#


Back

పూర్వార్థమ్


50
తస్మా త్సర్వేషు కాలేషు - మా మనుస్మర యుధ్య చ
మయ్యర్పిత మనో బుద్ధి - ర్మా మే వై ప్యస్య సంశయః  8-7

అంచేత మనం చేయవలసిన సాధన ఏమిటింతకూ. క్రొత్తగా ఏదో సాధిం చడమనేది ఎప్పుడూ లేదు. ఉన్న దానినే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మన స్వరూపమే. శుద్దమైన సర్వవ్యాపకమైన చైతన్యం. అహమహ మనే రూపంలో ఉన్నదది. అలాంటి అహమాకారవృత్తి నెప్పుడూ ఆవృత్తి చేసుకొటూ కూచోటమే మన విధి. ఎప్పుడూ అంటే సర్వకాల సర్వావస్థలలోనని అర్థం. ప్రతిక్షణమూ అలా లనుసంధానం చేస్తూ పోతేగాని వృత్తి దృఢంగా నిలవదు.

ఈ వృత్తికే బ్రహ్మాకారవృత్తి అనీ- అఖండాకారవృత్తి అనీ - ఆత్మాకార వృత్తి అనీ - పర్యాయపదాలు, ఒక్క నిమిషంకూడా దీని నేమరరాదు. సంగీతంలో శ్రుతిలాగా ఇది ఎప్పుడూ అంటిపట్టుకొనే ఉండాలి సాధకుణ్ణి. విస్మరిస్తే ఆ మేరకు మరలా అజ్ఞాన పిశాచం వచ్చి నెత్తిన పడుతుంది. దానితో బ్రహ్మం మరలా నామ రూపాత్మకమైన ప్రపంచంగా భాసిస్తుంది. కాబట్టి ఒకవేళ తాత్కా లికంగా తొలగినా దాని నెప్పటికప్పుడు మరలా అనుసంధానం చేసుకొంటూ పోవాలి. తెగితే ముడి పెట్టటానికే అనుసంధానమని పేరు. దానివల్ల మనో మాలిన్యం ఎప్పటికప్పుడు ప్రక్షాళితమై బ్రహ్మవృత్తి ప్రతిష్టితమవుతుంది.

బ్రహ్మవృత్తిని విస్మరించామంటే దానికి హేతువు ప్రాపంచికవృత్తులే. అవి సవికల్ప వృత్తులు. వాటితో నిర్వికల్పమైన ఈ వృత్తి దెబ్బతినడం సహజమే. అలాంటప్పుడీ నిర్వకల్పవృత్తిని కాపాడుకోవాలంటే ఆ సవికల్ప వృత్తులు ప్రవే శించకుండా వాటితో పోరాటం సాగించవలసి వుంటుంది. ఒకవైపు వాటితో పోరాడుతూ మరొకవైపు తత్త్వాను సంధాన మేమరకుండా ఉండటమే సాధకుడి కర్తవ్యం.

ఇలా రెండు మార్గాలలోనూ అభ్యాసం కొనసాగించామంటే కొత కాలానికి అసలీ సవికల్పవృత్తులు చిత్తంలో తల ఎత్తనేలేవు. దానితో బ్రహ్మవృత్తి ఒక్కటే ఏకచ్ఛత్రాధిపత్యంగా రాజ్యం చేస్తుంది. సాధకుడి మనసు-బుద్ది- ఈ రెండూ కలిసి ఆ క్షణంనుంచీ బ్రహ్మమునందే అర్పితమౌతాయి. అదే నిజమైన ఆత్మా ర్పణ. ఈ అర్పణ అతణ్ణి తిన్నగా బ్రహ్మవదానికే తీసుకుపోతుంది. సందేహం లేదు.