పూర్వార్థమ్
4
నజాయతే మ్రియతేవా కదాచిత్
నాయమ్ భూత్వా భవితావా నభూయః
అజో నిత్య శ్శాశ్వతో యమ్ పురాణో
నహన్యతే హన్య మానే శరీరే 2-20
ప్రపంచంతో పోరాడితే మనకే విజయం లభిస్తుందని ఏమిటి నమ్మకం. మన మాత్మ స్వరూపులం. పరమాత్మ వారసులమే మనం. పరమాత్మవలన సృష్టి అయిందీ ప్రపంచం. ఆయన మాయాశక్తి విలాసమే కదా ఇదంతా. ఆయన వస్తువైతే ఇది తదా భాస. ఆభాస గనుకనే ఇది ఆరు రకాలైన పరిణామా లకు గురి అవుతూ ఉంటుంది. పుట్టటమూ - ఉండటమూ - పెరగటమూ మారటమూ - తరగటమూ - నశించటమూ ఈ ఆరు భావవికారాలనూ పొందని పదార్ధమే కానరాదు సృష్టిలో.
అయితే ఇవన్నీ ఈ జ్ఞేయ రూపమైన జగత్తుకే పరిమితం. దీనినంతటినీ భాసింపజేసే ఆత్మచైతన్యానికి లేవు. చైతన్య మనేది అజం. అజమంటే జన్మలేనిది. జన్మలేనిదంటే పై జెప్పిన ఆరు వికారాలలో మొదటిది లేదని అర్థం. మొదటిదే లేకపోతే మిగతా అయిదింటికీ అసలాస్కారమే లేదుగదా. అంచేత ప్రపంచం లాగా అది అనిత్యం కాదు. నిత్యం. నిత్యాలు కూడా చాలా ఉన్నట్టు కనిపిస్తాయి మనకు. పృధి వ్యాది భూతాలు చాలాకాలమున్నట్టు తోస్తాయి. అయితే అది సాపేక్ష నిత్యత్వం, ఎప్పటికైనా లయమై పోవలసిందే. పోతే ఇది నిరపేక్షమైన నిత్యత్వం కాబట్టి అలా పోయేదికాదు. కనుకనే శాశ్వతమన్నారు దీన్ని.
అయినా చమత్కార మేమంటే శాశ్వతమూ అద్వితీయమూ అయినా ఆ చైతన్యం చైతన్య రూపంగానే నిలిచిపోవటం లేదు. అలా కదలకుండా ఏక రూపంగా నిలిస్తే అనేకాత్మకమైన ఈ ప్రపంచం మనకసలు కనిపించేది గాదు. ఇది ఇలా కనిపిస్తున్నదంటే అది ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా చిత్రవిచిత్రమైన రూపాలు తాలుస్తూ ఉందని అర్ధం. అయితే ఎన్ని రూపాలు దాల్చినా చైతన్యమనే అసలు రూపాన్ని అది వదిలి పెట్టదు. పురాణః అని వర్ణించటంలో ఇమిడి ఉన్న అంతరార్థ మిదే. పురాపి నవ ఏవేతి పురాణః అన్నారు. పూర్వమున్నదే అయినా అపూర్వంలాగా కనిపించేదేదో అది పురాణం. పూర్వమున్నది చైతన్యం. అపూర్వంగా కనిపించేవి నామ రూపాలు. జ్ఞేయంగా కనిపించే ఈ నామ రూపాలు దానివే కాబట్టి ఇది ఏమిటా అని విచారణచేస్తూ పోతే వీటి కధిష్ఠానమైన ఆ శుద్ధ చైతన్యమే మనకు తారసిల్లుతుంది. అంచేత ఎన్ని రూపాలుగా భాసించినా అది వాస్తవానికి సద్వితీయం కాదు. అద్వితీయమే.
కనుకనే "నహన్యతే హన్య మానే శరీరే.” పరమాత్మను వర్ణించే ఘట్టం కాబట్టి శరీర మంటే ఇక్కడ అనంతంగా వ్యాపించిన ఈ విశ్వమే శరీరం. మనది పిండ శరీరమైతే ఇది బ్రహ్మాండ శరీరం. ఈ బ్రహ్మాండమే పరమాత్మకు శరీరమయి కూచుంది. దీనిలో ప్రతి అణువూ ఆ చైతన్యంతో నిండినదే. అయితే ఎలాంటి మార్పు కలిగినా ఈ శరీర భాగాలకు కలగవలసిందే గాని దాని నావరించి ఉన్న చైతన్యాని కది ఏమాత్రమూ అంటబోదు. దేశ కాలానుగుణంగా ఈ బాహ్య ప్రకృతి ఎన్నో మార్పులకు పాల్పడుతుంటుంది. ఉన్నవి నశిస్తాయి. వాటి స్థానంలో అంతకు ముందులేనివి తల ఎత్తు తుంటాయి. అవీపోయి కొంత కాలానికి మరికొన్ని పొడచూపటం కద్దు. ప్రవాహ న్యాయంగా ఇది ఇలాగే సాగుతూ పోవటం చూస్తున్నాము. అందుకే దీని కసలు సంసారమనే పేరు సార్ధకంగా ఏర్పడింది.
సంసారం కాబట్టి దీనిలో ఇలాంటి పరిణామాలు కలుగుతూ పోవటం సహజమే. కాని అవి ఈ ప్రకృతి మేరకు వచ్చి నిలచి పోవలసిందే. దాని ప్రతి అణువునూ వ్యాపించి ఉన్న ఆ చైతన్యాన్ని మాత్రమివి ఏ మాత్రమూ స్పృశించ లేవు. కారణం అది ఆకాశంలాగా నిరాకారం. నిరంజనం. ఆకాశమైనా ఇంకా జడమైన పదార్థం. పోతే ఇది జడంకాదు. శుద్ధ చైతన్యం. దాని నిక ఏగుణం గానీ అంటే దేముంది. గుణాలేవైనా దానికి విషయం కావలసిందే గదా. విషయమైతే దానికి బాహ్యంగా ఉండవలసిందే. సన్నిహితం కాదు. సన్నిహితం కాకపోతే అంటుకొనే ప్రశ్నలేదు.