#


Back

పూర్వార్థమ్


19
తపస్విభ్యోధికో యోగీ-జ్ఞానిభ్యశ్చ మతోధికః
కర్మభ్యశ్చాధికోయోగీ-తస్మాద్యోగీ భవార్జున  6-46

యోగమంటే సమధర్శన మని చెప్పాము. దాన్ని మన మర్థం చేసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. ఆచరణలో పెట్టినప్పుడే దానికి విలువ. అస లాచరించిన వాడే యోగి. కనుకనే వాడందరికన్నా గొప్పవాడు. అందరికన్నా అంటేఎవరా అందరు.

ఒకరు తపస్వులు. వీరిని గొప్పగా చూస్తాము మనం. తపస్సు చేశారంటే ఎంతో గొప్ప అని మన నమ్మకం. నిజానికేమంత గొప్పకాదది. సాంప్రదాయి కంగా చూస్తే తపస్సనే మాటకు తపించడం- అన్న పానాదులు మాని శరీరాన్ని శుష్కింప చేసుకోవటం అని అర్థం. కృచ్ఛ చాంద్రాయణాదులైన వ్రతాలన్నీ ఇలాంటివే. వీటివల్ల మనో మాలిన్యం పోతుందనేది వట్టిమాట ఇంకా ఎక్కువవు తుందేమో కూడా. అందుకే గదా రాక్షసులు ఎంతో ఘోరమైన తపస్సుచేసి కూడ వారికి రాగద్వేషాలు నశించనిది. మహర్షులు కూడ కొంతమంది తపస్సంపన్నులైన వారు తమదారి కడ్డు తగిలిన వారి నందరినీ శపించటం మానలేదు. దీనినిబట్టి తపస్సనేది యాంత్రికమైన ఒక పరిశ్రమలాంటిదే గాని మరేమీ కాదు.

అట్లాగే జ్ఞానం కూడ గొప్పకాదు. జ్ఞానం కాకపోవడమేమిటి - అదే గదా తత్త్వాన్ని సాధించటాని కేకైక సాధనం అని శంకించవచ్చు. నిజమేగాని అది కేవలం పుస్తక జ్ఞానమయితే పనికిరాడు పుస్తక జన్యమైనది అనుభవానికి రావాలి అప్పుడే అది ఆత్మదర్శనానికి సాధనమవుతుంది. అనుభవమే గదా యోగమని పేర్కొన్నాము. అంచేత ఆ స్థాయికి రాని పరోక్ష జ్ఞానమూ తగ్గు జాతిదే.

పోతే ఇక కర్మ. అది ఇంకా తక్కువ స్థాయి. కేవల మీ భౌతిక ప్రపంచం తోనే ముడిపడి ఉన్నదది. ఆత్మ స్పర్శకూడా లేదు దానికి. ఫలాపేక్ష లేకుండా చేస్తేనే అదైనా కొంత ఫలిత మిచ్చేది. ఫలాపేక్ష లేకుంటే అది యోగానికి కొంత దోహదం చేస్తుంది.

కనుక ఇంతకూ ఫలితాంశ మేమంటే తపోజ్ఞాన కర్మలనేవి ఏవి మోక్షానికి సాక్షాత్తుగా సాధనాలు కావు. అవే సమదర్శనమనే యోగంతో చేరి పనిచేస్తే సాధనాలవుతాయి అప్పుడిన్ని నామధేయా అనవసరం దానికి యోగమనే పేరొక్కటే చాలు, దాని సభ్యసించటమే సాధకుని కర్తవ్యం వాడే అందరికన్నా విశిష్టుడు.