#


Back

పూర్వార్థమ్


43
వేదాహం సమ తీతాని - వర్త మానాని చార్జున
భవిష్యాణీచ భూతాని - మాంతు వేద నకశ్చన  7-26

ఇదేమిటే అన్యాయం. మాయా శక్తి జీవేశ్వరుల నిద్దరినీ కమ్ముతూ ఉందని గదా పేర్కొన్నారు. అందులోనూ అది ఈశ్వరుడికి చెందినదే కదా ఆ మాయ, ఈశ్వరుణ్ణి ఆవరిస్తూ గదా అది జీవుడి దృష్టిని కూడా మభ్య పరచటం. అలాం టప్పు డీశ్వరుడి కది హాని చేయక పోవటమేమిటి. జీవుడే దాని బారికి చిక్కట మేమిటని ప్రశ్న వస్తుంది.

నిజమే, ఈశ్వరుడినీ అది బాధించ వలసిందే. కానీ బాధించే స్తోమత లేదు దానికి. కారణం అది ఈశ్వర తత్త్వాని కంటే భిన్నమైన పదార్థం కాదు. ఈశ్వర ప్రకృతే అది ప్రకృతి అంటే స్వభావం. తన స్వభావం తన కెప్పుడూ హాని చేయదు. ఇంతెందుకు. అగ్నికి ఉష్ణత అనేది స్వభావం. అది దేనినైనా నిమి షంలో దహించి వేస్తుంది. కాని అగ్ని నేమీ చేయలేదది.

ఇంకా ఒక దృష్టాంతం కూడా చెప్పుకో వచ్చు ఇక్కడ. ఒకడొక పెద్ద దుర్భిణీ పెట్టుకొని దూరం నుంచి అందరినీ చూస్తుంటాడు. దుర్భిణీ వాడి కండ్ల కడ్డంగా ఉంది. కాబట్టి వాడి ముఖాన్ని ఎవరూ చూడలేరు. కాని వాడు మాత్రం ఆ దూర దర్శినిలో నుంచి అక్కడ ఉన్న నలుగురినీ చక్కగా చూడ గలుగుతాడు. అది వాడి కండ్లమీదనే ఉన్నావాడి చూపుల కేమాత్రమూ అడ్డురాదు.

అట్లాగే యోగమాయ పరమేశ్వరమైన తత్త్వాన్ని ఎంత ఆవరించి నప్పటికీ ఆయన జ్ఞాన దృష్టి కది ఏ మాత్రమూ ప్రతి బంధకంకాదు. ఆయన జరిగిన దాన్ని చూడ గలడు. జరుగుతూ ఉన్న దాన్ని దర్శించ గలడు. జరగబోయే దాన్ని ఆకళించ గలడు. ఎటు వచ్చీ చుట్టూ ప్రేక్షకుల లాగా నిలబడి చూచే మన లాటి జీవుల దృష్టికే అంతా ఆగమ్య గోచరం.

ఇక్కడ మన మర్థం చేసుకోవలసింది ఒక్కటే. ఆవరణ మనేది ఈశ్వరుడికి లేదని కాదు. ఉన్నా అది ఒక దుర్భిణి లాగా ఆయన దృక్శక్తిని నిరోధించడం లేదు. పోతే జీవుడి కది దుర్భిణీ లాగా పనిచేయక పోవటం మూలాన్నే అతని దృష్టి ఎక్కడి కక్కడ నిరుద్ధమౌతున్నది. అసలా మాటకువస్తే జీవుడిదే ఆవరణం అతడీశ్వరుణ్ణి సగుణంగా చూచినంత వరకూ అతని దృష్టి సావరణ Veiled మౌతుంది. అదే నిర్గుణంగా చూచిన నాడు నిరావరణమే unveiled అవు తుంది. ఇంతకూ జీవుడి దృష్టి భేదాన్ని అనుసరించి ఏర్పడ్డవే ఆవరణమైనా అనావరణమైనా. స్వతహాగా ఈశ్వరుడి కేదీ లేదు.