#


Back

పూర్వార్థమ్


29
త్రివిధమ్ నరక స్వేదమ్ - ద్వారమ్ నాశన మాత్మనః

త్రిగుణాలంటే సత్త్వ రజస్త మస్సులని గదా పేర్కొన్నాము. ఇవి ప్రతి వ్యక్తి లోనూ వాటి ప్రభావం చూపుతూనే ఉంటాయి. మనలో చోటుచేసుకొని నిత్యమూ మనలను పీడించే గర్భశత్రువులు మూడున్నాయి. ఒకటి కామం, మరొకటి క్రోధం. వేరొకటి లోభం. ఇవి మూడూ ఏవో గావు. ఆ గుణాల తాలూకు దుష్పరిణామమే. ఇందులో సత్త్వ ప్రభావం వల్ల ఏర్పడింది కామమైతే -రజ: ప్రభావంవల్ల లోభమైతే తమోగుణం మూలంగా జనించింది క్రోధం. అవి మూడూ జీవితాంతమూ సరాసరిమనలను నరకానికే చేరుస్తాయి. నరక ద్వారాలివి. మామూలుగా అవి మూతపడి ఉంటాయి. ఈ కామాదులకు దాసు లమై ఏమరు పాటుతో ఉన్నా మంటే మాత్రం ఎప్పుడూ మన పాలిటి కవి తెరవబడే వుంటాయి. మరణానంతరం వాటి ద్వారా నిరయంలో ప్రవేశించకా తప్పదు. అసి పత్ర రౌరవాది సరక దుఃఖాల సనుభవించకా తప్పదు.

అంచేత వాటి బారినుంచి తప్పించుకోవటానికే ఎప్పటికైనా మానవుడు ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే ఏమి చేయాలి మనం. కామక్రోధాదు లను దూరం చేసేకోవాలి. వాటినెలా దూరం చేయాలి. వాటి శత్రుపులేవో వాటిని మనం మిత్రులను చేసుకోవాలి. వాటి శత్రువులు వరుసగా కామానికి దమం. లోభానికి దానం. మరి క్రోధానికి దయ. ఒకప్పు డీమూడింటినీ అల వరచుకొని బ్రతుకండని బ్రహ్మ దేవుడు దేవ మానవదానవులకు ముగ్గురికీ బోధించి పంపాడట. దేవతలు మామూలుగా కామలోలుపులు. కాబట్టి వారికి ఇంద్రియ నిగ్రహ రూపమైన దమ మవసరం. మానవులు సాధారణంగా లోభ గ్రస్తులు. ఎంత ఉన్నా తృప్తిజెందని స్వభావం మనది. కనుక దానికి విరుగుడుగా దాన మలవరచుకోవాలి మానవుడు. పోతే ఇక రాక్షసులు క్రోధైక పరాయణులు. నిష్కారణంగా పరులను బాధించటమే వారి స్వభావం కాబట్టి దానికి చేయ వలసిన చికిత్స దయాగుణం.

ఆ మాటకు వస్తే ఈ దేవ దానవ మానవు లెక్కడో లేరు. మానవులలోనే ఉన్నాయి వాస్తవాని కీమూడు తరగతులూ. కామ క్రోధ లోభాలు మనలో లేకపోతే గదా. అవే దేవాది జాతులకు ప్రతీకలు Symbols. వీటి మూటినీ నిర్మూలించు కోటానికి దమ దాన దయా గుణాల నభ్యసిస్తూ పోమ్మని మనకు చేసిన బోధే ఇదంతా. ప్రతి సంవత్సరమూ వర్షర్తువులో మేఘం “ద ద ద” అని గర్జిల్లటంలో కూడా ఈ దమదాన దయలే ధ్వనిస్తున్నా యంటుం దుపనిషత్తు. ఆ శబ్దం వినేది మానవుల మైన మనమే గదా. కాబట్టి మనకే ఈ సందేశం. మరెవరికీ గాదు.

ఈ సందేశాన్ని అందుకొని దమాది గుణాల నల పరుచుకొని క్రమంగా సత్త్వరజస్తమో గుణాల ఫలితంగా ఏర్పడిన ఈ కామ క్రోధాదులను దాటి పోయామా - త్రిగుణా తీతులమై గుణాతీతమైన ఆ పరమాత్మ తత్త్వాన్నే మన స్వరూపంగా అనుభవానికి తెచ్చుకోగలం. తద్వారా మృత్యువునే జయించ గలం. లేదా వాటికి బానిసలమై వాటి ఉక్కు కోరలలో చిక్కి శాశ్వతంగా ఆత్మ వినాశాన్ని కోరి తెచ్చుకోగలం. ఆత్మకు వినాశ మేమిటని ఆశ్చర్య పడరాదు. దాని అస్తిత్వాన్ని మరచి పోవటమే దాని వినాశం. వినాశమంటే పోగొట్టుకోట మని గదా అక్షరార్థం. ఉన్నా గుర్తించక పోతే అది దాన్ని పోగొట్టు కోటమే. మెడలో ఉన్న గొలుసు ఉన్నదని గుర్తించ లేక ఇక్కడా అక్కడా వెతుకుతూ కూచున్నంత వరకూ అది మన పాలిటికి లేనిదే. అంచేత ఇలాంటి అనర్థం నుంచి బయట పడాలంటే దానికి మూల కారణమైన త్రిగుణాల సంపర్కానికి తిలాంజలి ఇవ్వాలి.