#


Back

పూర్వార్థమ్


49
యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం!
తంత మేవైతీ కౌంతేయ.సదా తద్భావ భావితః  8-6

ఇందుకు సందేహంలేదు. ఎందుకంటే అసలు ఒక్క పరమాత్మ భావమే గాదు. ఏయే భావాన్ని సాధకుడు ధ్యానిస్తూ కూచున్నా ఆ భావాన్నే అవసానంలో పొంద గలుగుతాడు. స్థూలమైన కళేబరమిక్కడే పడిపోవచ్చు కాని సూక్ష్మమైన అతని జీవచైతన్య మాధ్యేయ స్వరూపాన్నే అందుకొని అలాగే ఉండిపోతుంది. ఇందులో ఉన్న ఉపపత్తి ఏమిటని అడగవచ్చు. అన్యచింతమాని ఒకే ఒక భావాన్ని అంటిపట్టుకో గలిగితే చాలు. మనస్సు తదాకారంగా మారటానికి అవకాశం ఉంది. తద్భావ భావన మనేది ఇదే. భావన అనేమాట చాలా గంభీర మైంది. ఒక వస్తుగుణాన్ని మరొక వస్తువుకు పట్టించటానికి భావన మని పేరు. వైద్య శాస్త్రంలో కూడా ఈ శబ్దం తరుచుగా వినబడుతుంది భావన అల్లం భావన జీలకర్ర అనేవి ఇలాంటివే. మామూలు అల్లం-జీలకర్ర- ఔషధాలు కాకపోయినా పుటం పెడితే అవే ఔషధాలుగా పని చేస్తాయి.

పోతే వేదాంతులు వర్ణించే భ్రమర కీటన్యాయ మొకటి ఉంది. అదికూడా ఇలాంటి భావనే. నిరంతర భ్రమర సాహచర్యల వల్ల తదీయ ఝంకారా కర్ణణం వల్ల కొన్నాళ్ళకు కీటకం భ్రమరంగా మారిపోతుంది. అంతేందుకు పరుస వేది ప్రభావం వల్ల లోహం బంగారంగా మారటం లేదా. అంటు కట్టటం మూలంగా ఒక చెట్టుకు మరొక చెట్టు లక్షణాలు సంక్రమించటం లేదా.

దీనిని బట్టి జీవుడు కూడా నిరంతర స్మరణ మూలంగా ఈశ్వర తత్త్వాన్ని పొందటంలో ఆశ్చర్యం లేదు. ఆ మాటకు వస్తే క్రొత్తగా పొందటం కూడా కాదిది. అంతకుముందు కూడా ఈశ్వరుడే జీవుడు. అయితే అ విద్యా దోషం వల్ల కాదనుకొని సంసార జంబాలంలో చిక్కుకొన్నాడు. ప్రస్తుతం శాస్త్రాచార్య ప్రబోధజనిత నిరంతరాను సంధానం వల్ల మరలా తన ఈశ్వరత్వాన్ని తాను జ్ఞప్తికి తెచ్చుకో గలిగాడు. ఇదే పొందట మనే మాటకు అర్థం.