#


Back

పూర్వార్థమ్


5
దేహీ నిత్య మవధ్యోయమ్-దేహే సర్వస్య భారత
తస్మా త్సర్వాణి భూతాని-నత్వం శోచితు మర్హసి .  2-30

పరమాత్మను వర్ణించిన ఘట్టమయింది. ప్రస్తుతం జీవాత్మను వర్ణించే ఘట్టమిది. పరమాత్మ వంటిదే జీవాత్మ. ఎందుకంటే అదీ చైతన్యమే. ఇదీ చైతన్యమే. అయితే అది విశ్వవ్యాప్తం కాబట్టి అఖండం. ఇది శరీర మాత్ర పరిచ్ఛిన్నం కాబట్టి సఖండం. అంతే తేడా.

ఒక జీవాత్మ ఏమిటి. ప్రపంచమంతా చైతన్యమయమే గదా. వాస్తవమే. కాని ఈ ప్రపంచంలో ఆ చైతన్య మెక్కడ బడితే అక్కడ ఉద్భూతం Manifest కాదు. ఒక్క జీవ చ్ఛరీరం లోనే Living organism అది చక్కగా అభివ్యక్తమయి కనిపిస్తుంది. ఇంతెందుకు మన ముఖాని కెదురుగా ఒక గోడ ఉంటుంది. తడికె ఉంటుంది. అద్దముంటుంది. అద్దంలో ప్రతి ఫలించినట్టుగా అది తడికెలో గాని కుడ్యంలోగాని ప్రతిఫలించదు గదా. అలాగే చైతన్యం కూడా. అందుకే ఈ జీవుడొక్కడే దేవుడికి వారసుడని చెప్పటం. సృష్టిలో మరి దేనికీ ఆ యోగ్యత లేదు.

జీవుడికి కూడా ఈశ్వరుడికి లాగే ఒక శరీర మున్నది. అది బ్రహ్మాండ మయితే ఇది పిండాండ మన్నారు. ఆ శరీరాన్ని అది వ్యాపించినట్టే ఈ శరీరాన్ని ఇదీ వ్యాపించి ఉంది. అది ఎలా నిత్యమో ఇది కూడా అలాగే నిత్యం. నిత్యం కానిదీ నిరంతరం మార్పు చెందేదీ అక్కడా ఇక్కడా ఈ శరీరమే. మన ఈ శరీరం పుడుతుంది. గిడుతుంది. కాని దీనిలో ఉన్న అహమనే స్ఫురణకు మాత్రం పుట్టుక గిట్టుకా లేదు. మధ్యలో కూడా ఎలాటి వికారాలూ Changes లేవు.

అంచేత ఈ దేహం రేపు నశించిపోతుంటే దానితోపాటు మన ఆత్మ కూడా నశిస్తుందే అని మనం దిగులు పడనక్కరలేదు. విశ్వతో వ్యాప్తి అయిన ఆ పరమాత్మ చైతన్య మెలాగో అలాగే ఈ జీవ చైతన్యం కూడా అహమనే స్ఫూర్తితో ఎప్పటికీ నిలిచి ఉంటుందనే ధీమాతో ఉండాలి మనం, పోతుందనే బెంగ ఏ మాత్రమూ పెట్టుకోరాదు.

కాకపోయినా అది ఎలా పోగలదు. ఒక నిర్దిష్టమైన రూపముంటే గదా పోవటానికీ రావటానికీ. చైతన్య మొక్కటే దానికున్న రూపం. అది ఒక దాన్ని కనిపెట్టవలసిందే గాని దానినేదీ కనిపెట్టేది లేదు. కనిపెట్టే దెప్పుడూ మార టానికి లేదు. మారితే ఆ మార్పును కనిపెట్టవలసిందదే గదా. కాబట్టి మారదు. మారకుంటే నశించబోదు. దాని పాటి కది సశించక పోయినా మరొక పదార్థమేదైనా నశింపజేయవచ్చు గదా అంటే అది సర్వ వ్యాపకం. సర్వమూ అదే అయి నప్పుడు దానికి విజాతీయమైన భావమేలేదు కదా. ఇక మరొక కాని చేతిలో అది ఎలా నశించటం.

పోతే ఇత పరిశేష న్యాయంగా దాని చేతిలో అదే సశిస్తుందని చెప్పవలసి వస్తుంది. అది మరీ అర్థరహితమైన ప్రసంగం అగ్ని తన్ను తాను కల్చుకో గలదా. ఆటగాడు తన భుజాల మీదనే తానెరుగలడా. అలాగే ఆత్మ చైతన్యం తన్ను తాను నిర్మూలించుకోట మసంభవం. నిర్మూలన క్రియకు కూడా అదే సాక్షి కావలసినప్పుడది నిర్మూలనమెలా కాగలదు. కాబట్టి ఆత్మ ఎప్పటికీ నశించేది కాదు. కాకుంటే ఇకమనకెలాటి భయాందోళనలూ చెందవని లేదు.