#


Back

పూర్వార్థమ్


27
మనుష్యాణాం సహస్రేషు-కశ్చి ద్యతతి సిద్ధయే
యతతా మపి సిద్ధానామ్-కుశ్చి న్మాం వేత్తి తత్త్వతః  7-3

కాటుక కొండల మాదిరి ఈ కర్మపుంజ మిలా పెరిగిపోవటం మూలాన్నే ఎన్నో జన్మలకు జ్ఞానోదయం కలగటం అలా ఉంచి దానికోసం ప్రయత్నం చేయాలనే బుద్ధి కూడా అసలు ఎన్ని జన్మలకో గాని పుట్టదు. అందుకే కొన్ని వేలమంది కొకడు కనిపిస్తాడు సాధకుడని చెప్పబడేవాడు.

వాడు కూడా ఆ పరమార్థాన్ని ఉన్నదున్నట్టు పట్టుకోగలడని చెప్పలేము. వాడు తాను పట్టుకొన్నదేదో అదే సిద్ధి అని భావిస్తుంటాడు. అలాంటి సిద్ది నార్జించిన వారిలో కూడా కొన్ని వేల మందిలో ఎవడో ఒక్క మహానుభావు డుంటాడు తత్త్వవేత్త.

అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. సిద్ధుడంటున్నారు. తత్త్వవేత్త అంటు న్నారు. ఇద్దరూ ఒకటికాదా అని కాదు. సిద్ధివేరు. తత్త్వజ్ఞానం వేరు, రెండూ ఒకటి కాదు. ఒకటే అయిననాడు దేవతలు మహర్షులు మరి సిద్దులే కదా. వారు తత్త్వజ్ఞానం కోసం ప్రాకులాడటం దేనికి. అలా ప్రాకులాడుతున్నట్టు మనకు ఉపనిషత్తులలోనే నిదర్శనా లనేకం కనిపిస్తున్నాయి. త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు బ్రహ్మవద్దకు పోయి బ్రహ్మవిద్య నాకుపదేశించమని ప్రాధేయ పడతాడు. పోతే నారదమహర్షి లాంటివాడు మనో వ్యాకులతతో సనత్కుమారుని సమీపించి తరణోపాయమేమిటో బోధించమని యాచిస్తాడు. దీన్నిబట్టిచూస్తే ఆయా సిద్దులకూ బ్రహ్మానుభవానికీ అసలు ఎలాంటి సంబంధమూ లేదని తేటపడుతున్నది.

సిద్ధి అనేదేమిటి. ఆయా యోగ భూమికలలో సంప్రాప్తమయ్యే ఒకానొక మహిమ. అది కొంత అలౌకికమే అయినా దానివల్ల బ్రహ్మజ్ఞానం మనకు లభిస్తుందనేది కల్ల. బ్రహ్మజ్ఞాన మెప్పుడు కరువైందో అప్పుడు ముక్తి కూడా మనకు పూజ్యమే. కాకున్నా ఈ సిద్దులనేవి కొంతకాలమే మన కనుభవానికి వస్తాయి. ఆ తరువాత ఎప్పుడో ఒకప్పుడు చెప్పకుండానే ఎగిరిపోతాయి. మన మీ కాలంలో చూచే క్షుద్రశక్తులన్నీ ఇలాంటివే. విభూతి రాల్చేవాడు ఒకడైతే విగ్రహాలు తీసే వాడు ఇంకొకడు. ఆ విద్య వాడికి నిలిచేది కాదు. నిలిచే విద్యను వాడభ్యసించేది లేదు.

కాబట్టి అసలు ప్రయత్నించకున్నా సుఖం లేదు. ప్రయత్నిస్తే ఇలాంటి అల్పసిద్దుల వరకే పరిమతమైనా సుఖంలేదు. వాటిని కూడా దాటిపోయి అన్నింటికీ మూల భూతమైన తత్త్వమేదో దానినే ఎప్పటికైనా అందుకోవాలి సాధకుడు. అదే నిజమైన సిద్ది మరేదీకాదు.