#


Back

పూర్వార్థమ్


53
యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే॥  8-11

పరమపదం పొందుతాడనీ సాయుజ్యం చెందుతాడనీ- బ్రహ్మాండంగా వర్ణించారు. బాగానే ఉంది. అయితే ఇంతకూ ఆ సాయుజ్యమనేది ఏమిటి, ఆ పరమపద మేమిటని ప్రశ్న.

దాని నక్షరమని పేర్కొంటారు వేదవిదులు. అక్షరమంటే క్షరం కానిది. శబ్ద బ్రహ్మమని అర్థం. కర్మపరాయణులైన మీమాంసకులంతా శబ్దమే నిత్యమనీ అపౌరుషేయమనీ - అదే బ్రహ్మ స్వరూపమనీ - భావిస్తారు. శబ్దాన్ని మించిన ఈశ్వరతత్త్వాన్ని వారు అంగీకరించరు.

అలాగే యోగ శాస్త్రజ్ఞులని ఒక రున్నారు. వీరు రాగమనే చిత్తవృత్తిని జయిస్తే చాలు. అదే పురుష తత్త్వాన్ని చేరటానికి ఉపాయమని చెబుతారు. వీరి దృష్టిలో ప్రకృతి గుణాలకు సాక్షిగా నిలిచిన కేవల పురుషతత్త్వమే బ్రహ్మం.

పోతే వీరిద్దరూ కాక మూడవ వారొక్కరున్నారు. సగుణ విద్యోపాసకులు వారు. వీరు బ్రహ్మాన్ని ఉపాస్య దేవత రూపంగా భావిస్తారు. మరి తద్దేవతా ప్రసాదసిద్ధి కోసం జప తపాలూ - ఉప వాసమూ - బ్రహ్మ చర్యమూ ఇలాంటి నియమ వ్రతాలన్నింటినీ పాటిస్తూ పోతారు.