్చుకోగలడు.