#


Back

పూర్వార్థమ్


46
జరా మరణ మోక్షాయ-మా మాశ్రిత్య యతంతి యే
తే బ్రహ్మతద్విదుః కృత్స్న-మధ్యాత్మం కర్మ చాభిలం  7-29

అయితే ఇంత శ్రమపడి అయినా ఆ భగవత్తత్త్వాన్ని పట్టుకోవలసిన అవ సరం ఏమిటి. స్వాభావికమైన జీవభావం తోనే ఉంటే సరిపోలేదా అని మరలా పూర్వ పక్షం చేయవచ్చు.

జీవభావం మనకు సుఖదాయకమైతే మంచిదే. ప్రాకులాడ బనిలేదు. కాని అది ఉన్నంతవరకూ సుఖమనే వాసనే లేదు మనకు. అడపా దడపా ఏదో కొంత ఉన్నట్టు కనిపించినా అది ఒక ఆభాసే Pseudo. రెండు కష్టాల మధ్య ఏర్పడే విరామాన్నే సుఖమని భ్రమిస్తున్నాము మనం. అంచేత జీవితమంతా కష్టభూయిష్ఠమే. సుఖపడుతున్నామనేది కల్ల. జన్మవ్యాధి జరా మరణాది బాధ లనేవి అనుభవించని ప్రాణిలేడు. ప్రాణి ఎప్పుడూ బాధారహితమైన స్థితినే వాంఛిస్తాడు.

అయితే జరా మరణాదులున్నంతవరకూ అలాంటి సుఖైకతానమైన దశ సంభవం కాదు. కాబట్టి వాటినుంచి బయటపడే ప్రయత్నమే మనమెప్పుడూ చేయవలసిన కార్యం. ఆ ప్రయత్నం కూడా మరేదో కాదు. నిరంతరమూ భగవ చ్చింతన కలిగి ఉండటమే. తదాకార వృత్తి ఎప్పుడేర్పడుతుందో అది సర్వ వ్యాపకం కాబట్టి జీవితమంతా దానితోనే నిండి పోతుంది.

జీవితమంతా ఎలా నిండుతుందని అడగవచ్చు. అక్కడే ఉంది రహస్యం మిగతా ప్రాపంచిక వృత్తులలాంటిది కాదు బ్రహ్మ వృత్తి. నేనూ-నేను చూచే సమస్తమూ కూడా చైతన్యమేననే భావన అది. ఆ భావనలో జ్ఞానంకంటే వేరుగా జైయపదార్థం లేదు. అంతా జ్ఞాన స్వరూపమే. అంచేత అది అఖండం. పరి పూర్ణం పరిపూర్ణం కనుకనే దానిని బ్రహ్మమన్నారు. పరిపూర్ణమైన జ్ఞానం మనకుదయించిందంటేనే అప్పటికి బ్రహ్మమనేది పరిపూర్ణంగా మనకు బోధపడిందని అర్థం. అది బోధపడిందంటే మన ఆత్మ కూడ మన కవగత మయింది. ఆత్మరూపమే గదా బ్రహ్మమంటే. అంతేకాదు. మనం చేసే కర్మలన్నీ కూడా మనకు బ్రహ్మాకారం గానే అనుభవానికి వస్తాయి. అంటే ఏమన్నమాట. బ్రహ్మకార వృత్తి కలిగిందంటే అదీ-నేనూ- ఈ ప్రపంచమూ-మూడూ కలసి అఖండ చైతన్య రూపంగానే అనుభవానికి వచ్చి తీరాలని తాత్పర్యం.